
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే చెబుతూ ఆవేదన చెందడం గమనార్హం. మల్లారెడ్డి నివాసం, ఆయన విద్యా, వైద్య తదితర సంస్థల కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఛాతీ నొప్పికి గురై ఆస్పత్రి పాలయ్యారు. కొడుకు అనారోగ్యానికి గురి కావడంపై మంత్రి తీవ్ర ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఐటీ దాడుల వల్ల తన కుమారుడు భయంతో వణికిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఐటీ అధికారులు కొట్టారని సంచలన ఆరోపణ చేశారు. అలాగే తన ఇంట్లో పని చేసే మహిళకు ఫిట్స్ వచ్చాయన్నారు. ఆమెను ఐటీ అధికారులే ఆస్పత్రికి తరలించారన్నారు. ఇదంతా ఐటీ దాడుల వల్లే జరిగిందన్నారు.
తాము హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని ఆయన అన్నారు. అంతా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేస్తూ సంపాదించుకున్నట్టు చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తోందని ఆరోపించారు.
ఇదిలా వుండగా ఛాతీ నొప్పితో బాధపడుతున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి నారాయణ హృదయాలయలో చేర్పించారు. కుమారుడిని చూసేందుకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను ఐటీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా