
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక ఆరోపణలకు పాల్పడుతున్నారని మహిళా సర్పంచ్ నవ్య ఆవేదనపై తెలంగాణ మహిళా కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. సర్పంచ్ నవ్య ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
రాజయ్యపై సర్పంచ్ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని డీజీపీని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. సర్పంచ్ ఆరోపణల్లో నిజం వుందని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజయ్య అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లిక్కర్ స్కామ్‌కు పాల్పడిన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ కామెంట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు గగ్గోలు పెట్టాయి. బండి సంజయ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదు, ఆయన దిష్టిబొమ్మలను యథేచ్ఛగా దహనం చేశాయి. మహిళా కమిషన్ కూడా సీరియస్‌గా స్పందించి సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది.
మహిళా కమిషన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ నవ్య తనపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తుంటే, మహిళా కమిషన్‌కు చీమ కుట్టినట్టైనా లేదా? అని ప్రత్యర్థులు నిలదీశారు.
దళిత మహిళ ఆరోపణలను సుమోటోగా స్వీకరించని మహిళా కమిషన్, ఇదే కవిత విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం ఏంటనే నిలదీతలు వ్యక్తమయ్యాయి. దీంతో మహిళా కమిషన్ ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.