Advertisement

Advertisement


Home > Politics - Telangana

111పై విపక్షాలు ఆ మాట చెప్పగలవా?

111పై విపక్షాలు ఆ మాట చెప్పగలవా?

హైదరాబాదు శివార్లలో రియల్ బూమ్ కు అవరోధంగా ఉన్న 111 జీవోను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటినుంచి తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రచ్చ అవుతోంది. కేసీఆర్ సర్కారు రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికే 111 జీవోను ఎత్తివేస్తున్నారని, దీనిద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించబోతున్నారని ప్రతిపక్షాలు చాలా పెద్దఎత్తున గోల చేస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఒక రేంజిలో ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు.

సహజంగానే కేసీఆర్ మీద విమర్శలు గుప్పించడంలో.. హద్దుల్లేకుండా చెలరేగిపోతూ ఉండే పీసీసీ సారథి రేవంత్ రెడ్డి.. 111 జీవో ఎత్తివేత వెనుక రూ.లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నదని ఒక లెక్క తేల్చారు. భారీగా అవినీతి కుంభకోణం దీని వెనుక ఉన్నదని అనడం వరకు చాలా సహజం. 

కానీ.. దానికి నిర్దిష్టంగా ఒక అంకె చెప్పడం రేవంత్ కు మాత్రమే చెల్లింది. లక్ష కోట్ల కుంభకోణం అని ఆయన ఎలా చెప్పగలిగారో తెలియదు గానీ.. 111 జీవో పరిధిలోని భూములను కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారి బినామీలు చాలా పెద్దఎత్తున కొనుగోలు చేసిన తర్వాతనే.. ఈ జీవో ఎత్తవేత నిర్ణయం వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. రేవంత్ తరన సహజశైలిలో ఈ భూ కుంభకోణంలో బిజెపికి కూడా పాత్ర ఉందని కూడా విమర్శిస్తున్నారు.

అదేసమయంలో బిజెపి కూడా కేసీఆర్ మీద విమర్శలు కురిపిస్తోంది. ఎన్నికలకు నిధులు సమీకరించుకోవడం కోసమే కేసీఆర్ 111 జీవో ఎత్తివేయడానికి సిద్ధమయ్యారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డీల్ మాట్లాడుకున్నారని బిజెపి అంటోంది. ఈ మాట వింటే.. ఎన్నికల అవసరాలకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే దాని అర్థం.. ఈ నాలుగేళ్ల పాలనలో ఎలాంటి అవినీతి చేయలేదు అని అర్థం చేసుకోవాల్సిందేనా? అనే కౌంటర్ కూడా వినిపిస్తోంది.

అయితే ఈ రెండు పార్టీలు భారాసను ఈ విషయంలో ఇంతగా నిందిస్తున్నప్పుడు.. అది తప్పుడు నిర్ణయం అనుకుంటున్నప్పుడు.. ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాయో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఈసారి తమ ప్రభుత్వం వస్తే.. 111 జీవో మళ్లీ వస్తుందని వారు ఎందుకు అనలేకపోతున్నారు. నెంబరు మారినా సరే.. అదే నిబంధనలతో జీవో తేవడం వారికి సాధ్యమే కద. కానీ ఆ మాట మాత్రం చెప్పడం లేదు. 

అంటే.. ఆ జీవో లేకపోవడం వారందరికీ కూడా కావాలి. కాకపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుతానికి కేసీఆర్ ను తూలనాడుతున్నారు.. అని ప్రజలు అనుకుంటున్నారు. ఎటూ ఎన్నికలకు ఇంక ఆరునెలల వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు.. భారాస కాకుండా బిజెపి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే, 111 జీవో మళ్లీ వస్తుందనే మాట వారినుంచి వినపడితే గనుక.. కేసీఆర్ లాభార్జన కోసం చేసే ఎత్తుగడే అయితే అది ఫలించదు కదా అనేది ప్రజల అనుమానం. కానీ విపక్షాలు ఆ ఒక్క మాట మాత్రం చెప్పకుండానే రాజకీయం చేస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?