Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: అల్లూరి సీతారామరాజు నవల - సినిమా

సినీమూలం: అల్లూరి సీతారామరాజు నవల - సినిమా

తెలుగునాట స్వాతంత్య్రయోధుల్లో అల్లూరి సీతారామరాజుకి ఒక ప్రత్యేకస్థానం వుంది. మన్యప్రాంతపు ప్రజలు ఎలా దోపిడీకి గురవుతున్నారో గమనించి  వారిని విప్లవమార్గం పట్టించి, ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని రెండేళ్లపాటు గడగడలాడించిన వీరుడాయన. అహింసామార్గాన స్వాతంత్య్రానికై పోరాడిన వారెందరున్నా వారెవ్వరూ ప్రజాభిమానంలో సీతారామరాజుకు సాటి రారు. ఆయనమీద అనేక పుస్తకాలు, నాటకాలు, బుర్రకథలు వచ్చాయి. కానీ సినిమా తీయడం చాలా ఆలస్యమైంది. దానికి ఓ కారణం వుంది. సాధారణంగా విప్లవవీరులు అజ్ఞాతజీవితం గడుపుతారు. తమవాళ్లకు హాని కలగకుండా పుట్టుపూర్వోత్తరాలు దాస్తారు. శత్రువులలో అడలు పుట్టించేందుకు రకరకాల కట్టుకథలను ప్రచారంలో పెడతారు. 95 యేళ్ల క్రితం, మన్యప్రాంతంలో సమాచారసాధనాలు సరిగ్గా లేని రోజుల్లో పరిస్థితులు ఎలా వుండేవో వూహించండి. అందువలన అల్లూరి గురించి అనేక ఊహాపోహలు పుట్టుకుని వచ్చాయి. ఆయనకు అతీంద్రియ శక్తులున్నాయని, క్షణంలో పులిలా మారిపోగలడనీ.. యిలా. 

వీటి ఆధారంగా సినిమా తీస్తే హాస్యాస్పదంగా వుంటుంది. ఐతిహ్యంలో వున్నది తీయకపోతే జనాలు ఆమోదించకపోవచ్చు. మామూలు కథలా తీస్తే డాక్యుమెంటరీలా తయారవుతుంది. కమ్మర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుండకపోతే సినిమా విఫలం కావచ్చు.  అల్లూరిపై పడాల రామారావుగారు రాసిన ఓ ప్రఖ్యాత నవల ''ఆంధ్రశ్రీ'' ఆధారంగా ఎన్‌టి రామారావుగారు సినిమా తీద్దామనుకుని ఈ తర్జనభర్జనలతోనే తాత్సారం చేశారు. కృష్ణగారు సాహసంగా ముందుకు వచ్చారు. మహారథిచే కథ రాయించి సినిమా తీశారు. సినిమా హిట్‌ అయింది కానీ సినిమాకోసం వాస్తవాలు తారుమారు మార్చేశారని చాలా విమర్శలు వచ్చాయి. వాస్తవాలతో వచ్చిన ఒక పుస్తకాన్ని యీ సినిమాతో పోల్చి చూసి నిజానిజాలు తెలుసుకుందాం. పుస్తకం పేరు 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' రచన డికె ప్రభాకర్‌. 

సినిమాలో ఓపెనింగ్‌ షాట్‌లోనే అల్లూరి ఆధ్యాత్మిక చింతనను చూపించారు. నిజజీవితంలో కూడా ఆయన ఆయన యోగి అవుదామనుకున్నాడు. సన్యాసం తీసుకున్నాడుకూడా. వ్యాయామం, యోగాభ్యాసం చేసేవాడు. విప్లవవీరుడు అవుదామనుకోలేదు. చిన్నప్పుడే ఇంగ్లీషువారి చదువులు చదవను అంటూ  చదువు మానేసినట్లు సినిమాలో చూపించారు కానీ నిజానికి అంత చిన్నవయసులో  చదువు మానేయలేదు. వాళ్ల పినతండ్రి మేజిస్ట్రేట్‌. తన వద్ద పెట్టుకుని, తను బదిలీ అయినచోటకల్లా తిప్పుతూ చదివించాడు. అనేక వూళ్లలో యీయన చదువు సాగింది. చివరకు టెన్త్‌ క్లాస్‌ వద్ద చదువు ఆగింది. భరతమాత ఫోటో ముందు నిలబడి వందేమాతరం అంటూ నినదిస్తూ వుండగా అల్లూరి పెద్దవాడైనట్లు చూపించి సినిమాలో లాంగ్‌ జంప్‌ చేశారు. ఎక్కడా తారీకులు యివ్వలేదు. మనం చెప్పుకుందాం. అల్లూరి 1897లో జులై 4 పుట్టారు. ఒక చెల్లి, ఒక తమ్ముడు వున్నారు. తండ్రి రాజమండ్రిలో ఫోటోగ్రాఫర్‌. అల్లూరికి 11 యేళ్ల వయసు వుండగా ఆయన కలరా తగిలి పోయారు. కుటుంబం కష్టాల్లో పడింది. అల్లూరిలో వైరాగ్య చింతన పెరిగింది. స్కూల్లో చదివేరోజుల్లో కూడా ఒంటరిగా వుండేవాడు. తునిలో చదివేటప్పుడు అరణ్యాలలోకి వెళ్లి  అక్కడే కూచునేవాడు. స్కూలుకి వచ్చేవాడు కాదు. తుని స్కూలు హెడ్‌మాస్టర్‌ ఓ సారి దండించాడు. దాంతో యీయనకు కోపం వచ్చి స్కూలు మానేసి, తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. స్కూలు మానేశాడు కానీ విద్యాభ్యాసం మానలేదు. వారాలు చేసుకుని సంస్కృతం నేర్చుకున్నాడు. మంత్రశాస్త్రం, జ్యోతిష్యం నేర్చుకున్నాడు.

సినిమాలో సీతారామరాజు ఒకసారి దేశయాత్ర చేసినట్టు చూపించారు. కానీ ఆయన రెండు, మూడుసార్లు చేశారు. 1916లో కాలినడకన కలకత్తా వెళ్లారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ అతిథిగా వున్నారు. లక్నో కాంగ్రెస్‌ సభకు హాజరయ్యారు. హిమాలయాలు తిరిగారు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించారు. చెల్లెలి పెళ్లికి కూడా రాలేదు. తిరిగి తిరిగి విశాఖపట్టణం జిల్లాలోని కృష్ణదేవుపేటలో ఆశ్రమం కట్టుకుని నివసించసాగారు. ఇది 1917 నవంబరులో!  అప్పుడే ఆ జిల్లాలోని మన్యప్రాంత ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నారు. మళ్లీ 1918లో దేశయాత్ర. 1919లో యింటి బాధ్యత చెల్లి భర్తకు వప్పగించి ప్రజాసేవకు వెళ్లిపోదామని అనుకున్నారు. ఇలా అప్పగించే ఘట్టం దగ్గరకు సినిమా లాంగ్‌ జంప్‌ చేసింది. ఆ తర్వాత ఏజన్సీ ప్రజల అవస్థలను సినిమాలో యథాతథంగా చూపించారు.

1920లో చింతపల్లి తాలూకాకు తాసిల్దారుగా వున్నవాడు బాస్టియన్‌ (త్యాగరాజు). క్రూరుడు. లంచగొండి. ప్రభుత్వం నర్సీపట్నం నుండి అతను వుండే గ్రామం లంబసింగి వరకు ఘాట్‌ రోడ్డు వేసేందుకు సొమ్ము మంజూరు చేసింది. ఆ కాంట్రాక్టులో వీలైనంత తినేద్దామని యితని తాపత్రయం. అతని వద్దనున్న ఓవర్సీరు సంతానం పిళ్లె ( కెవి చలం) మరో దుర్మార్గుడు. ఆరణాల కూలీ యిస్తున్నామని లెక్కలు రాసి కూలీలకు ఆరుకానులు యిచ్చేవారు. రైతులమీద అన్యాయంగా కేసులు పెట్టేవాడు. అదే తాలూకాలో వున్న గంటం దొర - గుమ్మడి, అతని తమ్ముడు మల్లు దొర - ప్రభాకరరెడ్డిని అబద్ధపు సాక్ష్యాలు చెప్పమనేవాడు. వాళ్లు వినేవారు కారు. దాంతో గంటందొరను మునసబుగిరీనుండి తొలగించాడు బాస్టియన్‌. 

కాంతారావు వేసిన పాత్ర పడాలు. సినిమాలో గుమ్మడి వద్ద భూములు లాక్కుని యితనికి యిచ్చినట్టు చూపించారు. నిజానికి అతను రోడ్డు కాంట్రాక్టు ఒప్పుకుని బాస్టియన్‌కు అడ్వాన్సు యిచ్చి మోసపోయాడు. అది తిరిగి యిమ్మనమని పేచీ పెట్టుకుని బాస్టియన్‌కు దూరమయ్యాడు, గంటం దొరకు దగ్గరయ్యాడు. ఈ దశలో అల్లూరి వచ్చి పడాలుకి, గంటం దొరకు యిద్దరికీ నచ్చచెప్పినట్టు చూపించారు. నిజానికి ఆయన వీటితో సరిపెట్టలేదు. బాస్టియన్‌ దురాగతాల గురించి ప్రభుత్వానికి పిటిషన్‌ పెట్టాడు. ప్రభుత్వం బాస్టియన్‌పై చర్య తీసుకొనకపోగా అల్లూరిపై సెక్యూరిటీ కేసు పెట్టింది. ఇవి సినిమాలో లేవు.

సినిమాలో యిక్కడ విజయనిర్మల వేసిన సీత పాత్ర గురించి ఎపిసోడ్‌ పెట్టారు. ఆయన సన్యాసి అనీ, ప్రేమజోలికి పోలేదని కొందరంటారు. కాదు, 16 వ యేట వేరే కులానికి చెందిన సీత అనే అమ్మాయిని ప్రేమించి భగ్నహృదయుడయ్యాడని అంటారు. సినిమాలో మాత్రం సీత కుటుంబం కూడా వారి వివాహానికి సమ్మతించిందని చూపించారు. అయితే అల్లూరి మాత్రం దేశమంతా పర్యటించి కార్తీక పౌర్ణమినాడు వస్తానని చెప్తాడు. ఆమె వేచిచూస్తుంది. చివరకు అనుకున్నరోజున వచ్చి దేశంకోసం నా జీవితాన్ని బలిపెడుతున్నాను కాబట్టి వివాహం కుదరదంటాడు.హతాశురాలైన విజయనిర్మల యింట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లికి వొప్పుకుని, పెళ్లిపీటల మీదనే ప్రాణాలు విడుస్తుంది. ఆమె శవం దగ్గర కృష్ణ 'నువ్వు నా గుండెల్లో వుంటావు, ఇకపై నా పేరు సీతారామరాజు' అన్నట్టు చూపించారు. 

అల్లూరి పూర్తిపేరు అల్లూరి శ్రీరామరాజు. 1922లో అంటే మరణించడానికి  ఒక ఏడాది ముందు రాసిన ఆయన వుత్తరంలో సంతకం చేసినప్పుడు కూడా ఆయన శ్రీ అల్లూరి శ్రీరామరాజు అనే రాసుకున్నాడు కానీ  వేరేలా రాసుకోలేదు. కానీ ప్రజలంతా తర్వాతి కాలంలో సీతారామరాజు అని వ్యవహరించినట్టుంది. శ్రీరామరాజు అనలేక సీతారామరాజు అన్నారేమో! దాంతో యిలాటి కథలు పుట్టుకుని వచ్చాయి. ఆయన అంతకుముందే చేసిన దేశపర్యాటన ఘట్టాలను కార్తీక పౌర్ణమి గడువులోపున చేసినట్టు మార్చారు. సినిమాలో దేశాటన సందర్భంగా ఆయన ఒక సర్దార్జీతో చర్చలు జరిపినట్లు చూపారు కానీ సర్దార్జీ పేరు చెప్పలేదు. ఆయన గదర్‌ పార్టీ వీరుడు పృథ్వీసింగ్‌ ఆజాద్‌. ఆయన్ని అల్లూరి 1916 లో కలిసారు. అదేవిధంగా సినిమాలో వైజాగ్‌ కాంగ్రెస్‌ సభలో అల్లూరి వేదికమీదకు వెళ్లి గాంధీ విధానాలను వ్యతిరేకిస్తూ వుపన్యసించినట్టు చూపించారు. దానికి ఆధారాలు లేవు. విప్లవం ప్రారంభమయ్యాక 1923 ఏప్రియల్‌లో అన్నవరంలో ఆంధ్రపత్రిక విలేకరికి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఇంటర్వ్యూ యిస్తూ గాంధీజీ సత్యాగ్రహ విధానాలపై తనకు నమ్మకం లేదని అల్లూరి ప్రకటించారు. 

ఒక యోగిగా అడవిప్రాంతం ప్రజల్లో ఐక్యతకోసం ప్రయత్నించిన అల్లూరి ఆయుధాలతో అవతరించడం సినిమాలో డ్రమటిక్‌గా చూపించారు. లేబర్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ అవుతూండగా హీరో ౖప్రత్యక్షమవుతాడు. వాస్తవానికి ఆయన గంటందొర చేత వైజాగ్‌ కలక్టర్‌కు పిటిషన్‌ పెట్టిస్తే కలక్టర్‌ బాస్టియన్‌ను పిలిచి మందలించాడు. అప్పుడు బాస్టియన్‌కు అల్లూరిపై కోపం వచ్చింది. పైగా అల్లూరి అడవిలో కట్టెలు కొట్టించి శాసనోల్లంఘన చేయించాడు. దాంతో బాస్టియన్‌ కసిపెట్టుకుని మన్యంలో అల్లూరి విప్లవం లేవనెత్తుతున్నాడని పై అధికారులకు రిపోర్టు రాసి పంపాడు. అప్పుడు అల్లూరిని అరెస్టు చేసి నర్సీపట్నంలో నిర్బంధవాసంలో వుంచారు. అప్పట్లో పోలవరం డిప్యూటీ కలక్టర్‌ ఫజులుల్లాఖాన్‌ అని అల్లూరి తండ్రి స్నేహితుడు వుండేవాడు. ఆయన యీయన్ని విడిపించి అడ్డతీగెల వద్ద 30 యెకరాల భూమి యిప్పించి తల్లితో సహా ప్రవాసంలో వుండమన్నాడు. పోలీసుల నిఘా మాత్రం వుండేది. అక్కడ వుంటూ అల్లూరి బాణవిద్య, కత్తిసాము నేర్చుకున్నారు. కొన్ని నెలలు యిలా గడిచాక తాను యోగిని కాబట్టి నేపాలు వెళ్లి తపస్సు చేసుకుంటానని అర్జీ పెట్టి 1922 జూన్‌లో విడుదలయ్యాడు. నేపాలు వెళ్లకుండా మళ్లీ మన్యానికి వచ్చి విప్లవం మొదలుపెట్టాడు. ఇవన్నీ సినిమాలో చూపలేదు.

సినిమాలో కృష్ణను చూసి అల్లూరి అంత పొడుగ్గా వుంటాడనుకోకూడదు. అసలు అల్లూరి ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. విప్లవవీరుడిగా హీరో సినిమా మొత్తం రాముడి గెటప్‌లో తిరుగుతాడు కానీ నిజమైన అల్లూరి అలా తిరగలేదు. విప్లవకారుడెప్పుడూ ప్రత్యేక వేషధారణలో తిరగడు. ఆయన ఎవరూ గుర్తు పట్టకుండా, అతి సామాన్యంగా అక్కడి వాళ్లలో ఒకడిలా కనబడేవాడు. సైనికులు ఒకసారి ఆయన్ని కూలీ అనుకుని సామాన్లు కూడా మోయించారు. అల్లూరి ఏజన్సీ ప్రజల్లో తాగుడు మాన్పించాడు. కులాలమధ్య సఖ్యత సాధించాడు. అది బాస్టియన్‌కు రుచించలేదు. సినిమాలో త్యాగరాజు కులాల మధ్య పోట్లాట పెట్టించినట్లు చూపారు. శాసనోల్లంఘన ఘట్టాన్ని సినిమాలో యీ స్టేజిలో చూపించారు. దీని కారణంగా ఏజన్సీ కమీషనర్‌ హేపెల్‌ - పాత్రధారి పేకేటి - రామరాజును ఎరెస్టు చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నించి భంగపడినట్టు కల్పించారు. అదే సందర్భంలో గెరిల్లా యుద్ధంలో అల్లూరి డెవలప్‌ చేసిన గూఢచారి వ్యవస్థ, సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా చూపించారు.

అగ్గిరాజును ఉరినుండి తప్పించడంతో విప్లవానికి నాంది పలికారని అన్నారు. నిజానికి అగ్గిరాజు విప్లవం మలిదశలో రామరాజు వద్దకు వచ్చాడు. సినిమాలో చూపిన ఉరి ఘట్టానికి చారిత్రక ఆధారాలు లేవు. అల్లూరికి మూలికావైద్యం తెలుసున్న సంగతిని కృష్ణ గుమ్మడి భుజంలోంచి గుండు తీసేయడం ద్వారా చూపించారు. ఆయన తుపాకీ పేల్చడంలో కూడా శిక్షణ పొందాడు. సైనికులను ఎదిరించాలంటే తుపాకులు కావాలి. దానికోసం పోలీసు స్టేషన్లపై పడి ఆయుధాలు దోచుకోవాలని తీర్మానించాడు. 1922 ఆగస్టు 22తో విప్లవం ప్రారంభమైందనవచ్చు. ఆనాడు చింతపల్లి పోలీసు స్టేషన్‌ దోచుకున్నారు. ఆయుధాలు తీసుకుపోతూ రికార్డులో రాసి సంతకం పెట్టాడు అల్లూరి. ప్రజల మీద పెట్టిన దొంగకేసుల కాగితాలు చింపేశాడు. మర్నాడే కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌పై దాడి. ఆ మర్నాడే రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పై దాడి. ఇవన్నీ సినిమాలో చూపిస్తూ రాజవొమ్మంగిలో యిన్‌స్పెక్టరుగా రాజబాబును పెట్టి హాస్యఘట్టం కల్పించారు. అక్కడ వీరయ్యదొర విడిపించబడ్డాడు. రామరాజు కంటె ముందే జరిగిన లాగరాయి పితూరీ అతను లేవనెత్తినదే.

దీని తర్వాత 11 రోజుల పాటు చిన్న చిన్న దాడులు జరిగాయి. ఈ దాడులతో అధికారుల బెంబేలెత్తిపోయారు. రిజర్వు పోలీసులను దింపారు. జిల్లా కలక్టర్‌ డ్రేకన్‌, జిల్లా సూపర్నెంట్‌ నర్సీపట్నం చేరుకుని ట్రెమన్‌ హోర్‌ అనే అతన్ని రామరాజుతో ముఖాముఖీ తలపడమన్నారు. ఆ యుద్ధంలో విప్లవవీరులదే విజయం. మరో 14 రోజులకు టాల్బర్ట్‌ ను కూడా ఓడించారు. దాంతో జాన్‌ అనే సైన్యాధికారి రెండు గ్రామాల ప్రజలను హింసించి వూళ్లు తగలబెట్టాడు. ఇవి సినిమాలో చూపలేదు. ప్రభుత్వం అసిస్టెంటు సూపర్నెంట్స్‌గా కవర్డు, హైటర్‌ అనే యిద్దర్ని దింపడం (జగ్గారావు, ఆనందమోహన్‌) చూపించారు. వీళ్లు అక్రమాలు చేసినట్టు చూపించారు. సినిమాలో వాళ్లు చిన్నపిల్లాణ్ని చంపుతారు. వాళ్లను విప్లవవీరులు పట్టుకుని చంపేశారు. ఇది 1922 సెప్టెంబరు 24 న జరిగింది. బ్రిటిష్‌వాళ్లు వచ్చి శవాలు పట్టుకెళ్లారు. వాళ్ల వద్ద 500 రూ.ల సుంకం కట్టించుకున్నట్టు సినిమాలో కల్పించారు. 

