Advertisement

Advertisement


Home > Politics - Telangana

గులాబీ కిడ్నాపులు: ఎంత దుస్థితి వచ్చింది సారూ!

గులాబీ కిడ్నాపులు: ఎంత దుస్థితి వచ్చింది సారూ!

తాము గేట్లు తెరిస్తే భారత రాష్ట్ర సమితిలో కల్వకుంట్ల కుటుంబం తప్ప మరెవ్వరూ ఉండరని రేవంత్ రెడ్డి హెచ్చరించి రెండు రోజులు కూడా కాలేదు. అలాగని ఆయన కాంగ్రెస్ పార్టీ గేట్లు కూడా తెరవనే లేదు. కానీ అప్పుడే భారాస నుంచి నాయకులు ఒక్కరొక్కరుగా జారుకోవడం మాత్రం మొదలైంది.

నాయకులను పార్టీ వీడిపోకుండా కాపాడుకోవడం అనేది గులాబీ దళానికి తలకు మించిన భారంగా తయారవుతోంది. బుజ్జగించడం వారికి ఒకపట్టాన వల్లకావడం లేదు. తమాషా ఏంటంటే.. పార్టీని వీడిపోయే నాయకులను కిడ్నాప్ చేసి మరీ కాపాడుకోవాల్సి వస్తోంది!

హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారాసను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్టీని వీడిపోతున్నట్టుగా తన నిర్ణయాన్ని ప్రకటించడానికి బుధవారం తన ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సరిగ్గా ప్రెస్ మీట్ ప్రారంభం కాబోయే సమయానికి అక్కడ భారాస సీనియర్ నాయకులు ప్రత్యక్షం అయ్యారు. ఎర్రబెల్లి దయాకర్, బస్వరాజు సారయ్య తదితరులు వచ్చారు. హరీష్ రావు పంపడం వల్ల తాము వచ్చామని చెప్పారు. ఆరూరి రమేష్ డిమాండ్లు ఏం ఉన్నా సరే.. తీర్చడానికి హరీష్ సిద్ధం అని కూడా చెప్పారు. అయితే.. పార్టీలో ఇటీవలి పరిణామాల పట్ల ఆరూరి రమేష్ వారివద్ద కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు సమాచారం.

మంతనాలు ఫలించకపోగా, ఆయన ప్రెస్ మీట్ లో కూర్చునేందుకు ప్రయత్నించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్, బస్వరాజు సారయ్యలు బలవంతంగా ఆపుచేయించారు. ఆయన తమ వెంట రావాల్సిందిగా కారులో తీసుకువెళ్లారు. కారులో కూర్చోబెట్టుకోగానే.. ఆరూరి అనుచరులు, బిజెపి కార్యకర్తలు కారును కదలనివ్వకుండా అడ్డు పడి పెద్ద హైడ్రామా నడిపించారు. చివరికి వారు వెళ్లిపోయాక భారాస నాయకులు తమ నేతను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంటూ ఆందోళన చేస్తున్నారు. పార్టీ నాయకులను కాపాడుకోవడానికి భారాసకు చివరికి కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొనేంతటి పరిస్థితి వచ్చింది.

గులాబీ దళంలో ఎమ్మెల్యేలు కాదుగానీ, ఆ స్థాయి ఉన్న నాయకులు క్రమంగా జారుకుంటున్నారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భారాసను వీడి బిజెపిలో చేరిపోయారు. ఆయన ఆ పార్టీలో ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా భారాసను వీడి కాంగ్రెసులో చేరబోతున్నారు. ఆయన కూడా భువనగిరి ఎంపీగా బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

సిర్పూర్ జిల్లా భారాస అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో భారాస పొత్తు పెట్టుకున్నందుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెసులో చేరబోతున్న సంగతిని కూడా ప్రకటించారు. ఈ రకంగా నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న వైనం గమనిస్తే.. రేవంత్ చెప్పినట్టుగా నిజంగానే వాళ్లు గేట్లు తెరిస్తే పార్టీ ఖాళీ అవుతుందేమో అనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?