Advertisement

Advertisement


Home > Politics - Opinion

గాళ్స్ ఆర్ గ్లోబల్!

గాళ్స్ ఆర్ గ్లోబల్!

‘ఒక్క ఛాన్స్’ అంటూ జీవితపర్యంతమూ పరితపించిపోయే రోజులు మారిపోయాయి. ‘ఒక్క ఛాన్స్’ దొరకబుచ్చుకోవడం చాలా మందికి పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఆ ‘ఛాన్స్’ తర్వాత కెరీర్‌ను ఎలా నిలబెట్టుకుంటున్నారు? ఎలా ముందుకు తీసుకువెళుతున్నారు? అనేది చాలా కీలకం. 

అద్భుతమైన ప్లానింగ్, నిర్ణయాత్మక శక్తి ఉన్న మన హీరోలు కూడా ఛాన్స్ దక్కిన చోట కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు గానీ.. మన అమ్మాయిలు.. అంతర్జాతీయ యవనికమీద తమ సత్తా చాటుతున్నారు. గ్లోబల్ హీరోయిన్లుగా మెరుస్తున్నారు. మరో కోణంలో చూసినప్పుడు.. అంతర్జాతీయ ప్రతిష్ఠ పొందడంలోనైనా, అద్భుతమైన బిజినెస్ స్ట్రాటజీస్ తో ఇమేజ్ పెంచుకోవడంలోనైనా కొందరు హీరోలకు వారి భార్యలే తెరవెనుక కీలకమైన వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు.

‘ఆడది వంటింటి కుందేలు’  అనే నానుడి విన్న అనుభవమే ఈ తరానికి లేదు. వంటిల్లు దాటి, ఇల్లు దాటి, ఊరూవాడా దాటి, దేశం దాటి.. అంతర్జాతీయంగా ప్రతిభ చాటుకుంటున్న, రాణిస్తున్న మన సెలెబ్రిటీ అమ్మాయిల తీరు మీదనే గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘గాళ్స్ ఆర్ గ్లోబల్!’

ఎంటర్టైన్ మెంట్ ప్రియులకు, ప్రేక్షకులకు వినోదం పంచడానికి ఇప్పుడు సినిమా, టీవీ మాత్రమే మాధ్యమాలు కాదు. ఓటీటీ అతి పెద్ద ప్లాట్‌ఫారం అయింది. ఓటీటీకోసం ప్రత్యేకంగా సినిమాలు తయారు అవుతున్నాయి. ప్రత్యేకించిన సిరీస్ రూపొందుతున్నాయి. భారతీయ సినిమా రంగానికే చెందిన ప్రముఖులు, ఔత్సాహికులు కూడా  అంతర్జాతీయ స్థాయి ఓటీటీ సినిమాలు/ సిరీస్ లను రూపొందిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న వారు.. భారతీయ నటులను కూడా తమ నిర్మాణాల్లోకి తీసుకుంటున్నారు. 

కేవలం భారతీయ ఓటీటీ మార్కెట్ అతిపెద్దది కావడం ఒక్కటే అందుకు కారణం కాదు. మన నటుల ప్రతిభాసామర్థ్యాలు కూడా కలిసి అలాంటివి రూపొందుతున్నాయి. ‘అంతర్జాతీయ స్థాయి ’ అంటూ ప్రత్యేకంగా నిర్వచనం ఏమీ లేదు. చిన్ననటులతో, కేవలం భారతీయ నటులతో రూపొందించినా సరే.. ఒక చిత్రాన్ని , సిరీస్ ను ప్రపంచంలోని అన్ని పాపులర్ భాషల్లోకి డబ్ చేసి.. తమ ఓటీటీ వేదిక ద్వారా అందించాలని, అంతటి స్థాయి ఉన్నదని వారికి అనిపిస్తే గనుక.. అతి అంతర్జాతీయ చిత్రమే. 

ఓటీటీ అంటేనే అంతర్జాతీయ వేదిక..

సినిమా మేకింగ్ రూపురేఖలను డిజిటల్ యుగం తుత్తునియలు చేసేసి కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. అదేసమయంలో, ఓటీటీ ప్లాట్‌ఫారంలు అనేవి సినిమా ప్రదర్శన అనే రంగం రూపురేఖలను సమూలంగా పునర్నిర్వచించాయి.

ఓటీటీకోసం ప్రత్యేకంగా తయారువుతున్న సిరీస్ ను కొన్నింటిని గమనిస్తే వాటిముందు.. వందల కోట్ల బడ్జెట్ తో తయారు చేస్తున్నాం అని మేకర్స్ ప్రకటించుకునే మన అగ్రహీరోల చిత్రాలు కూడా ఎందుకూ పనికి రావని అనిపిస్తుంది.