సినిమాలో యిక్కడ రూథర్‌ఫర్డ్‌ - జగ్గయ్య వేసిన పాత్ర - కలక్టరుగా వచ్చినట్టు చూపించారు. అతనికి అన్ని వ్యవహారాలపై అవగాహన వున్నట్టు, అల్లూరి రామరాజంటే గౌరవం కూడా వున్నట్టు, ముఖాముఖీ సమావేశాలలో అతన్ని మెచ్చుకున్నట్టు, అయినా ప్రభుత్వాధికారి కావడం చేత రామరాజును చంపించినట్టు సినిమాలో చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే రూథర్‌ఫర్డ్‌, రామరాజు ఎన్నడూ ఎదురుపడలేదు. అతను పలనాడు ప్రాంతానికి కలక్టర్‌గా వుండేవాడు. విప్లవం ఆఖరిదశలో - అంటే 1923 సంవత్సరాంతంలో - సినిమా ప్రకారమైతే ప్రభాకరరెడ్డి పట్టుబడిన తర్వాత - మన్యానికి వచ్చాడు. రామరాజు అనుచరగణం తగ్గిపోయాక, గ్రామాలను బూడిద చేసి, ప్రజలను భయభ్రాంతులను చేసి, కష్టాలపాలు చేసి వారికోసం రామరాజు తనంతట తానే లొంగిపోయేట్లా చేశాడు. సినిమాలో మాత్రం రూథర్‌ఫర్డ్‌ మన్యానికి ప్రత్యక్షంగా వచ్చి లంచగొండితనమే, వెట్టిచాకిరియే విప్లవానికి మూలకారణమని గ్రహించినట్టు చూపించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టే ఓ స్టేషన్‌పై దాడి మరొకదానికి చేరడంలో ఆలస్యమవుతున్నట్టు గ్రహించి టెలిఫోన్‌ తీగలు పెట్టించాడని చూపించారు. సంస్థానాధీశులనుండి సైనికులకు ఆహారపదార్థాలు తెప్పించాడని చూపించారు. నిజానికి ఇవన్నీ డ్రేకన్‌ కలక్టరుగా వుండగా జరిగినవి. 

రామరాజు టెలిఫోన్‌ స్తంభాలను పీకించివేశాడు. ఆ సందర్భంలోనే సినిమాలో మల్లుదొర తాగుడు వ్యసనం వలన ఓ కోయవాడు పట్టుబడ్డట్టు, దానిపై అగ్గిరాజుకూ, అతనికీ కొట్లాట జరిగినట్లు చూపించారు. కోయదొర శవాన్ని వూరేగించడంతో ప్రజల్లో ధైర్యం సన్నగిల్లింది. వారిలో ధైర్యం తిరిగి రగిలించడానికి అల్లూరి 1922 అక్టోబరులో రెండు స్టేషన్‌లలో ముందుగా చెప్పి ఒకేసారి దాడి చేశాడు. రెండు చోట్లా రికార్డులలో అల్లూరి సంతకాలున్నాయి. దానితో ఆయనకు ఏకకాలంలో రెండు చోట్ల వుండగల  అతీంద్రియశక్తులున్నాయన్న ప్రచారం జరిగింది. దాంతో ఆ ప్రాంతాల్లో అల్లూరి రామరాజు పేరు మారుమ్రోగింది. ఆ ఘట్టం తర్వాతనే తెలుగువీర లేవరా పాట పెట్టారు సినిమాలో. విప్లవసైన్యాలకు తొలి అపజయం 1922 డిసెంబరు 6 న సంభవించింది. 14 మంది విప్లవవీరులు మరణించారు. ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చినవారికి పదివేల రూ||లు బహుమానం ప్రకటించింది. విప్లవం చల్లారిందని అందరూ అనుకునే సమయంలో అల్లూరి హఠాత్తుగా 1923 ఏప్రిల్‌లో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రజలు ఘనసన్మానం చేశారు. ఈ ట్రిప్‌ తర్వాతనే అగ్గిరాజు అల్లూరి బృందంలో చేరాడు నిజానికి. అల్లూరి వచ్చి వెళ్లాక కలక్టర్‌ వచ్చి ఆ వూరిపై 4000 రూ.ల అదనపు పన్ను వేశాడు - ఆతిథ్యం యిచ్చినందుకు! 

శంఖవరంలో వున్నాను రమ్మనమని అల్లూరి కలక్టర్‌కు కబురు పంపాడు. కలక్టర్‌ డ్రేగన్‌ భయపడి వెళ్లలేదు. ఇక్కడ సినిమాలో ఓ ఘట్టం కల్పించారు. డ్రేగన్‌కు బదులు రూథర్‌ఫర్డ్‌  (జగ్గయ్య) కలక్టరుగా వున్నట్లు, అల్లూరికి కబురు పెట్టి రప్పించి బ్రిటిషు పతాకానికి వందనం చేయమన్నట్లు చూపారు. కృష్ణ నిరాకరిస్తే చుట్టూ సైన్యం వున్నారు చూడు అని జగ్గయ్య అంటాడు, లుకప్‌ వన్స్‌ అని కృష్ణ అంటాడు, పైకి చూస్తే చెట్ల మీద విప్లవసైనికులు బాణాలు ఎక్కుపెట్టి రెడీగా వుంటారు. గత్యంతరం లేక జగ్గయ్య కృష్ణను వెళ్లిపోనిస్తాడు. అన్నవరం సత్కారం తర్వాత అల్లూరి 6 నెలల వరకు వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చారు. సెప్టెంబరులో ఆయన ముఖ్య అనుచరుడు మల్లుదొర (ప్రభాకరరెడ్డి) పట్టుబడడం ఉద్యమానికి దెబ్బే. మల్లుదొరకున్న తాగుడు, వ్యభిచారం కారణంగా రామరాజు అతన్ని తన సైన్యంలోనుండి తప్పించాడు. అది తెలిసి సైనికులు అతన్ని ఉంపుడుగత్తె యింట్లో బంధించారు. బంధించాక సినిమాలో జగ్గయ్య అతన్ని కృష్ణ ఆచూకీ చెప్పమని నిర్బంధిస్తాడు. అయినా అతను నోరు విప్పడు. ఇతని గతి తర్వాత ఏమైందో సినిమాలో చూపించలేదు కానీ వాస్తవానికి యితన్ని వైజాగ్‌ జైల్లో వేశారు. ఉరిశిక్ష వేసి చివరకు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి ప్రవాసానికి తరలించారు. స్వాతంత్య్రానంతరం విడుదల అయ్యాడు. చాలాకాలం బతికాడు.

వాస్తవానికి రూథర్‌ఫర్డ్‌ యీ సమయానికి కలక్టర్‌గా వచ్చాడు. మన్యప్రాంతాన్ని దిగ్బంధం చేయించాడు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అల్లూరి లొంగిపోదామనుకున్నాడు కానీ అనుచరులు వద్దన్నారు. 1924 మేలో కొండపల్లిలో వుండగా సైనికులు దాడి చేశారు. అగ్గిరాజు  (బాలయ్య) పోరాడి పోరాడి మందుగుండు అయిపోయాక సినిమాలో చూపినట్టే బావిలో దుమికాడు. సినిమాలో చూపలేదు కానీ నిజానికి ఆ బావిలోనే అతను ప్రాణాలతో పట్టుబడ్డాడు. అండమాను దీవులకు పంపబడ్డాడు.

జగ్గయ్య ప్రజలను టార్చర్‌ చేయమని అదేశాలిచ్చినట్లు సినిమాలో చూపిన ఘట్టానికి మూలం వుంది. రూథర్‌ఫర్డు కృష్ణదేవుపేటలో సభ పెట్టి గ్రామాధికారులందరినీ హెచ్చరించాడు -  రామరాజుకి సహాయం చేస్తే వారిని శిక్షించడంతో బాటు గ్రామాలను నాశనం చేస్తానని! విప్లవం అణచడానికి ప్రభుత్వం చేపట్టిన దమనకాండ చూసి తల్లడిల్లి యిక విప్లవం కట్టిపెట్టే సమయం ఆసన్నమైందని అల్లూరి గుర్తించాడు. ఆయన లాజిక్‌ను సినిమాలో చక్కగా చూపించారు - హీరోకూ, తల్లికీ మధ్య జరిగిన సంభాషణ ద్వారా! తల్లి అతని శిబిరానికి వచ్చి ఉద్యమాన్ని సమర్థించినట్లు  సినిమాలో చూపారు. వాస్తవానికి తల్లి విప్లవ సమయంలో వచ్చి అల్లూరిని కలిసిందనడానికి దాఖలాలు లేవు. ఆవిడ 1952 వరకు బతికారు. స్వాతంత్య్రం రావడం చూశారు. 

