Advertisement

Advertisement


Home > Politics - Telangana

బీఆర్ఎస్ నుంచి వ‌చ్చే వాళ్ల‌కు కాంగ్రెస్ టికెట్లు!

బీఆర్ఎస్ నుంచి వ‌చ్చే వాళ్ల‌కు కాంగ్రెస్ టికెట్లు!

ప‌దేళ్లుగా ప‌వ‌ర్లో ఉండిన బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు రెడీమేడ్ గా అభ్య‌ర్థులు ల‌భిస్తున్న‌ట్టుగా ఉన్నారు! బీఆర్ఎస్ నుంచి అవ‌కాశం ద‌క్క‌ద‌నే లెక్క‌ల‌తో కొంద‌రు, కాంగ్రెస్ నుంచి టికెట్ ఖ‌రారు అనే హామీతో మ‌రి కొంద‌రు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చేరుతున్నారు! బీఆర్ఎస్ లో గ‌తంలో మంచి ప్రాధాన్య‌తే పొందిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయ‌న భార్య వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. 

మ‌హేంద‌ర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ త‌ర‌ఫున నెగ్గారు. ఆ త‌ర్వాత 2019లో కాంగ్రెస్ అభ్య‌ర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. రోహిత్ బీఆర్ఎస్ లోకి ఫిరాయించ‌డంతో ర‌చ్చ రాజుకుంది. అద‌లా కొన‌సాగుతుండ‌గానే.. ఎన్నిక‌ల ముందు కేసీఆర్ మ‌హేంద‌ర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. మహేంద‌ర్ రెడ్డి భార్య‌కూ ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. అయితే మ‌హేంద‌ర్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ఆశించిన టికెట్ ద‌క్క‌లేదు! గ‌త ప‌దేళ్లో మూడు నాలుగేళ్లు మంత్రిగా, భార్య జ‌డ్పీటీసీ చైర్మ‌న్ గా వీరి కుటుంబం మంచి ప్రాధాన్య‌తే పొందింది. ఇప్పుడు వీరు అర్జెంటుగా కాంగ్రెస్ లోకి చేరుతుండ‌టం వెనుక ఎంపీ టికెట్ హామీ ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

చేవెళ్ల నుంచి మ‌హేంద‌ర్ రెడ్డి భార్య సునీత‌కు ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ ఖ‌రారు చేసింద‌నే టాక్ న‌డుస్తోంది. అలాగే జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్  బొంతు రామ్మోహ‌న్ కూడా కాంగ్రెస్ లోకి చేరడం ఖరారు అయిన‌ట్టేన‌ని తెలుస్తోంది.  

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ ను ఆశించిన రామ్మోహ‌న్ ప్ర‌స్తుతం ఎంపీ టికెట్ ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి అది ద‌క్కే అవకాశం లేద‌నే క్లారిటీతో ఈయ‌న కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ఆశ‌ల‌తోనే చేరుతున్న‌ట్టుగా ఉన్నారు! మొత్తానికి ప‌దేళ్లుగా బీఆర్ఎస్ లో వెలిగిన వారు ఇప్పుడు త‌మ ఆర్థిక శ‌క్తితో కాంగ్రెస్ కు ధీటైన ఎంపీ అభ్య‌ర్థులుగా మారుతున్న‌ట్టుగా ఉన్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?