టాలీవుడ్‌లో ముదురుతున్న బ్రహ్మచారులు!
ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు!
తల్లిదండ్రుల ఒత్తిళ్లనూ లెక్క చేయని హీరోలు!
గ్లామర్‌ను క్యాష్ చేసుకోవడం మీదే హీరోయిన్ల చూపు!
ప్రేమల్లోనే ముచ్చట్లూ తీరిపోతుండటమే కారణమా!
దేశానికి మించిన సమస్య లేదా? అనేయొచ్చు! కానీ.. నలుగురికీ తెలిసిన వాళ్లు, సినిమాల్లో మెరుస్తున్న వాళ్లు, అభిమాన గణాన్ని కలిగిన వాళ్లు.. కాబట్టి వీళ్ల పెళ్లెప్పుడనేది ఒకింత ఆసక్తికరమైన అంశం! ఎదిగాకా, కాస్త సెటిలయ్యాకా… వీళ్లు పెళ్లి సహజధర్మంగా పెళ్లి చేసు కుని, సంసార ధర్మంలోకి ఎంటరయ్యుంటే.. అది పెద్ద చర్చనీయాంశం కాదు, కానీ.. ఎప్పుడైతే జరగాల్సిన వయ సులో జరగాల్సింది జరగలేదో.. అప్పుడు దాని గురించి చర్చ మొదలవుతుంది! ఒకరిద్దరైతే ఏదో వదిలేసేయొచ్చు, కానీ.. తెలుగు చిత్రసీమ వరకూ తీసుకున్నా, చాలామంది తారల 'పెళ్లి' మిస్టరీగానే మిగిలిపోతోంది! సినీ పరిభాషలోనే చెప్పాలంటే తగు వయసులో పెళ్లి చేసుకోకపోవడం, అసలు పెళ్లి ఊసే ఎత్తకపోవడంలో ఒక ట్రెండ్ అయిపోయింది! ఈ జాబితాలో కొన్నాళ్ల కిందట వరకూ హీరోయిన్లే ఉండేవాళ్లు, ఇప్పుడు హీరోలు కూడా జాయిన్ అయిపోయారు! దీంతో ఇంతకీ వీళ్లందరికీ ఏమైంది? ఎందుకు పెళ్లి ఊసే వినిపించనీయడంలేదు? అనే విషయం చర్చలోకి వస్తోంది!
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్…
బహుశా సినిమా వాళ్లకు, క్రికెటర్లకు కచ్చితంగా తగిలించేయగల ట్యాగ్ ఈ మాట. పెళ్లికి దాదాపు అన్ని అర్హతలూ కలిగిన వాళ్లు. అందానికి అందం, హోదాకు హోదా, డబ్బుకు డబ్బు.. వీటికి అదనంగా, ఫేమ్‌ను కూడా కలిగినవాళ్లు. ఈ విధంగా అన్ని అర్హతలూ కలిగిన వీళ్లకు వయసు అనే అర్హత కూడా ఉంది. అవసరానికి మించిన అర్హతలు కలిగిన వీళ్లకు 'వయసు' అనే అర్హత మించిపోతోంది కూడా! కానీ.. వీళ్లెవ్వరూ పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడం లేదు! మామూలుగా చూస్తే.. వయసు మీద పడుతుంటే, పెళ్లి విషయం టెన్షన్‌గా మారాలి. అయితే తెలుగు తారలు మాత్రం చాలా తాపీగా, పెళ్లంటే ఏంటో కూడా తెలియనట్టుగా కనిపిస్తున్నారు!
ఈ జాబితా పెద్దదే!
హీరోలైతేనేమీ, హీరోయిన్లు అయితేనేమీ.. తయారు చేస్తే ఈ జాబితా చాలా పెద్దదే! వయసు మీద పడు తున్నా.. పెళ్లి ఊసు ఎత్తని ఈ జాబితాలో.. ప్రభాస్, దగ్గుబాటి రానా, నితిన్, విశాల్, రామ్, శర్వానంద్, తరుణ్, నవదీప్, నారారోహిత్ వంటి హీరోలు. అనుష్క, శ్రియ, కాజల్, శృతిహాసన్, తమన్నా, త్రిష.. తదితర హీరోయి న్లతో పాటు దేవీశ్రీ ప్రసాద్, అల్లుశిరీష్ వంటి వారు కూడా ఉన్నారు! తరచి చూస్తే.. ఈ జాబితాలో ఇంకా చాలా మందిని చేర్చవచ్చు!
ఎవరి వయసూ తక్కువ కాదు!
ప్రభాస్ వయసు 37 సంవత్సరాలు, విశాల్‌కు కూడా దాదాపు ఇదే వయసు ఉంది. దగ్గుబాటి రానా తన వయసు 32 యేళ్లు అని ఈ మధ్యనే చెప్పాడు. ఇక నితిన్ వయసు 33 సంవత్సరాలు దాటేసింది. తరుణ్ వయసు 34యేళ్లు! శర్వానంద్ వయసు 31, నవదీప్ 30, నారా రోహిత్ 31… ఈ స్థాయిలో ఉన్నాయి ఈ హీరోల వయ సులో. వీరిలో కొంచెం లేత అంటే రామ్.. ఇతడి వయసు 28. ఇక మిగిలన వాళ్లు అంతా ముదురులే! ఇక హీరో యిన్ల వయసు విషయానికి వస్తే.. వీరిలో అనుష్క 35 దాటేసింది! అనుష్క కన్నా రెండేళ్లు చిన్నది త్రిష. శృతిహాసన్‌కు 30 దాటింది. తన వయసు 27 అనేది తమన్నా మాట. అప్పుడెప్పుడో జమానాలో కెరీర్ మొదలుపెట్టిన శ్రియకు 34 యేళ్లట. చెల్లికి పెళ్లి చేసేసిన కాజల్ వయసు 31 అట. ఇదీ లీడింగ్ హీరోయిన్ల వయసు!
ఈ భామల పరిస్థితి ఎలా తయారైందంటే.. కుర్ర హీరోల సరసన వీళ్లు సెట్ కారు, అంతలా ముదిరిపోయారు.. అనే పరిస్థితి వచ్చింది. మినిమం 40 దాటిన హీరోల సరసన అయితేనే వీళ్లు, అంతలోపు హీరోల సరసన వీళ్లు ముదురుల్లా కనిపిస్తున్నారని.. ఇండస్ట్రీనే వీరిని పక్కన పెట్టింది. చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్ వంటి వారి సరసన అయితే.. ఈ భామలను పరిగ ణనలోకి తీసుకుంటున్నారు సినిమాల రూపకర్తలు! మరి తెరపై వీరికి అలాంటి ప్రాధాన్యత దక్కుతోంది! తెరపైనే కుర్రాళ్ల సరసన వీళ్లు సెట్ కావడంలేదు, మరి తెర బయట వీళ్లకు ఎలాంటి వాళ్లు భర్తగా సరైన జోడీ అవుతారనేది ఆలోచించాల్సిన విషయమే!
అయితే హీరోయిన్ల విషయంలో ఒక విషయాన్ని గమ నించాలి. దీపం ఉండగానే వీళ్లు ఇల్లు సర్దుకోవాలి. అవకాశాలు వస్తున్నంత సేపే వీళ్లు ఆబగా వాటిని అంది పుచ్చుకోవాలి. ఇలాంటి సమయంలో బ్రేక్ పడిందంటే.. వీళ్లు అలవాటు పడ్డ జీవన శైలిని జీవితాంతం అనుభ వించడం కష్టం. అవకాశం ఉన్నంత సేపూ సంపాదించుకుని.. ఆ తర్వాత ఎవరినో చూసి పెళ్లి చేసుకోవాలి. దీంతో వీళ్ల మ్యారేజ్‌లు సహజంగానే లేట్ అవుతాయి. చివరకు ఎవరో బిగ్‌షాట్‌ను చూసి.. వాడికి రెండో పెళ్లి అయినా, మూడో పెళ్లి అయినా.. రాజీపడిపోతూ ఉంటారు సినీ ఇండస్ట్రీలోని అమ్మాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా.. ఇంకెక్కడ అయినా దశాబ్దాలుగా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది!
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న హీరోయిన్లే కాదు, ఇండస్ట్రీతో రిలేషన్స్ బాగానే ఉన్న చాలా మంది నటీమణులు పెళ్లికి అంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడాన్ని కూడా గమనించవచ్చు. పెళ్లికి మించి వీరి ప్రాధాన్యత, కెరీర్- సినిమాలు- ఇండస్ట్రీకే! ఇదే వీరి జీవితం దాదాపుగా! హీరోయిన్ల సంగతలా ఉంటే.. ప్రస్తుత తరం తెలుగు హీరోల పరిస్థితి మాత్రం చిత్రంగా ఉంది. వీళ్లకు వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసు మాత్రం వినిపించడం లేదు. 30 యేళ్లలోపు అయితే కోరుకున్న పెళ్లాం, అంతకు మించితే వచ్చిందే.. పెళ్లాం! అనేది ఇప్పుడు సమాజంలో నడుస్తున్న ట్రెండ్. అయితే హీరోలు మాత్రం 37, 38 వచ్చినా పెళ్లి గురించి మాట మాత్రమైనా మాట్లాడటం లేదు. వీళ్లకు ఇంత వయసు వచ్చినా పిల్లను ఇచ్చే వాళ్లైతే ఉంటారు, కానీ బయట ట్రెండ్‌తో వయసు విషయం లోనూ పోలిక పెడితే మాత్రం.. ఇంత వయసు అనేది నెగిటివ్ రిమార్కే! వీళ్లు హీరోలు గనుక కాకపోతే.. ఇంత వయసు వచ్చాకా పెళ్లి చేసుకుంటే ఏం, చేసుకోకపోతే ఏం! అనేమాట అనేస్తారు బయటి జనాలు!
గతంలో లేదు ఈ తరహా!
ఏజ్‌బార్ అయినా.. పెళ్లి చేసుకోకపోవడం అనేది ఈత రం హీరోలు అనుసరిస్తున్న ట్రెండ్ మాత్రమే. గత తరం హీరోల్లో ఈ తరహా కనిపించదు! మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. వంటి వాళ్ల పెళ్లిళ్లు సరైన వయసులోనే అయిపోయాయి! వాళ్లెవ్వరూ సినిమా కెరీర్‌కు, వైవాహిక జీవితానికి ముడి పెట్టుకోలేదు. హీరో లుగా నిలదొక్కుంటున్న వయసులోనే వివాహాలు చేసేసుకున్నారు. అటు మ్యారేజ్ లైఫ్‌ను ఇటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకున్నారు!
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తాము సరైన వయసులో పెళ్లి చేసుకున్న ఈస్టార్లు తమ పిల్లలకూ తగిన వయసు రాగానే పెళ్లిళ్లు చేసేశారు, చేసేస్తున్నారు. భజం త్రీలు మోగింపజేసి.. తమ బాధ్యతలను పూర్తి చేస్తున్నారు. చిరంజీవి తన కూతుర్లు, కొడుకుకు తగిన ఏజ్‌లో పెళ్లి చేసేశాడు. ఇక బాలకృష్ణ కూడా అమ్మాయిల విషయంలో బాధ్యతపూర్తి చేసుకున్నాడు, నాగార్జున పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు. వీళ్లు మాత్రమే కాదు.. పలువురు సినిమావాళ్లు ఎదిగిన పిల్లలకు పెళ్లిళ్లు చేసేశారు. కొడుకుల విషయంలో అయినా, కూతుర్ల విషయంలో అయినా.. సంబంధాలు చూసి కొందరు, ప్రేమ వివాహాలను మరికొందరు చేసేశారు!
రజనీకాంత్‌తో మొదలుకుని సాయికుమార్ వరకూ ఇలాంటి తండ్రులు చాలా మందే ఉన్నారు. అలాగే ఆర్యన్ రాజేష్, అల్లరినరేష్ తదితరులు కూడా ఫ్యామిలీ టైప్! పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఈదేస్తున్నారు. మిగిలిన బ్రహ్మచారుల హీరోలవి కూడా ఈ తరహా కుటుంబాలే అయినా.. ఎందుకో వీళ్లు పెళ్లి విషయంలో ఒకింత విము ఖతను ప్రదర్శిస్తున్నట్టుగా ఉన్నారు!
విడాకుల భయం కూడా ఉందా?
పెళ్లి చేసుకోని కొంతమంది హీరోలకు కొన్ని భయాలు కూడా ఉన్నాయని వారిని ఎరిగిన వారు చెబుతున్నారు. కొంతమంది హీరోలు పెళ్లి చేసుకోవడం.. తర్వాత తమ లైఫ్‌స్టైల్‌కు- మ్యారీడ్ లైఫ్‌కు మ్యాచ్ గాక, చివరకు విడాకుల వరకూ వెళ్లడం కూడా కొంతమంది హీరోల్లో పెళ్లిపై ఫోబియాను పెంచుతోందనే మాట వినిపిస్తోంది. ఇలాగే ప్రశాంతంగా ఉన్నాం కదా.. అనే తాత్వికత కూడా కొంతమంది హీరోల నుంచి వ్యక్తం అవుతోంది!
తల్లిదండ్రుల ఒత్తిళ్లు ఉన్నాయి!
వీళ్లు హీరోలైనంత మాత్రానా.. వీళ్లింట్లో వాళ్లు వీళ్ల పెళ్లిళ్లను జనాలు లైట్ తీసుకున్నంతగా తీసుకోలేదు. విశాల్ తరచూ చెబుతూనే ఉంటాడు.. తన వివాహం విషయంలో తల్లి పోరు పెడుతోందని! పెట్టదా 38 వచ్చేశాయి మరి. విశాల్ అన్నకు కొన్నేళ్ల కిందట పెళ్లి అయ్యింది. హీరోయిన్, వీజే శ్రియరెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. కేవలం విశాల్‌నే కాదట, విశాల్ స్నేహితుడు మరో తమిళ హీరో ఆర్య కూడా ఏజొచ్చిన బ్రహ్మచారే! అతడిని కూడా విశాల్ తల్లి తరచూ.. మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకోండ్రా బాబూ.. అంటూ ఒత్తిడి చేస్తుందట. ఇక ప్రభాస్ పెళ్లి గురించి వీళ్ల పెద్దనాన్న కృష్ణంరాజు చూస్తున్నాం, చేస్తాం.. అనే ప్రకటనలు చేశాడిది వరకూ! అయితే నితిన్ మాత్రం ఇంత వరకూ 'పెళ్లి' అనే మాట ఎత్తలేదు! అలాగే హీరోయిన్లతో ప్రేమాయణాల్లో కూడా ఈ హీరో పేరు ఆఫ్ ద రికార్డుగా కూడా ఎక్కడా వినిపించలేదు!
బాలీవుడ్ ఆదర్శమా!
బాలీవుడ్‌లో ముదురు బ్రహ్మచారులు ఉన్నారు. ఓల్డ్ బ్యాచిలర్ సల్మాన్‌ఖాన్ చాలా మంది టాలీవుడ్ హీరోలకు కులగురువులా కనిపిస్తున్నాడు. సల్లూని ఆయన తమ్ముళ్లు కూడా ఆదర్శంగా తీసుకోలేదు. వాళ్లు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకున్నారు. విశేషం ఏమిటంటే.. పెళ్లి చేసుకున్న తమ్ముళ్లు పెళ్లాలతో గొడవపడి విడిపోయే పరిస్థితుల్లో.. సల్మానే రంగంలోకి దిగి వారి కాపురాలను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. పెళ్లి చేసుకోకపోయినా సల్లూకు పెళ్లిపై చాలా గౌరవమే ఉన్నట్టుంది. సల్మాన్‌ను మినహాయిస్తే.. పెద్దగా ముదురు బ్రహ్మచారులు లేరక్కడ. ఈ తరంలోని హీరోలు అయితే.. కొన్ని ప్రేమ వ్యవహారాల్లో చాన్నాళ్లు పాటు ఎంజాయ్ చేసి కూడా, చివరకు వాటిని వదిలించుకుని వేరే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రేమ యాణాలు నెరిపిన హీరోయిన్లను పెళ్లి చేసుకోవడానికి కూడా వీళ్లు వెనుకాడటంలేదు. అయితే అక్కడ హీరోల కన్నా హీరోయిన్లే పెళ్లి చేసుకోని వారు ఎక్కువమంది. టబు, సుస్మిత వంటి వాళ్లు చాలా వయసు వచ్చిన పెళ్లి జోలికి వెళ్లడంలేదు. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఏ సెకెండ్ హ్యాండ్ నో చూసి పెళ్లి చేసుకున్నారు. ఇంకొం తమంది హీరోయిన్లు.. క్రికెటర్లతోనో, హిందీ హీరోల తోనేనో.. బంధాలను కొనసాగిస్తున్నారు. ఆ బంధాలను రహస్యంగా దాచేయక, ఎంచక్కా ఓపెన్‌గానే ఉంటు న్నారు!
హితబోధలు అక్కర్లేదులే!
ముదురు బ్రహ్మచార హీరోహీరోయిన్లకు ఎవరి హిత బోధలూ అక్కర్లేదు. వాళ్ల రోజులు ఎంచక్కా గడిచిపోతున్నాయి. వాళ్లు అనుకుంటే.. ఒక పెళ్లికాదు, మూడు నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకోగల ఘటికులు! ఈ విషయాన్ని ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు నిరూపించారు. అయితే వీరి అభిమానులు మాత్రం వీరి పెళ్లిళ్ల కోసం కొంచెం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్లను చేసుకుంటారు అనే ఆసక్తి మీడియాది! పెళ్లి విషయంలో చాలా మంది హీరోలు కూడా సొంత కులంగోడదాటని నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడు చాలా మార్పులు వచ్చాయి. గ్లామర్ ఒలకపోసిన హీరోయిన్లనే పెళ్లి చేసుకుంటున్న వారు, ప్రేమించి, తమ పెళ్లి తో కులం సరిహద్దులను చెరిపేస్తున్న వారు చాలా మందే కనిపిస్తున్నారు. మరి ఈ ముదురు బ్రహ్మచారి గిత్తలు ఏం చేస్తాయో చూడాలి!
ప్లేబాయ్ లైఫ్ కూడా కారణమా?!
ఓపెన్‌గా చెప్పాలంటే.. టీనేజ్‌లోనే మొదలవుతాయి పెళ్లి మీద ఆలోచనలు! హర్మోన్ల ప్రభావం శరీరం మీద, సమాజం ప్రభావం మీద మనసు మీద! ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో, ఎలాంటి మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేయాలో.. అప్పటి నుంచినే మనసులో కొన్ని ఊహలు! అత్యంత సహజమైన ఆ ఆలోచన విషయంలో క్రమంగా పరిణతి రావొచ్చుగాక.. ప్రత్యేకమైన రీజన్లుంటే తప్ప పెళ్లిపై విముఖత పెరగదు. కెరీర్ విషయంలో కానీడెన్స్ కలిగిందంటే.. పెళ్లి విషయంలో ఎవరు ఆపినా ఆగడం కష్టమే! మనసు, శరీరం.. రెండూ కుదురుగా ఉండనివ్వవు! అదంతా సహజమే.
కానీ ఈ సినిమా వాళ్లు అసహజంగా ఉండటానికి కారణం ఏమిటి? అంటే.. వీళ్ల ప్లేబాయ్ తరహా జీవితం కూడా ఒకటి అనే మాట వినిపిస్తుంది. రంగురంగుల ప్రపంచం, కలర్‌ఫుల్ జీవితం, అన్నీ అందుబాటులో! వీటిల్లో ప్రేమ.. శృంగారం కూడా చాలా సులువుగా దొరికేస్తాయి. కాబట్టి.. ఇక 'పెళ్లాంతో పనేంటి?' అనే ఆలోచన రావొచ్చు! రావడానికి చాలా అవకాశం ఉంది!
చాలా మంది హీరోల రాసలీలలు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. తమ సహనటీమణులతో వీరి సాన్నిహిత్యం, ప్రేమ.. వంటి వ్యవహారాలతో వీళ్లు అడపాదడపా వార్తల్లో వస్తూనే ఉన్నారు. కొందరు ఈ విషయాల్లో యధేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా డేటింగ్‌లలో మునిగి తేలుతున్నారు. ఒక్కో హీరోయిన్‌తో కొంతకాలం.. ఆ వ్యవహారాల్లో కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని మరుగునే ముగిసిపోతున్నాయి. ఒక్కో అమ్మాయిని డీటెయిల్డ్‌గా స్టడీ చేయాలన్నా.. కొంత సమయం పడుతుంది! అలా వీరి పుణ్యకాలం గడిచిపోతోంది అనేది ఇండస్ట్రీ నుంచి వినిపించే ఒక అభిప్రాయం!
అందుబాటులో అన్నీ ఉన్నప్పుడు.. ఒక అమ్మాయితోనే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు ప్రేయసినే మార్చేసే అవకాశం ఉన్నప్పుడు.. పెళ్లి చేసుకుని, ఎందుకు ఒక రాజ్యాంగానికి లోబడాలి? అనేది వీరి దృక్పథం అనేది ఒక అభిప్రాయం. తోడు కోసం, మనసుకు స్వాంతన కోసం పెళ్లి చేసుకుంటారు, పెళ్లితో శృంగారం అదనం. ఇవన్నీ కూడా పెళ్లి లేకుండానే దొరుకుతున్నప్పుడు.. ఇక పెళ్లి ఎందుకు? అనేది ఈ ప్లేబాయ్స్ లాజిక్!
ఇక చాలా మంది హీరోయిన్లు కూడా ఈ తరహా జీవితాన్నే ఎంజాయ్ చేస్తున్నట్టుగా అగుపిస్తున్నారనేది ఇండస్ట్రీలో లోగుట్లు ఎరిగిన వారు చెబుతున్న మాట. ఎక్కడ నుంచినో వచ్చిన ఈ భామలు.. ఇక్కడ మనుగడ కోసం కొంతమంది హీరోలకు దగ్గర అవుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సదరు హీరోలకు సన్నిహితం అవుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే వాళ్లకు ఇది తప్పకపోవచ్చు. అలాగని వాళ్లేదో అన్యాయం అయిపోతున్నారు కాదు, కొందరు అన్నీ తెలిసే ఈ తరహా బంధాలను కొనసాగిస్తున్నారు. వీళ్ల బంధం ఎక్కడైనా బయటపడితే మాత్రం.. మాది స్నేహం అంటూ.. తెలివిని ప్రదర్శించేస్తున్నారు. అన్నీ స్వార్థపూరిత బంధాలు కూడా కాదు. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి బంధాల్లోనే మానసికమైన తోడును వెతుక్కొంటున్నారు.. అనేది పరిశీలకులు చెబుతున్న మాట. దీంతో అటు హీరోలకు, ఇటు హీరోయిన్లకు 'పెళ్లి' ప్రాధాన్యత ఉన్న వ్యవహారం కావడం లేదని వీరు చేస్తున్న విశ్లేషణ.
-వెంకట్ ఆరికట్ల