Advertisement

Advertisement


Home > Politics - Gossip

మ‌హారాష్ట్ర‌లో మ‌రో పార్టీలో చీలిక‌?

మ‌హారాష్ట్ర‌లో మ‌రో పార్టీలో చీలిక‌?

రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌, పార్టీల చీలిక‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మ‌హారాష్ట్ర‌లో అలాంటిదే మ‌రోటి జ‌ర‌గ‌బోతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ప‌ర్యాయం మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌యిన‌ప్పుడే అక్క‌డ రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌కు తెర‌లేచింది. 

క‌మ‌లం పార్టీతో ముఖ్య‌మంత్రి సీటును బేరం పెట్టిన శివ‌సేన అక్క‌డ అనుకున్న‌ది సాధించ‌లేక పొత్తు కుదుర్చుకున్న పార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వెళ్ల‌లేదు. ఆ వెంట‌నే ఎన్సీపీని చీల్చి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ పార్టీ. అయితే ఆ ప్ర‌భుత్వం కొన్ని గంట‌ల పాటు కూడా స్థిరంగా నిల‌బ‌డ‌లేదు. ఆ త‌ర్వాత బోలెడంత పొలిటిక‌ల్ డ్రామా త‌ర్వాత కాంగ్రెస్-ఎన్సీపీల‌తో కలిసి శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కొన్నాళ్లు పాటు ఆ ప్ర‌భుత్వం మ‌నుగ‌డ కొన‌సాగినా, అవ‌కాశం కోసం ఎదురుచూసిన బీజేపీ చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించింది. శివ‌సేన‌ను నిలువునా చీల్చి త‌మ కూట‌మిలోకి క‌లుపుకుంది. ఉద్ద‌వ్ ఠాక్రేను నామ‌మాత్రం చేసి ఇప్పుడు శివ‌సేన‌ను బీజేపీ పూర్తిగా త‌న గుప్పిట్లోకి తీసుకుంది. పేరుకు శివ‌సైనికుడే సీఎం అయినా.. అంతా క‌మ‌లం క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తోంది.

అయితే ఇలాంటి చీలిక పేలిక‌ల‌తో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌డం అల‌వాటు చేసుకున్న బీజేపీ, ఆ ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టుకోవ‌డానికి అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా అవ‌త‌ల నుంచి ఎమ్మెల్యేల‌ను తిప్పుకోవ‌డంలో కూడా నేర్ప‌రి అయ్యింది. ఇది వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లో అలానే జ‌రిగింది. క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో మ‌రో చీలిక‌కు బీజేపీ రంగం సిద్ధం చేసిన‌ట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం బీజేపీ- శివ‌సేన వ‌ర్గంలోని కొంద‌రు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, శివ‌సేన ఎమ్మెల్యేల్లో 16 మందిపై అన‌ర్హ‌త వేటుకు ఆస్కారం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో, ఆ లోటు పూడ్చుకోవ‌డానికి ఈ సారి ఎన్సీపీ బుట్ట‌లో బీజేపీ చేతులు పెడుతోంద‌ని టాక్. ఇందు కోసం మ‌రోసారి అజిత్ ప‌వార్ ను బీజేపీ దువ్వుతోంద‌ని టాక్. 

ఇది వ‌ర‌కే ఒక‌సారి బీజేపీతో చేతులు క‌లిపిన‌ట్టే క‌లిపి, మ‌ళ్లీ ఎన్సీపీలోకే వెళ్లారు అజిత్ ప‌వార్. ఈ క్ర‌మంలో ఈ సారి ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌తో అజిత్ ప‌వార్ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌వ‌చ్చ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సంజ‌య్ రౌత్ సామ్నాలో ఇదే చెబుతూ ఉన్నారు!

అయితే అజిత్ ప‌వార్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. బీజేపీ-శివ‌సేన ప్ర‌భుత్వానికి త‌న మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డినా ప్ర‌భుత్వానికి ఢోకా లేద‌ని, త‌న అవ‌స‌రం లేద‌ని చెబుతున్నాడు. ఈయ‌న మాట‌లు వింటే.. అవ‌స‌రం లేనందుకు చింతిస్తున్న‌ట్టుగా ఉంది. అయితే శ‌ర‌ద్ ప‌వార్ మాత్రం ఈ చీలిక‌ల‌ను లైట్ తీసుకోవాల‌ని అంటున్నార‌ట‌. ఎమ్మెల్యేలు వెళ్లాల‌నుకుంటే వెళ్ల‌వ‌చ్చ‌ని.. వారిని ఆపే ప్ర‌య‌త్నాలు త‌ను చేయ‌నంటున్నార‌ట‌!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?