తెలంగాణలో ముందే చేతులెత్తేస్తున్న బిజెపి!

ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితితో బిజెపి లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుని, చాటుమాటు రాజకీయాలు నడుపుతున్నదేమో  తెలియదు గాని.. మరో రెండు నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతుండగా ఆ…

ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితితో బిజెపి లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుని, చాటుమాటు రాజకీయాలు నడుపుతున్నదేమో  తెలియదు గాని.. మరో రెండు నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతుండగా ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం.. ప్రజల్లో అనేక అనుమానాలు పుట్టిస్తోంది!  

పార్టీకి చెందిన కీలక నాయకులు ఎవ్వరూ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం ఈ పార్టీలో ఒక విచిత్రం. అమిత్ షా లాంటి కీలకమైన నాయకుడు రెండు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన సందర్భాలలోనూ కనీసం పార్టీలోకి ఒక్క కొత్త చేరిక కూడా లేదంటే స్థానిక నాయకులు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట హైదరాబాదుకు వచ్చి బహిరంగ సభ నిర్వహించి, పార్టీ నాయకులతో కూడా ప్రత్యేకంగా వ్యూహరచన సాగించిన అమిత్ షా.. ముఖ్య నాయకులు పోటీ చేసే విషయంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయలేకపోవడం భారతీయ జనతా పార్టీకి పెద్ద లోటు. 

పార్టీ నాయకులతో ఆదివారం సమావేశమైన అమిత్ షా.. ఒకవైపు రెండున్నర నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, క్షేత్రస్థాయి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, భారాస వైఫల్యాలను ఎండగట్టాలని రకరకాల దిశా నిర్దేశం చేశారు.  అయితే ముఖ్య నాయకులు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే విషయమై.. జాతీయ స్థాయిలో మరోసారి చర్చించే నిర్ణయం తీసుకుందామని అమిత్ షా అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ముఖ్య నాయకులందరూ భయపడుతున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఈటెల రాజేందర్, లక్ష్మణ్, వివేక్, కోమటిరెడ్డి రాజరాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర నాయకులు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ వైఖరి ‘పార్టీ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద నామమాత్రపు విశ్వాసమైనా లేదు’ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తుంది.. నామ్కే వాస్తే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారే తప్ప.. అసలైన వారందరూ కూడా లోక్సభ ఎన్నికల మీద ఆశపడుతున్నారని కూడా అర్థమవుతోంది. కనీసం పోటీకి కూడా ఉత్సాహం చూపించలేని పార్టీ.. ఏ రకంగా సంచలనాలు నమోదు చేస్తుంది? అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు!

భారతీయ జనతా పార్టీ తీరుతెన్నులు ఎన్నికల నగారా మోగకముందే ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తున్నాయని  పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.