Advertisement

Advertisement


Home > Politics - Andhra

మ‌రో రఘురామ‌ను తెచ్చుకోవ‌ద్దు జ‌గ‌న్!

మ‌రో రఘురామ‌ను తెచ్చుకోవ‌ద్దు జ‌గ‌న్!

తెలియ‌క న‌ష్ట‌పోతే దాన్ని పొర‌పాటు అంటారు. అదే తెలిసి చేస్తే త‌ప్పు అంటారు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలో వైసీపీది స్వీయ త‌ప్పిదం. ర‌ఘురామను ద‌గ్గ‌ర‌గా చూసిన, అలాగే బాగా తెలిసిన వాళ్లెవ‌రైనా ఆయ‌న్ను రాజ‌కీయంగా చేర‌దీయ‌ర‌నే అభిప్రాయాలున్నాయి. వైసీపీలో కొంత కాలం వుండి, ఆ త‌ర్వాత ప‌చ్చి బూతులు తిట్టి ర‌ఘురామ బ‌య‌టికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

అలాంటి నాయ‌కుడిని రాజ‌కీయ అవ‌స‌రాల కోసం తిరిగి వైసీపీలోకి తీసుకురావ‌డం, ఎంపీ టికెట్ ఇవ్వ‌డం, గెలిపించుకోవ‌డం అన్నీ ప‌ద్ధ‌తిగా జ‌రిగిపోయాయి. అయితే ర‌ఘురామ త‌న నైజానికి త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఇది వైసీపీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేదు. అది కాస్త జ‌గ‌న్, ర‌ఘురామ మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరంగా మారింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌నే కార‌ణంతో ర‌ఘురామ ఎంపీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ప‌లుమార్లు వైసీపీ ఫిర్యాదు చేసింది. అయిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ స్పందించ‌లేదు.

వైసీపీ, ర‌ఘురామ మ‌ధ్య గొడ‌వ పెట్టి బీజేపీ త‌మాషా చూస్తోంది. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ లాంటి మ‌రో నాయ‌కుడిని ఆద‌రించేందుకు వైసీపీ సాహ‌సిస్తుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ సిద్ధ‌మైంద‌నే ప్ర‌చారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టికే గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీ పెద్ద‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

డిసెంబ‌ర్ 1న త‌న పుట్టిన రోజు త‌ర్వాత గంటా పార్టీ మార్పుపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. అయితే అధికారం కోసం వెంప‌ర్లాడే గంటాను చేర్చుకుంటే వైసీపీ ఘోర త‌ప్పిదం చేసిన‌ట్టే అని అంటున్నారు. కేవ‌లం అధికారంలో వుండే పార్టీలో మాత్ర‌మే కొన‌సాగేందుకు ఇష్ట‌ప‌డే గంటా లాంటి వాళ్ల‌ను చేర్చుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని వైసీపీ పెద్ద‌ల‌కు ప‌లువురు చెబుతున్నార‌ని స‌మాచారం.

ర‌ఘురామ‌కృష్ణంరాజు చేష్ట‌ల్ని చూసిన త‌ర్వాత కూడా గంటాను చేర్చుకోవాలనే ఆలోచ‌న చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. టీడీపీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం అయిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీతో గంటా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే విశాఖ‌లో వైసీపీ బ‌ల‌హీనంగా ఉండ‌డం, కాస్త ప‌లుకుబ‌డి ఉన్న నేత‌ల్ని ద‌గ్గ‌రికి తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగానే గంటా విష‌యంలో అధికార పార్టీ సానుకూలంగా ఆలోచిస్తోంద‌ని టాక్ న‌డుస్తోంది. 

గంటా చేరిక‌కు ముహూర్తం కూడా ఖ‌రారు అయ్యింద‌నే ప్ర‌చారం నిజ‌మ‌వుతుందా? లేక ఎప్ప‌ట్లాగే చ‌ర్చ‌కే ప‌రిమితం అవుతుందా? అనేది త్వ‌ర‌లో తేల‌నుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?