ఏకకాలంలో అంతర్జాతీయంగా పదుల సంఖ్యలోని భాషల్లో ప్రేక్షకులు ఆస్వాదించగలిగేలా చిత్రాలను రూపొందిస్తుండడం ఓటీటీలోనే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్టు ఓటీటీ వలన సినిమా ప్రదర్శన రంగం రూపురేఖలు పునర్నిర్దేశితం అయ్యాయి. టీవీ తెరమీదనే తొలిసారిగా చూస్తున్నాం అనే అభిప్రాయం మనకు కలుగుతుంది గానీ.. తతిమ్మా అన్ని రకాలుగానూ వెండితెర చిత్రాలకు దీటైన విధంగానే ఉంటున్నాయి. పైగా ఓటీటీ ప్లాట్‌ఫారంల వలన టార్గెటెడ్ ఆడియెన్స్ కు రీచ్ కావడం అనేది ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చాలా సులభం అయిపోయింది.

అంతర్జాతీయ స్థాయి గల చిత్రాల అవసరాలను ఓటీటీ వేదికలు చక్కగానే తీర్చగలుగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటీటీల కోసం తయారవుతున్న ఈ చిత్రాల క్యాస్టింగ్ అవసరాలను మన భారతీయ నటులు ఎంత మేరకు తీర్చగలుగుతున్నారు. ఇక్కడే ప్రశ్న ఎదురవుతోంది?

అవర్ గాళ్స్ ఆర్ గ్లోబల్!

ఆలియా భట్ బ్రిటాష్ అమ్మాయే కద, ఆమె పాస్ పోర్టు కూడా లండన్ దే కద అని మనకు అనిపించవచ్చు. హాంగ్ కాంగ్ పౌరసత్వం ఉన్న క్రతినాకైఫ్, బ్రిటిష్ పౌరసత్వం గల ఆమీ జాక్సన్, శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి ఇండియన్ సినిమాలో సెలబ్రిటీలుగా చెలామణీ అవుతున్న కొందరు అమ్మాయిలు ఇండియన్ పాస్ పోర్టులేని వారే కద. వారందరినీ అంతర్జాతీయ స్థాయి నటులుగానే గుర్తించాలి కద అని మనం వాదించవచ్చు. కానీ ఇక్కడ చర్చ అది కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే చెందిన భారతీయులు అయి ఉండి.. అంతర్జాతీయంగా రాణిస్తున్న వారి గురించే చర్చ.

‘సిటడెల్’ (ఆమెజాన్ ప్రైమ్ వీడియో) సిరీస్ చూశారా? ప్రియాంక చోప్రా నెక్ట్స్ లెవెల్ లో కనిపించే చిత్రం అది. స్పై సిరీస్. స్పై అనగానే మనకు గుర్తుకు వచ్చేవి జేమ్స్ బాండ్ చిత్రాలు. ఏ జేమ్స్ బాండ్ చిత్రంలో ఏ హీరోయిన్ కు కూడా తీసిపోని రేంజిలో ప్రియాంక చోప్రా ఇందులో మనకు కనిపిస్తుంది. 

స్క్రిప్టు ప్రకారం కథ భారతదేశంలో నడుస్తూ ఉంటే గనుక.. కథానుగుణమైన భారతీయ పాత్రలకోసం మన నటులను తీసుకోవడం అనేది దశాబ్దాల ముందునుంచి కూడా నడుస్తూ ఉన్న ప్రక్రియ. కానీ, కథ విదేశాలలో జరుగుతూ ఉన్నా కూడా అక్కడి పాత్రలకు నప్పేలా మన నాయికలు అదరగొడుతున్నారంటే.. ఆ అవకాశాలు ఆషామాషీగా దక్కించుకున్నవి కాదు. తమ ప్రతిభను నిరూపించుకోవడం ద్వారా మాత్రమే చేజిక్కించుకున్నవి.

సిటడెల్ చూస్తోంటే.. లీడ్ రోల్ ఒక బిడ్డకు తల్లి, నలభయ్యేళ్ల ప్రియాంకచోప్రా చేస్తున్న యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. హీరోతో సమానంగా ఆమె పాత్ర ప్రయారిటీ ఉంటుంది. నిజం చెప్పాలంటే.. ఆమె ప్రయారిటీ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దశాబ్దానికంటె ముందే బేవాచ్ తోనే ప్రియాంక తనను తాను అంతర్జాతీయ స్థాయికి ప్రమోట్ చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా నిక్ జొనాస్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ చిత్రాలను పట్టించుకోలేదు, ఇటువైపు చూడలేదు అని నిందలు వేయడం కంటె.. ఇటు చూడడానికి కూడా ఆమెకు వ్యవధి దొరకనంతగా హాలీవుడ్ ప్రియాంక వెంటపడుతోంది. 

అనేక హాలీవుడ్ నిర్మాణాల తర్వాత ప్రియాంక సిటడెల్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ప్రియాంక చోప్రా గురించి వ్యాఖ్యానిస్తూ ఆమెను ఫీమేల్ జేమ్స్ బాండ్ గా అభివర్ణించిందంటే.. ప్రియాంక దూకుడును మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె తర్వాతి ప్రాజెక్టులు కూడా హాలీవుడ్ నిర్మాణసంస్థలతోనే సాగుతున్నాయి. హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రం కూడా ఆమెజాన్ లోనే స్ట్రీమ్ కానుంది.

