వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్‌!

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారా? అనే ప్ర‌శ్న‌కు… ఆ పార్టీ నేత‌లు ఔన‌ని స‌మాధానం ఇస్తున్నారు. ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌నే, టీడీపీ ఇన్‌చార్జ్‌పై…

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారా? అనే ప్ర‌శ్న‌కు… ఆ పార్టీ నేత‌లు ఔన‌ని స‌మాధానం ఇస్తున్నారు. ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌నే, టీడీపీ ఇన్‌చార్జ్‌పై సొంత పార్టీ నాయ‌కులే విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరేస్తామ‌ని ఒక వైపు గొప్ప‌లు చెబుతూనే, మ‌రోవైపు ఇన్‌చార్జ్ వైసీపీకి అనుకూలంగా ప‌ని చేశార‌ని ఆరోపించ‌డం విశేషం.

ప్రొద్దుటూరులో టీడీపీకి దిక్కులేని స‌మ‌యంలో ఆ పార్టీ జెండాను ప్ర‌వీణ్‌రెడ్డి మోశారు. యువ‌కుడైన ప్ర‌వీణ్‌కు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో అత‌ను అధికార పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి వ్య‌తిరేకంగా పోరాటాలు చేశారు. ప‌లుమార్లు ఆయ‌న అరెస్ట్ అయి జైలుపాల‌య్యారు. 

క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో ప్ర‌వీణ్ ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను ప‌రామ‌ర్శించ‌డానికి నారా లోకేశ్ వెళ్లారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్రొద్దుటూరులో త‌మ అభ్య‌ర్థి ప్ర‌వీణే అని ఆయ‌న క‌డ‌ప కేంద్రంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో కూడా ప్ర‌వీణ్‌కే టికెట్ అని ఆయ‌న ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. చివ‌రికి టికెట్ మాత్రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికే ద‌క్కింది. దీన్ని ప్ర‌వీణ్ జీర్ణించుకోలేక‌పోయారు. క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు.

అలాగ‌ని ప్ర‌వీణ్ మ‌రో పార్టీలో చేర‌లేదు. రాజంపేట‌లో ఎన్నిక‌ల ప‌ర్య‌వేక్ష‌కుడిగా ప్ర‌వీణ్‌ను టీడీపీ అధిష్టానం నియ‌మించింది. ప్రొద్దుటూరులో ప్ర‌వీణ్ ఎలాంటి ప్ర‌చారం చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌మ‌లాపురం టీడీపీ అభ్య‌ర్థి పుత్తా చైత‌న్య‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌వీణ్‌రెడ్డి కుటుంబం ఆయ‌న సొంత గ్రామ‌మైన కోగ‌టంలో వైసీపీకి అనుకూలంగా ప‌ని చేసింద‌ని ఆరోపించారు. ఈ విష‌య‌మై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి అనుచ‌రులు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వైసీపీ గెలుపు కోసం ప్ర‌వీణ్ ప‌ని చేశార‌ని ఆరోపించారు. త‌న అనుచ‌రులంద‌రినీ వైసీపీలోకి ప్ర‌వీణ్ పంపార‌ని ఆరోపించారు. పార్టీకి ప్ర‌వీణ్ వెన్నుపోటు పొడిచార‌ని ఆగ్ర‌హించారు. ప్రొద్దుటూరు టీడీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు మ‌రోసారి బయ‌ట ప‌డ్డాయి. గెలుస్తామ‌ని ధీమాగా ఉన్న ప్రొద్దుటూరులో ఈ ప‌రిస్థితి చూస్తుంటే… టీడీపీ ప్ర‌చారం చేసుకుంటున్న దానికి, వాస్త‌వానికి చాలా తేడా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.