Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఓ మేధావీ! కీరవాణిపై ఈ ఏడుపులేమిటి?

ఓ మేధావీ! కీరవాణిపై ఈ ఏడుపులేమిటి?

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే సీనియర్ ఐపీఎస్ అధికారి. సివిల్స్ స్థాయిలో పనిచేసిన అధికారి అంటే.. రాష్ట్రాల సరిహద్దులు దాటి ఎక్కడెక్కడో పనిచేసి ఉంటారు. వారికి రాష్ట్రాల తారతమ్యాలు తెలియవు. ఈ దేశం మొత్తం ఒక్కటే అనుకునే విశాల దృక్పథం, హృదయం సివిల్స్ అధికారులకు ప్రాథమికంగా ఏర్పడుతుంది. వారికి ఇచ్చే  శిక్షణే అలా ఉంటుంది.

కానీ.. ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఆ పదవికి రాజీనామా చేసి ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, బహుజన సమాజ్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర చీఫ్ గా ఉంటూ.. రాష్ట్రమంతా పాదయాత్రలు కూడా చేసిన వ్యక్తి  ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ఇవాళ ఎంతో సంకుచితంగా మాట్లాడుతూ ఉండడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని రాష్ట్రంలో బరిలోకి దించి.. భారాస వ్యతిరేక ఓటును తనకు చేతనైనంతగా చీల్చడానికి చెమటోడ్చిన ఈ పెద్ద మేధావి.. కనీసం తాను అయినా ఎమ్మెల్యేగా గెలవగలనని అనుకున్నారు. కానీ ఓటమి తప్పలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే.. ఏమాత్రం మొహమాటం, సంకోచం లేకుండా, ప్రజలు నవ్వుతారనే వెరపు కూడా లేకుండా వెళ్లి కేసీఆర్ పంచన చేరారు. భారాస పార్టీ లో చేరిపోయారు.

ఈ మేధావి నాయకుడు ఇంత సంకుచితంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రగీతంగా గత ప్రభుత్వమే స్వీకరించింది. అయితే.. పాటలో అందెశ్రీతోనే కొన్ని మార్పుచేర్పులు చేయించి.. మరొక ట్యూన్  కట్టించి.. విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం మ్యూజిక్ డైరక్టర్ కీరవాణిని ఎంచుకున్నారు. ఆయన ట్యూన్ కట్టే పని జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆంధ్ర- తెలంగాణ గీతలు గీసేసి, గోడలు కట్టేసి ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగిలించడానికి ఈ మేధావి నాయకుడు కుత్సితమైన బుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రవీణ్ కుమార్ లాంటి మేధావి నాయకుడి కంటె.. ఉద్యమ సమయంలో రాజకీయం కోసమే ఆంధ్రోళ్లని తిట్టానని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ మా బిడ్డలే అని ప్రకటించిన కేసీఆర్ చాలా మహానుభావుడు అనే భావన ప్రజలకు కలిగేలా ప్రవీణ్ వ్యవహరిస్తున్నారు. రేవంత్ ను విమర్శించడానికి ఈ సివిల్స్ మేధావికి మరే కారణం దొరకలేదేమో గానీ.. ఆయన చేసిన ట్వీట్ చూస్తే కంపరం కలుగుతుంది.

‘‘అందెశ్రీ  తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్  కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత  స్వరకల్పనకు  మళ్లీ ఇప్పుడేం  అవసరమొచ్చింది?? అయినా తెలంగాణ కవులపై  ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక??

ముఖ్యమంత్రి  @revanth_anumula  గారు, కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ "నాటు నాటు" పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనం పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్ తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీ లో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా  మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్న.’’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

‘‘తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా??’’ అని ఈ జాతినాయకుడు ప్రజలనుద్దేశించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా బాణీ కట్టించడాన్ని వ్యతిరేకిస్తే అది రాజకీయం అవుతుంది. భారాస ప్రభుత్వం గతంలో చేసిన ప్రతిపనినీ మార్చి, తమ ముద్ర చూపించుకోవడం కోసం రేవంత్ ఆరాటపడుతున్నారని విమర్శించినట్టుగా ఉంటుంది. కానీ.. ఆ మిషమీద కీరవాణి మీద పడి ఏడిస్తే.. అది సంకుచితమైన బుద్ధి అనిపించుకుంటుంది.

ఇలా రాష్ట్రాల మధ్య దారుణమైన గీతలు గీసేసి బతకాలనుకునే నాయకులు భారత రాష్ట్ర సమితి అనే ముసుగులో జాతీయ రాజకీయాల్లో ముద్ర చూపిస్తాం అని, ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం అని అంటే.. చాలా లేకిగా ఉంటుంది. జాతీయ పార్టీ గా ఆవిర్భవించిన తర్వాత.. విశాల దృక్పథం ఉన్న పార్టీగా భారాసకు పేరు తీసుకువచ్చేందుకు కేసీఆర్ అండ్ కో కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలకు ప్రవీణ్ కుమార్ లాంటి సంకుచితమైన నాయకులు ఇలాంటి చీప్ మాటలతో గండికొడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?