ఇదే తరహాలో దీపికా పడుకొనే కూడా గ్లోబల్ లెవెల్ పాత్రలతో దూసుకెళుతోంది. రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ చిత్రంతో దీపికా పడుకొనే , విన్ డీజిల్ సరసన నటిస్తూ హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఓటీటీ వేదికల మీద స్ట్రీమ్ అవుతన్న చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ఆలియాభట్ తీరు కూడా అంతే. 

బ్రిటిష్ పౌరసత్వం ఉన్న ఈ నాయిక బాలీవుడ్ లో పెద్ద రెమ్యునరేషన్లు తీసుకునే హీరోయిన్లలో ఒకరు అయినప్పటికీ.. హాలీవుడ్ లో కూడా తన టేలెంట్ చాటుకుంటోంది. హార్ట్ ఆఫ్ స్టోన్ వంటి నెట్ ప్లిక్స్ స్పై ఫిలింలో కూడా ఆలియాభట్ తన టేలెంట్ చూపించనుంది. ఆలియా, ప్రియాంక లాంటి వాళ్లు ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా.. అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతుండడం ఇంకా ప్రత్యేకం. 

హీరోలు అడుగుపెట్టడం లేదే..

మన భారతీయ హీరోయిన్లు గ్లోబల్ గా దూసుకెళుతున్నారు. అదే సమయంలో హీరోల్లో ఎందరికి అలాంటి అవకాశం లభిస్తోంది? అనే ప్రశ్నకు ఒక పట్టాన సమాధానం దొరకదు. హీరోలు బాగా వెనకబడి ఉన్నారు. లేదా, భారతీయ చిత్ర నిర్మాణ రీతులకు వారు అడిక్ట్ అయిపోయి ఉండవచ్చు. హీరోలుగా ఇక్కడ తమకు లభిస్తున్న క్రేజ్, షూటింగ్ స్పాట్ లలో జరిగే రాచమర్యాదలు, అభిమానులు దేవుళ్లలాగా చూడడం ఇవన్నీ వారిని ఇక్కడి పరిశ్రమలోనే ఉండేలా మైమరపిపం చేస్తుండవచ్చు.

సాధారణంగా అంతర్జాతీయ స్థాయి సినిమాలు, సిరీస్ చేస్తున్న వారు క్యాస్టింగ్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. తాము రూపుదిద్దిన పాత్రకు నూటికి నూరుశాతం సరిపోయే నటులతో మాత్రమే చేస్తారు. రాజీపడడం ఉండదు. ఆ ప్రమాణాలను బట్టి చూసినప్పుడు.. అంతర్జాతీయంగా మేకర్స్ ఎంచుకునేలా మన హీరోల్లో టేలెంట్ కనిపించడం లేదేమో అని కూడా అనిపిస్తుంది. 

హీరోల శ్రీమతులు ముందంజలోనే ఉన్నారా?

హీరోల విషయానికి వస్తే.. వారి భార్యలు కాస్త ఇంటర్నేషనల్ మార్కెట్, ఇండస్ట్రీ పట్ల ఒక అధ్యయనంతో, ముందుచూపుతో అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. చిత్రం గొప్పదిగా ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ.. అందులో హంగామా, ఆర్భాటాలను పక్కన పెడితే.. ఒక మామూలు కమర్షియల్ హీరో మాత్రమే అయిన రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయి స్టార్ గా ఇవాళ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ వేదికల మీదికి తరచుగా వెళుతున్నారు.

అంతర్జాతీయంగా ఛానెల్స్ ఆయనను ప్రమోట్ చేస్తున్నాయి. ఇలాంటి మార్కెటింగ్ వ్యూహం వెనుక ప్రధానంగా ఆయన భార్య ఉపాసన ఉన్నట్లుగా చెబుతుంటారు.

హీరో మహేష్ బాబు విషయంలో కూడా ఆయన భార్య నమ్రత చాలా వరకు బిజినెస్/ ప్రమోషన్ విషయాలను డీల్ చేస్తుంటారు. భర్త ఇమేజ్ గ్రాఫ్ పెరగడంలో ఆమె వంతు పాత్ర ఉంటుందని కూడా పలువురు అంటుంటారు.

సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటుంటారు. మన వాళ్ల ఇమేజ్ బూస్ట్ కావడం వెనుక వారి భార్యల ప్రమేయం కనిపిస్తోంది.

కానీ నటులు అన్నాక.. కేవలం ఇమేజిని పెంచుకుంటే మాత్రమే సరిపోదు. మన ఇండియన్ ఇండస్ట్రీ నుంచి గాళ్స్, గ్లోబల్ గా తమ టేలెంట్ నిరూపించుకుంటున్నట్టుగా, బాయ్స్ కూడా హాలీవుడ్ నిర్మాణాలలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అందుకు తగ్గ టేలెంట్ తమలో ఉందని కూడా నిరూపించుకోవాలి. 

బహుశా రానున్న సంవత్సరాల్లో ఆ పరిణామాలు జరగవచ్చు. ఇంకా చెప్పాలంటే.. అంతర్జాతీయ చిత్రాలకు నటుల ఎంపికలో దేశాల హద్దులు పూర్తిగా చెరగిపోవచ్చు కూడా. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?