Advertisement

Advertisement


Home > Politics - Telangana

అప్పటి కోపం ఇప్పుడు తీర్చుకున్నాడా?

అప్పటి కోపం ఇప్పుడు తీర్చుకున్నాడా?

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడకూడదనేది ఒక నైతిక నిబంధన. రాష్ట్రపతి, గవర్నర్,  పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్, రాజ్యసభ చైర్మన్  వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు. కానీ ఈ రోజుల్లో ఒక్క రాష్ట్రపతి మినహాయించి మిగిలినవారు రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు.

సరే ... ఆ సంగతి అలా పక్కన పెడితే తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి  గులాబీ పార్టీ మీద తన అక్కసు తీర్చుకున్నాడు. వాస్తవానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుండేది. కానీ ఉండబట్టలేక మాట్లాడేశాడు. ఆయన మాట్లాడిన తీరునుబట్టి చూస్తే ఆయన ఎక్కువకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేది అనుమానమేనని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. 

తనకు ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని అన్నాడు గుత్తా. ప్రస్తుతానికి లేదేమో... కానీ సమయం చూసుకొని కాంగ్రెస్ పార్టీలోకి జంపయ్యే అవకాశం ఉండొచ్చు. గుత్తాకు కేసీఆర్ మీద కోపంగా ఉంది. కేసీఆర్ ఏం పాపం చేశాడు? ఆయన చేసిన పాపం గుత్తాకు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపించి ఇవ్వకుండా మోసం చేశాడు. మాట తప్పాడన్న మాట. 

ఒకప్పుడు నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడైన గుత్తాను కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి తన పార్టీలోకి ఆహ్వానించాడు. అప్పుడే పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని గుత్తా కండిషన్ పెట్టాడు. కేసీఆర్ హామీ ఇచ్చాడు. కానీ మాట తప్పాడు. మండలి చైర్మన్ పదవి తీసుకోమన్నాడు. అయిష్టంగానే గుత్తా ఆ పదవి తీసుకున్నాడు. 

మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు గుత్తా తన కొడుక్కు టిక్కెట్ అడిగాడు. కేసీఆర్ ఇవ్వలేదు. ఈ కోపం కూడా మనసులో ఉంది. గుత్తా కొడుక్కు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని నాయకులు చెప్పారు. దీంతో కొడుకు అమిత్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాలు మానేశాడు. ఆ విషయం కూడా గుత్తా మీడియా సమావేశంలో చెప్పాడు. పల్లీ బఠాణీలు అమ్ముకునే నాయకులంతా అధికారంలోకి వచ్చారని, ఉద్యమకారులమని చెప్పుకొని పదవులు సంపాదించుకున్నారని అన్నాడు.

నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ నాయకులను తయారుచేశారని విమర్శించాడు. చాలామంది నాయకులు కోట్లకు పడగలెత్తారని, వారి బండారం బయటపెడతానని అన్నాడు. కేసీఆర్ మీద నమ్మకం లేకనే చాలామంది నాయకులు పార్టీని విడిచివెళ్లారని అన్నాడు. కేసీఆర్ కోటరీ కారణంగానే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నాడు. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల ఘాటుగా మాట్లాడిన గుత్తా కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ కనబరిచాడు.

కేసీఆర్, కేటీఆర్ సహా మిగిలిన నాయకులంతా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే గుత్తా మాత్రం ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి హామీలు అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని అన్నాడు. ఆయన చెప్పినదంతా చూస్తుంటే గులాబీ పార్టీలో ఎక్కువకాలం ఉండదేమో అనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?