Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఈటల మాటల్లో బయటపడ్డ కాంగ్రెస్ బలం!

ఈటల మాటల్లో బయటపడ్డ కాంగ్రెస్ బలం!

తెలంగాణలో ఈసారి కేసీఆర్ ను మట్టికరిపించి అధికారంలోకి రాబోయేది మేమే అని కమలదళం నేతలు ఎంతగానైనా చెబుతుండవచ్చు గాక.. కాంగ్రెసు పార్టీ ముఠా కుమ్ములాటలతో సతమతం అవుతూ, బిజెపి అంత దూకుడుతో కనిపించకపోవచ్చు గాక.. కానీ వాస్తవంలో, క్షేత్రస్థాయిలో కాంగ్రెసు పార్టీనే అంతో ఇంతో బలంగా ఉందనే సంగతి నెమ్మదిగా బయటపడుతోంది. 

బిజెపి నాయకుడు ఈటల మాటల ద్వారా ఇలాంటి అభిప్రాయం కలుగుతుండడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదని అర్థం ధ్వనించేలా.. బిజెపిలోకి ఇతర పార్టీ నాయకులను ఫిరాయింపజేయడానికి ప్రత్యేకించిన చేరికల కమిటీ సారథి ఈటల స్వయంగా మాట్లాడుతుండడం విశేషమే.

ఖమ్మం జిల్లాలో బిజెపి హవా పెద్దగా లేదు. ఆ జిల్లాలో కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన కీలక నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బిజెపిలో చేర్చుకోవడానికి ఈటల రాజేందర్ శతథా ప్రయత్నించారు. ఆయనతో జట్టుగా ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు జూపల్లి కృష్ణారావుతో కలిపి ఆ ఇద్దరు నాయకులతో ఈటల రెండు దఫాలుగా సమావేశం అయ్యారు. ఈటల వెంట కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘనందన్ రావు లాంటి కీలక నాయకులందరూ కూడా పొంగులేటిని బుజ్జగించి తమ పార్టీలో చేరేలా ఒప్పించడానికి కష్టపడ్డ వారిలో ఉన్నారు. కానీ వారి కష్టం ఫలించలేదు.

తాజాగా ఈటల.. ఆ ఇద్దరు నాయకులు బిజెపిలో చేరడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పేశారు. తాను ఇన్నాళ్లు కష్టపడి మంతనాలు సాగించడం ద్వారా.. వారిద్దరూ కాంగ్రెసులో చేరడాన్ని ఆపగలిగానని మాత్రమే ఈటల చెప్పుకొచ్చారు. అంటే ఈటల మాటలతో పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కూడా కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా తేలిపోతున్నది. వారి చేరిక సంగతి అలా ఉంచితే, ఈ సందర్భంగా ఈటల చేసిన ఇతర వ్యాఖ్యలు కీలకమైనవి.

ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టు ప్రాబల్యం ఇంకా చాలా బలంగా ఉంది. ఆ జిల్లాలో బిజెపి బలంగా లేదు. ఆ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెసు కూడా ఎక్కువ బలంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అందు చేత ఆ నాయకులు కాంగ్రెసులో చేరబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఈటల మరో మాట కూడా అన్నారు. 

వామపక్ష విప్లవోద్యమాలకు, కమ్యూనిస్టు పోరాటాలకు తెలంగాణ పురిటిగడ్డ అని కూడా అన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతిచోటా కూడా ఎంతో కొంత కమ్యూనిస్టు బలం ఉన్నట్టే కదా..! బిజెపి ప్రతికూలత ఉన్నట్టే కదా. జాతీయ స్థాయిలో పొత్తులు కుదిరే పక్షంలో కాంగ్రెస్ వెంట కమ్యూనిస్టులు నిలిస్తే గనుక.. వారిదే పైచేయి అవుతుందనే అర్థం ఈటల మాటల్లో వ్యక్తమవుతోంది. మరి ఆయన మాటల్ని బిజెపి హైకమాండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?