ఓవైసీ కలలు మామూలు స్థాయిలో లేవు!

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చాలా పెద్ద కలలే కంటున్నారు.  ఆ క్రమంలో తమ పార్టీ మీద భాజపాయేతర రాజకీయ పక్షాలలో ఉండే అనుమానాలను గురించి ఆయన విస్మరిస్తున్నారు.  అవకాశం లేని చోట అత్యాశతో…

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చాలా పెద్ద కలలే కంటున్నారు.  ఆ క్రమంలో తమ పార్టీ మీద భాజపాయేతర రాజకీయ పక్షాలలో ఉండే అనుమానాలను గురించి ఆయన విస్మరిస్తున్నారు.  అవకాశం లేని చోట అత్యాశతో కూడిన కొన్ని కాంబినేషన్లను ఆయన ప్రకటిస్తున్నారు గాని అవన్నీ ఆయన పార్టీ మీద ఉన్న ముద్రను మరింతగా బలపరిచేవే.  ఇంతకు అసదుద్దీన్ ఓవైసీ ఏం అంటున్నారు అంటే..  దేశంలో తృతీయ కూటమి ఆవిర్భవించడానికి అవకాశం ఉన్నదట.  

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును మట్టికరిపించడానికి కంకణం కట్టుకున్న ఇండియా కూటమి ఒకటి పనిచేస్తుండగా,  మరొక కూటమి కూడా ఏర్పడడానికి అవకాశం ఉన్నదని..  ఆ కూటమికి భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారథ్యం వహించాలని అసదుద్దీన్ ఓవైసీ ఆశిస్తున్నారు.

భారత కేంద్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రస్తుతం రెండు బలమైన కుటుంబంలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో  కేంద్రంలో అధికారం వెలగబడుతున్న ఎన్డీఏ ప్రధానమైనది కాగా,  ఈ ఎన్నికలలో వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఓడించి..  భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలగంటున్న ఇండియా కూటమి మరొకటి.  కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో దేశంలోని ఎన్డీఏ యేతర పార్టీలు సుమారు 30 వరకు..  ఒక జట్టుగా ఏర్పడి దానికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి.  నిజం చెప్పాలంటే  ఈ రెండు కూటములకు చెందకుండా దేశంలో ప్రధానమైన పార్టీలు వేరే ఏవి లేవు గాక లేవు.

మజిలీస్ అధినేత అసలుద్దీన్ ఓవైసీ చెబుతున్న ప్రకారం..  భారత రాష్ట్ర సమితి ఈ రెండు కూటములలోను లేదన్నమాట నిజం. . అలాగే ఉత్తర ప్రదేశ్ లో అంతో ఇంతో బలం కలిగి ఉన్న బహుజన సమాజ్ పార్టీ మాయావతి కూడా ఈ రెండు కూటములలో లేరు.  మజ్లిస్ సంగతి సరేసరి.  కాబట్టి బారాస,  బహుజన సమాజ్ పార్టీ బహుశా మజ్లిస్‌తో కలిసి తృతీయ కూటమిగా ఏర్పడాలని అసదుద్దీన్ ఓవైసీ కోరుకుంటున్నారు. 

తమాషా ఏంటంటే ఈ మూడు పార్టీల మీద కూడా నరేంద్ర మోడీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని..  ఆయనకు అనుకూలంగా వ్యవహరించే పార్టీలు అనే ఆపకీర్తి బలంగా ఉంది.  కేసీఆర్ మోడీకి అనుకూలంగా ఉన్నారు గనుకనే..  ఇండియా కూటమిలోకి ఆయనను ఆహ్వానించలేదని,  ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.  మాయావతి విషయంలో కూడా కాంగ్రెస్ అదే వైఖరితో ఉంది.  మజిలీస్ మీద కూడా..  బిజెపి విజయం కోసమే ఆయన ముస్లిం ఓట్లను చీల్చడానికి తన పార్టీ అభ్యర్థులను మోహరిస్తుంటారనే  ప్రచారం ఉంది.   

ఇలాంటి నేపథ్యంలో తమ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలని ఓవైసీ అభిలషించినంత మాత్రాన,  వారు మోడీ వ్యతిరేకులు అని ప్రజలు నమ్మే అవకాశం తక్కువ.  కొత్త కూటముల గురించి కలలు కనే ముందు..  అభివృద్ధి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాగుంటుంది.