ప్రతీకారానికి రేప్! ప్రేమకు రేప్! స్నేహానికి రేప్! సరదాకి రేప్! అహంభావానికి రేప్! ఈర్ష్యకు రేప్! పైసలకు రేప్! బ్లాక్ మెయిలింగ్‌కు రేప్! ఏ కారణం లేకపోతే రేప్ కోసం రేప్. విచ్చలివిడిగా తాగి, చిందులేసే పార్టీలను 'రేవ్' పార్టీలనటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు 'రేప్ పార్టీ'లు ఎక్కువయ్యాయి. తనకు తెలసిన మహిళను మాయచేసి తీసుకొచ్చి మిత్రుల దగ్గర పెట్టి, గ్యాంగ్ రేప్ చేసుకోనటం ఒకానొక సంస్కృతిగా మారిపోయింది.
రాను రాను రేప్‌ను వ్యతిరేకించేవాళ్ళు తగ్గిపోగా, రేపిస్టులను సభ్యసమాజంలో అనుమతిస్తే తప్పనేవాళ్ళ శాతం కూడా పెరిగిపోతోంది. ఈ రేప్ కల్చర్‌ను ఇలాగే వదిలేస్తే, పలు నేరస్తులకు సమాజంలో వచ్చిన గౌరవం 'రేపిస్టు'కు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓ మాఫియా డాన్‌కూ, ఓ ఫ్యాక్షనిస్టుకీ, ఓ బందిపోటుకీ వచ్చిన గ్లామర్ మెల్లగా 'రేపిస్టు'కు వచ్చే ఆవకాశం వుంది.
కేవలం నాలుగయిదు రోజుల వ్యవధిలో జాతీయ మాధ్యమాలు రెండు 'గ్యాంగ్ రేప్'లను రిపోర్టు చేసింది ఒకటి:ఇప్పటికే 'రేప్ క్యాపిటల్'గా 'ఖ్యాతి'గాంచిన భారత రాజధాని నగరం 'ఢిల్లీ'లో జరిగితే. మరొకటి: అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా నడి రోడ్డుమీద తిరగగలిగినప్పుడే దేశానికి స్వరాజ్యం వచ్చినట్టు లెక్క- అని చెప్పిన గాంధీజీ పుట్టిన గుజరాత్ గడ్డ మీద జరిగింది. ఈ నేరాన్ని ఢిల్లీలో చదువుకున్న 'సంత' పశువులు చేస్తే, గుజరాత్లో 'విద్య' లేని వింత పశువులు చేశారు. అంతే తేడా.
రేప్‌కు కారణాలు. ఒక చోట: ఫన్ లేదా సరదా మరొక చోట: పగ.
ఢిల్లీ ఘటనలో బాధితురాలు ఇద్దరు బిడ్డల తల్లి. ఒక యువకుడు ఆమెను నమ్మించి పార్టీ చేసుకుందామని బయిటకు తీసుకు వచ్చి, తన స్నేహితులయిన అయిదుగురు బీపీవో ఉద్యోగులకు అప్పగించి వెళ్ళిపోయాడు. వాళ్లు ఆమెకు బలవంతంగా మద్యం పట్టించి, వివస్త్రను చేసి, ఒకరి తర్వాత ఒకరి అత్యాచారం చేశారు. తెల్లవారు ఝామున ఆమె వారి బందిఖానా నుంచి తప్పించుకోవటానికి బాల్కనీనుంచి ఒంటిమీద నూలు పోగులేకుండా దూకేసింది. గాయాలతో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళను ఆదుకోమని అరిచింది. వాళ్ళకళ్ళకూ సీసీ కెమెరా కళ్ళకూ పెద్ద తేడాలేదు. చూశారంతే. కానీ సీసీ కెమెరాయే మెరుగు. చూసింది చూసినట్టు వుండకుండా సాక్ష్యం చెప్పింది. అయితే ఒక ఆటోరిక్షా డ్రైవరు సాయంతో ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే, ఆ అయిదుగురును అరెస్టు చేశారు. ఇది హోలీ పండుగ రోజున జరిగింది. అంటే హోలీకి ఈ ఇద్దరు బిడ్డల తల్లిని పార్టీ చేసుకోమని ఒక యువకుడు తన మిత్రులకు వదిలేసి వెళ్ళిపోయాడు.
ఇక రెండో ఘటన: ఇది గుజరాత్ లోని దాహోద్‌లో జరిగింది. ఇక్కడ ఆరుగురు రేపిస్టులు. ఒక షాపులోనుంచి తండ్రినీ, అతని ఇరవయియేళ్ళలోపు అమ్మాయిల్నీ బలవంతంగా ఎస్యూవీ వాహనం ఎక్కించి తండ్రి ముందే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో వాహనం నుంచి విసిరేశారు. ఆరాతీస్తే, బాధితురాళ్ళకో సోదరుడు కూడా వున్నాడు. అతడిమీద ఈ ఆరుగురులో ఒకడయిన కుమత్ బరియా కక్ష పెంచుకున్నాడు. గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులోవున్న విషయం తెలిసిందే. కానీ కుమత్ అక్రమంగా సారాని విక్రయిస్తుంటాడు. అందులో భాగంగా బాధితురాళ్ళ సోదరుడికి కూడా అమ్మాడు. ఆ విషయాన్ని బాధిరాళ్ళ సోదరుడు పోలీసులకు చెప్పాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అతనికి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు కుమత్. అంతే తన ముఠాను వేసుకుని వచ్చి ఈ చర్యకు పాల్పడ్డాడు.
ప్రభుత్వాలు మారవచ్చు. వాటిని నడిపే పార్టీలు మారవచ్చు, ఆ పార్టీల నేతలూ మారవచ్చు. కానీ రేప్‌లు నిరాఘాటంగా జరిగిపోతూనే వున్నాయి. ఏదో ఒక్కసారి దేశంలో యువత ఉలిక్కి పడి, ఢిల్లీని ముట్టడించినప్పుడు మాత్రం, 'నిర్భయ' చట్టాన్ని చేశారు. ఆ చట్టం వచ్చాక స్త్రీలు నిర్భయులు కావలిసింది పోయి, ఈ మగ పశువులు నిర్భయులవుతున్నారు. బరితెగిస్తున్నారు. జస్టిస్ వర్మ కమీషన్ కమిటి సిఫారుసుల ఆధారంగానే నిర్భయ బిల్లును చేశారు. కానీ సిఫారుసుల్లో రెంటిని అప్పటి కేంద్రం పెడచెవిన పెట్టింది. ఒకటి: మరణశిక్షను ఆయన ప్రతిపాదించలేదు. అంటే వద్దన్నారు. రెండు: జమ్ము- కాశ్మీర్, సరిహద్దు ఈశాన్య రాష్ట్రాలలో అమలులో వున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎను) ఉపసంహరించమన్నారు. కానీ నిర్భయ చట్టంలో మరణ శిక్ష వుంది. ఎఫ్ఎస్పిపిఎ ఉపసంహరణను కేంద్రం యధాతథంగా వుంచింది.
హోలీ పండుగనాడు జరిగిన ఘటనలో గ్యాంగ్ రేప్‌కు గురయిన తర్వాత కూడా తనను వదలరని.. అంటే బతకనివ్వరని.. అనుమానం వచ్చి వుంటే తప్ప, ఆమె ప్రాణాలకు తెగించి బాల్కనీ నుంచి దూకివుండేది కాదు. అత్యాచారం చేశాక కూడా ఆమెను బంధించి వుంచారంటే… సాక్ష్యాల్ని తుడిచి వెయ్యటానికో, ఎవరికీ చెప్పకుండా చెయ్యటానికో ఆమెను హతమార్చే అవకాశం వుంది. నేరస్తులు తమకు మరణ శిక్ష పడుతుందన్న భయంతో సాక్ష్యాలను తుడిచేస్తారన్న జస్టిస్ వర్మ కమిషన్ భయమే ఇక్కడ నిజమయ్యింది.
సతీష్ చందర్