Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేంద్రానిది సంకుచిత ఎన్నికల ఎత్తుగడ!

కేంద్రానిది సంకుచిత ఎన్నికల ఎత్తుగడ!

జూన్ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ జూన్ 2 నాటికి పదో సంవత్సరం మొదలవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి దశాబ్ది ఉత్సవాలను ఏడాది పొడవునా చాలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటూ ప్రతిరోజూ వివిధ రకాల కార్యక్రమాలతో హంగామా చేయనున్నారు. 

ఎటూ సుమారుగా ఆరునెలల దూరంలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. దశాబ్ది వేడుకల పేరిట ఎంత ఎక్కువగా హంగామా చేస్తే.. తమ పార్టీకి అంతగా మైలేజీ వస్తుందని కేసీఆర్ తలపోస్తున్నట్టుగా అనిపిస్తోంది.

అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాకు పెట్టుకుని.. ప్రభుత్వ ఖజానాలోని సొమ్ములు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ.. కేసీఆర్ తన పార్టీ భారాసకు మైలేజీ తెచ్చుకోబోతున్నారని విపక్షాలకు ఇప్పటినుంచే ఉడుకు పుట్టినట్టుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తాము కూడా గరిష్టమైన మైలేజీ సంపాదించాలని, పొలిటికల్ గా లబ్ధి పొందడానికి ప్రయత్నించాలని వ్యూహరచన చేస్తున్నది. 

నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బిజెపికి ఎలాంటి క్రెడిట్ దక్కదు. రాష్ట్ర విభజనకు సంబంధించి.. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ, పేషెంట్ చనిపోయింది అని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఘనత కూడా మోడీజీ ఖాతాలో ఉంది. 

అయినా సరే.. ఈ ఏడాదిలోనే రాబోయే ఎన్నికల్లో గెలిచి.. దక్షిణాది రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అని చాటుకోవాలని ఉబలాటపడుతున్న బిజెపి.. తమ చేతికి ఖర్చు అంటకుండా ప్రచారం సంపాదించుకునే మార్గాన్వేషణలో ఒక దారి కనుగొన్నది. 

కేంద్రప్రభుత్వం ఖర్చుతో, కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్సవం గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అనేకమంది కేంద్రమంత్రులు కూడా హాజరవుతారట. ఇక ఆ సభ మొత్తం.. తెలంగాణకు అది చేశాం ఇది చేశాం అంటూ డబ్బా కొట్టుకోవడంతోనే సరిపోతుంది.

కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించడం అనేది.. సంకుచితమైన ఎన్నికల ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక రాష్ట్రావతరణ ను కేంద్రం నిర్వహించడం అనేది ఎక్కడా జరగదు. ఏపీకి ఎందుకు నిర్వహించరు? అనే మాట కూడా వస్తుంది కదా? మిగిలిన రాష్ట్రాలన్నీ ఇలాంటి డిమాండ్లు వినిపించాలి కదా. 

కానీ.. ఎవ్వరెలా విమర్శించినా బిజెపి పట్టించుకుంటుందనే నమ్మకం లేదు. తెలంగాణలో ముంగిట్లో ఎన్నికలు ఉన్నాయి గనుక.. ఇక్కడ మాత్రం మైలేజీ కోసం కార్యక్రమాలు అంటున్నారు. తమ పార్టీ జేబులోంచి ఖర్చు పెట్టకుండా ... కేంద్ర సర్కారు డబ్బు పెట్టబోతున్నారు. వీరిలా సర్కారు సొమ్ములతో సొంత భజన చేసుకుంటుండగా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం పాపం.. ఖర్చులకు జడిసి ఉత్సవాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?