Advertisement

Advertisement


Home > Politics - National

మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేదే మోడీ ప్లాన్!

మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేదే మోడీ ప్లాన్!

ముస్లిం మతస్తులు కూడా తమను ఎంతో అభిమానించేలాగా తమ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నదని, త్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దు చేసినందుకు ప్రతి ముస్లిం మహిళ ప్రధాని నరేంద్రమోడీని తన సొంత అన్నగా భావిస్తున్నదని .. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సాధారణ సందర్భాల్లో తటస్థ వేదికల మీద రకరకాల కబుర్లు చెబుతూ ఉంటారు.

కానీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి తమ పాత బ్రహ్మాస్త్రాన్నే బయటకు తీస్తుంటారు. ఆ బ్రహ్మాస్త్రం పేరే ముస్లిం మత విద్వేషం. ఆ మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే.. హిందూ ఓటు బ్యాంకును ఒక భయంలోకి నెట్టడం ద్వారా మాత్రమే తాము గెలవాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అనుకుంటూ ఉండడం చాలా దారుణంగా ఉంది.

త్రిపుల్ తలాక్ కు ముస్లిం మహిళలు నీరాజనాలు పడుతున్నారు.. ఆర్టికల్ 370 రద్దుపై కూడా కాశ్మీరేతర ముస్లిం సమాజంలో ఆమోదం ఉంది.. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకున్న ముస్లింలు అందులో వారికి జరిగే హాని లేదని తెలుసుకుంటారు.. ఇలా భారతీయ జనతాపార్టీపై ముస్లిముల్లో వెల్లువెత్తే ప్రేమ గురించి ఆ పార్టీ వారు చాలానే చెబుతుంటారు. మరి అలాంటి నిర్ణయాల మీద వారికి నమ్మకం లేదా అనేది ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న.

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ఉండే ఆస్తులు అన్నీ ముస్లింలకు ఇచ్చేస్తారు అని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలుగా ఉదాహరిస్తూ.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభలో చెప్పడం చాలా చవకబారుగా ఉంది. పదేళ్లు ప్రధానిగా చేసినా కూడా మోడీకి హుందాగా మాట్లాడడం చేతకాలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

2006లో మన్మోహన్ సింగ్.. ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటుచేసిన సమావేశంలో దేశంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరినీ ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. అయితే మైనారిటీలకే తొలి హక్కు అనే మాటను మాత్రం కత్తిరించి భాజపా దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది చవకబారు రాజకీయం అనే విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ అలా చేయదలచుకుంటే ఇప్పుడు మళ్లీ గెలవాల్సిన అవసరం లేదు. 2006లో మన్మోహన్ ఆ మాట అన్న తరువాత.. ఎనిమిదేళ్లు ఆయనే ప్రధానిగా ఉన్నారు. అప్పుడే వనరులను ముస్లింలకు ఇచ్చేసి ఉండొచ్చు. ఆ ఎనిమిదేళ్లలో ఎన్ని వనరులను అలా ఇచ్చారో బిజెపి లెక్క చెప్పాలి. లేకపోతే... ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నందుకు భారతీయ సమాజానికి క్షమాపణ చెప్పాలని అని ప్రజలు కోరుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?