1924 మే 7 న అల్లూరి యేటి ఒడ్డున కూర్చుని ఒక కోయవాడి ద్వారా పోలీసులకు కబురంపాడు. వాళ్లు వచ్చి కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడ గుడాల్‌ వున్నాడు. గుడాల్‌కు, అల్లూరికి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో గుడాల్‌కు కోపం వచ్చింది. గొలుసులతో చెట్టుకు కట్టించి రివాల్వర్‌తో కాల్చి శరీరాన్ని తూట్లు తూట్లుగా చేశాడు. చనిపోయే ముందు కూడా అల్లూరి బెదరలేదు. పై అధికారులకు తెలియబరచకుండా తనని చంపే అధికారం గుడాల్‌కు లేదని వాదించాడు. గుడాల్‌ తుపాకీగుళ్లకు 27 సం||ల వయస్సులో అల్లూరి నేలకొరిగాడు. మర్నాడు రూథర్‌ఫర్డ్‌, యితర అధికార్లు వచ్చారు. తమకు చెప్పకుండా యింత పనిచేసినందుకు రూథర్‌ఫర్డ్‌ గుడాల్‌ను తిట్టి, ఇలా చంపినట్టు బయటకు వస్తే బ్రిటిష్‌ సర్కారుకి అవమానమని, పారిపోతూ వుంటే కాల్చామని స్టేటుమెంటు యిప్పించాడు. సినిమాలో దీన్ని అత్యంత నాటకీయంగా చూపించారు. రూథర్‌ఫర్డ్‌, అల్లూరి ముఖాముఖీ తలపడినట్లు, బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని కలక్టరు వినిపిస్తే, స్వాతంత్రేచ్ఛను అల్లూరి వినిపించినట్లు చూపించారు. రూథర్‌ఫర్డ్‌ తన కిష్టం లేకపోయినా అల్లూరిని చంపమని గుడాల్‌కు ఆర్డరు యిచ్చి ఫర్‌గివ్‌మీ లార్డ్‌ అంటూ దేవుణ్ని వేడుకున్నట్టు, గుడాల్‌ నిర్దయగా ఒక్కో భాగాన్ని కాలుస్తూ వుంటే అల్లూరి వందేమాతరం అంటూ నేలకొరిగినట్లు చూపించారు. 

రామరాజు పోయిన తర్వాత మరొక దాడిలో గంటందొర కూడా పోయాడు. ఆ విధంగా 1922 ఆగస్టులో ప్రారంభమైన మన్యం పితూరీ (దాన్ని విప్లవం లేదా తిరుగుబాటు అని బ్రిటిషువారు పేర్కొనలేదు. కేవలం పితూరీ అన్నారంతే, భారీ తారాగణంతో, సినిమా స్కోప్‌లో తీయడం చేత పెద్ద విప్లవం జరిగిందనే అభిప్రాయం మనకు కలుగుతుంది) రెండేళ్లలోనే ముగిసిపోయింది.  ఇది రెండు జిల్లాలలోని కొన్ని తాలూకాలకే పరిమితమైనా, అల్లూరి ముఖ్య అనుచరులు కేవలం 90 మందే అయినా, దీని ప్రభావం తెలుగు ప్రజలపై ప్రగాఢంగా పడింది. అల్లూరికి తన లక్ష్యం తెలుసు, పరిమితులు తెలుసు. జాతిని జాగృతం చేయడానికి, అడవిప్రాంతాల్లో దోపిడీని చాటి చెప్పడానికి ఆత్మత్యాగం చేసిన ఘనుడాయన.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

(దీనితో సినీమూలం శీర్షిక ముగిసింది)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?