రిస్కులేదు షర్మిలక్కా.. ఎడాపెడా కోసేయ్!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీకి చాలా కష్టాలుంటాయి. ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక హామీ ఇస్తున్నామంటే.. ముందు వెనుకలు చూసుకుని మాట్లాడాలి. రేప్పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత.. చెప్పిన ప్రతిమాటకు…

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీకి చాలా కష్టాలుంటాయి. ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక హామీ ఇస్తున్నామంటే.. ముందు వెనుకలు చూసుకుని మాట్లాడాలి. రేప్పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత.. చెప్పిన ప్రతిమాటకు కట్టుబడి ఉండాలనే నైతిక కట్టుబాటు వారిని వెంటాడుతూ ఉంటుంది.

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకపోతే ప్రజల్లో చులకన అయిపోతాం అనే భయం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిలక్కకు అలాంటి రిస్కు ఎంతమాత్రమూ లేదు. ఆమె ఎలాంటి పెద్ద హామీలైనా ఇచ్చేయవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో ఆమె గానీ, ఆమె పార్టీగానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అందుకే షర్మిల, తమపార్టీ కూడా ఊహించనంతటి పెద్ద హామీలను గుప్పిస్తున్నారు.

ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే.. తాను తెలంగాణ వదలి ఇక్కడి కాంగ్రెసు రాజకీయాల్లోకి వచ్చానని అంటున్న షర్మిల.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ‘ఇందిరమ్మ అభయం’ కింద ప్రతి ఇంటికీ మహిళల పేరు మీద రూ.5వేల ఆర్థిక సహాయం అందజేస్తామంటూ ప్రకటించడం విశేషం.

ఇదే హామీ తెలుగుదేశం గానీ, జనసేన గానీ ఇచ్చి ఉంటే.. ఆ హామీ గురించి చర్చోపచర్చలు జరిగేవి. అసలు అది ఆచరణ సాధ్యమేనా? ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇస్తున్నారు. అందరికీ ఇస్తారా? తెల్లరేషన్ కార్డులకు మాత్రమే అంటారా..? అంటూ రకరకాల అనుబంధ ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవి. కానీ.. ఆ హామీ ఇచ్చినది షర్మిల గనుక దాని గురించి చర్చ జరిగే అవకాశమే లేదు.

షర్మిలకు కూడా రిస్కులేదు. అయిదు వేలేం ఖర్మ, తాము అధికారంలోకి వస్తే ఇంటింటికీ నెలకు పదివేల రూపాయలు జీతం లాగా ఇస్తాం అని కూడా ఆమె ప్రకటించవచ్చు. అయినా సరే.. వారికి రిస్కులేదు. వారు అధికారంలోకి రాబోయేది కూడా లేదు కాబట్టి.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

అయినా కాంగ్రెసు పార్టీ నాయకురాలిగా.. ఏదైనా హామీ ఇచ్చే ముందు షర్మిల ఒక్కవిషయం ఆలోచించుకోవాలి. ఏదైనా తాను హామీ ఇస్తూ.. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ఏలుబడి సాగిస్తున్న ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అలాంటి హామీని అమలు చేస్తే తప్ప.. ఏపీ ప్రజలు నమ్మరని గ్రహించాలి. ఇటు తెలంగాణలో, అటు కర్నాటకలో కాంగ్రెసే రాజ్యం చేస్తుండగా.. అక్కడ ఆలోచన మాత్రంగా కూడా లేని హామీలను ఏపీలో షర్మిల ప్రకటిస్తే  జనం నవ్వుకుంటారు తప్ప నమ్మరు.