
ప్రధాన ప్రతిపక్షం నాలుగేళ్ల తర్వాత విజయాల బాటలో ప్రయాణిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని ఆ పార్టీకి ప్రాణం లేచి వచ్చినట్టైంది. వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ఆగడాలు శ్రుతిమించడం, ఎవరినీ లెక్క చేయనితనం వెరసి... ఆ పార్టీకి అపజయాలను తీసుకొస్తోంది. 2019లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడం, అలాగే వైసీపీ 151 సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకుంది.
దీంతో టీడీపీది ఇక ముగిసిన కథ అని అందరూ అనుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు కూడా భవిష్యత్‌పై నమ్మకం కోల్పోయి తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యాయి. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాలను నమోదు చేసుకోవడంతో ఇక పార్టీని ఎదుర్కోవడం సాధ్యం కాదనే పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో టీడీపీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను గతంలో ఎప్పుడూ చూడలేదన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ స్థానాలు టీడీపీ వశం కావడం సంచలనమే. ఎందుకంటే తమ అభ్యర్థుల నామినేషన్లు వెరిఫికేషన్లలో ఆమోదం పొందితే చాలని టీడీపీ సంతోషించే పరిస్థితి. అలాంటిది పైసా కూడా టీడీపీ ఖర్చు చేయకపోవడం, మరోవైపు వైసీపీ కోట్లాది రూపాయలు ఓటర్లకు పంపిణీ చేసినా... గెలుపు మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్నే వరించింది.
ఆ విజయాలు కూడా వైసీపీ అత్యంత బలీయంగా ఉన్న రాయలసీమలోనూ, పరిపాలన రాజధాని ఇస్తామని హామీ ఇచ్చిన ఉత్తరాంధ్రలో దక్కడం టీడీపీకి అతి పెద్ద ఊరట. ఈ మూడు చోట్ల అనూహ్యంగా దక్కిన విజయాలతో టీడీపీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. మూడు పట్టభద్రుల స్థానాల్లో ఓటమితో వైసీపీ షాక్‌లోనే వుంది. ఇది చాలదన్నట్టు తాజా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో టీడీపీ అభ్యర్థి గెలుపొందడం జీర్ణించుకోలేని పరిస్థితి.
ఒకవైపు వరుసగా నాలుగు ఎమ్మెల్సీలను దక్కించుకున్న టీడీపీ భవిష్యత్‌పై కేడర్‌లో భరోసా నింపింది. ఈ విజయాలు జనంలోకి పాజిటివ్ సంకేతాల్ని తీసుకెళుతున్నాయి. ఇదే సందర్భంలో వైసీపీపై అసంతృప్తులు నెమ్మదిగా నోరు తెరిచే ప్రమాదం వుంది. ఎన్నికలకు ఏడాది ముందు... టీడీపీకి సానుకూల ఫలితాలు రావడం ఆ పార్టీకి గొప్ప శుభ సంకేతం.
కారణాలేవైనా జగన్‌పై జనమే కాదు, ఆయన పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా వ్యతిరేకత వుందనే వాదనకు ఈ ఫలితాలు బలం చేకూరుస్తున్నాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదే కాబోలు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా