Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఈ చేరికలు కాంగ్రెస్ బలమా? బలహీనతా?

ఈ చేరికలు కాంగ్రెస్ బలమా? బలహీనతా?

‘నేను గేట్లు తెరిస్తే భారాస ఖాళీ అయిపోతుంది’ అని రెండు రోజుల కిందట అన్నారు. ‘గేట్లు తెరిచేశాను.. ఇక ఖాళీ చేసేస్తాను’ అని తాజాగా కూడా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత డాంబికంగా పలుకుతున్నప్పటికీ.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క బలమా లేదా బలహీనతా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

భారాసలో భవిష్యత్తు ఉండదనే భయంతో వారు వచ్చి కాంగ్రెసులో చేరుతున్నారా? లేదా, కాంగ్రెసు పార్టీ- తమకు గతిలేక వారిని ప్రలోభ పెట్టి తమలో చేర్చుకుంటున్నదా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పార్టీలోకి భారాస నుంచి చేరిన వారికి  తిరిగి ఇక్కడ ఎంపీ టికెట్లనే ప్రసాదిస్తున్నారు. అన్యధా వారు వచ్చేవారో కాదో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రేవంత్ రెడ్డి ఏదో స్పైసీగా మాట్లాడడం కోసం గేట్లు తెరిచేశాను.. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చేశారు.. అని ఘనంగా చెప్పుకుని ఉండొచ్చు గాక. కానీ నిజానికి కాంగ్రెసు గేట్లు ఎప్పుడో తెరవబడ్డాయి. ఫిబ్రవరి తొలివారంలోనే భారాస పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిపోయారు. కానీ ఆ తర్వాత మరొక నాయకుడు చేరడానికి చాలా ఆలస్యం అయింది.

రెండురోజుల కిందట వరంగల్ భారాస ఎంపీ పసునూరి దయాకర్ కూడా వచ్చి కాంగ్రెసులో చేరారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఎంపీ దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వచ్చి చేరారు. ప్రస్తుతానికి చేరికలు ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే అని లెక్క తేలింది. దీనిద్వారా భారాస ఖాళీ అయిపోతున్నట్టుగా, అక్కడ గెలిచిన వారంతా కాంగ్రెసునే నమ్ముతున్నట్టుగా అనుకోవడానికి, రేవంత్ అలాగని డప్పు కొట్టుకోవడానికి వీల్లేదు.

ఎందుకంటే.. వీళ్లంతా కూడా మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్లు. దానం కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేయబోతున్నారు. ఇప్పుడున్న సమీకరణాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉండగా, ఆ పార్టీ తరఫున బరిలో ఉండడం శ్రేయస్కరం అనుకుని ఉండవచ్చు. వారి టికెట్లు ఆఫర్ లేకుంటే అసలు కాంగ్రెసులోకి వచ్చేవారో లేదో కూడా తెలియదు. కాబట్టి వారి చేరికలు కాంగ్రెస్ బలాన్ని కాదు, బలహీనతను సూచిస్తాయి. వారు గనుక రాకపోతే.. కాంగ్రెస్ పార్టీకి అక్కడి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు దిక్కులేదనే సంకేతాలను చూపిస్తున్నాయి.

రాజధాని నగర పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. కేవలం తమ బలహీనత ను కవర్ చేసుకోడానికి భారాస నుంచి దానంను, రంజిత్ రెడ్డిని తీసుకున్నదేమో అనే అభిప్రాయం కలుగుతోంది. ఈ చేరికలతో రేవంత్ రెడ్డి మురిసిపోవడానికి వీల్లేదు. ఎమ్మెల్యేలు భారాసను వీడి కాంగ్రెసులో చేరి, ఎమ్మెల్యేలుగానే కొనసాగే ఉద్దేశంలో ఉన్నప్పుడు మాత్రమే.. ఆయన తమ బలాన్ని చూసి వారు వచ్చినట్టుగా భావించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?