Advertisement

Advertisement


Home > Politics - Telangana

అత‌ని బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ అవిశ్రాంత పోరాటం

అత‌ని బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ అవిశ్రాంత పోరాటం

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో కీల‌క నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ అవిశ్రాంత పోరాటం చేస్తోంది. గ‌తంలో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఏపీ హైకోర్టును సీబీఐ ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే బెయిల్ ర‌ద్దుకు స‌రైన కార‌ణాల‌ను సీబీఐ చూప‌క‌పోవ‌డం, విచార‌ణ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్ప‌లేక పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దుకు నిరాక‌రించింది.

అయితే ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్ర‌యించింది. వివేకా కుమార్తె న‌ర్రెడ్డి సునీత విజ్ఞ‌ప్తి మేర‌కు కేసును తెలంగాణ‌కు సుప్రీంకోర్టు బ‌దిలీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ విష‌య‌మై తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాల‌ని సుప్రీం సూచించింది. దీంతో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ వ్య‌వ‌హారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.

సీబీఐ పిటిష‌న్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర‌గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఎర్ర‌గంగిరెడ్డి త‌న బెయిల్‌ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో కోర్టుకు అఫిడ‌విట్ వేయ‌నున్నారు. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.  

ఇదిలా వుండ‌గా వివేకా హత్య కేసులో 2019, మార్చి 28న సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే 90 రోజుల్లో సిట్ చార్జిషీట్ వేయకపోవడంతో గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ద‌ర్జాగా పులివెందుల‌లో తిరుగుతున్నారు. సీబీఐ విచార‌ణ మొద‌లైన త‌ర్వాతే ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ హైకోర్టులో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?