Advertisement

Advertisement


Home > Politics - Telangana

గెలిచేంత సీనుంటే కొట్టుకు చచ్చేవాళ్లేమో!

గెలిచేంత సీనుంటే కొట్టుకు చచ్చేవాళ్లేమో!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీనావస్థలోనే ఉంది. ఆ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే, ఏకపక్షంగా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రావడం అనేది కల్ల. అధికారం సంగతి తర్వాత.. సింగిల్ లార్జెస్ట్ కావడం కూడా జరగదు. తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఎన్నడో పోయింది. 

కాంగ్రెసు అభ్యర్థులకు ఓటు వేస్తే వారు గెలిచిన తర్వాత.. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోతారు అనే అభిప్రాయం, అపనమ్మకం తెలగాణ ప్రజలకు ఏర్పడిపోయింది. ఈ అనుమానాన్ని జయించి.. ప్రజల మన్నన చూరగొనడం అంత మామూలు సంగతి కాదు. ఇలా ఆ పార్టీ రకరకాల కారణాల వల్ల బాగా వెనకబడి ఉంది. పార్టీ పరిస్థితి ఇలా ఉండగానే.. ఆ పార్టీ నాయకులు ముఠా కక్షలతో కొట్టుకుంటున్నారు. 

తెలంగాణ పీసీసీ సారథిగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఇదేమీ ఆయన స్వబుద్ధితో సాగిస్తున్న యాత్రగా పరిగణించడానికి కూడా వీల్లేదు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా.. రాహుల్ భారత్ జోడ్ యాత్ర తర్వాత.. దానికి స్థానిక కొనసాగింపులుగా హాథ్ సే హాథ్ జోడో యాత్రగానే రేవంత్ ప్రయత్నం నడుస్తోంది. 

అయితే.. ఈ పాదయాత్రతో రేవంత్ కు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయోననే భయం ఇంకా పలువురు నాయకుల్లో వ్యక్తం అవుతున్నట్లుగా ఉంది. మహేశ్వర్ రెడ్డి అనే మరో నాయకుడు తాను కూడా పాదయాత్ర చేస్తా అంటూ ప్రారంభించి.. తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఆపారు. పాదయాత్రనైతే ఆపారు గానీ.. ముఠాతగాదాల వైఖరి మాత్రం రగులుతూనే ఉంది. 

తన పాదయాత్రను ఎందుకు ఆపమని చెప్పాల్సివచ్చిందో.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే తనకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయన పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక గొడవ. 

మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన వంతుగా తాను మరొక సమాంతర పాదయాత్ర చేయడానికి అధిష్ఠానం అనుమతి తీసుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు సాగించుకున్నారు. మరో సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ కూడా అసంతృప్తితో వేగిపోతున్నారు. కీలక కార్యక్రమాల విషయంలో తనకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఆయన ఆరోపణ. 

ఈ రకంగా చూసినప్పుడు.. కాంగ్రెస్ పార్టీలోని ముఠాతగాదాల వైఖరి ఏమాత్రం మారినట్టుగా కనిపించడం లేదు. సాధారణంగా కష్టాల్లో ఉన్ననప్పుడు పరస్పర విభేదాలు మరచి కలిసి ఉండాలి. కానీ టీపీసీసీ నాయకులు.. పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా తమ వ్యక్తిగత ఈగోలకే పెద్దపీట వేస్తూ చెలరేగుతున్నారు. ఇదే పార్టీకి ఏకపక్షంగా గెలిచి అధికారంలోకి వచ్చేంత సీనుంటే.. ఈ ముఠాల నాయకులు ఒకరితోఒకరు నిత్యం కుస్తీపట్లు పడుతూ.. కొట్టుకుంటూ ఉండేవాళ్లేమో.. అని ప్రజలు కాంగ్రెస్ తీరుపై జాలిపడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?