చిన్న సినిమా.. పెద్ద గొడవ.!

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాకీ, పెద్ద సినిమాకీ గొడవలు తప్పడంలేదు. చిన్న సినిమాకి బతుకే లేకుండా చేస్తున్నారంటూ చాలాకాలంగా వివాదం కొనసాగుతూనే వుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాల్ని తొక్కేస్తున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ.…

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాకీ, పెద్ద సినిమాకీ గొడవలు తప్పడంలేదు. చిన్న సినిమాకి బతుకే లేకుండా చేస్తున్నారంటూ చాలాకాలంగా వివాదం కొనసాగుతూనే వుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాల్ని తొక్కేస్తున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ. చిన్న సినిమా ఏంటి.? పెద్ద సినిమా ఏంటి.? సినిమాలో సత్తా వుంటే, అది పెద్ద సినిమాకి కూడా సవాల్‌ విసరగలదని చాలా చిన్న సినిమాలు నిరూపించాయనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, అన్ని సందర్భాల్లోనూ పెద్ద సినిమాకి చిన్న సినిమా ఝలక్‌ ఇవ్వడం కుదరదు. అదే సమయంలో పెద్ద సినిమాలే సినీ పరిశ్రమని నిలబెడ్తున్నాయనడమూ సబబు కాదు. దేని దారి దానిదే. చిన్న సినిమా పెద్ద విజయాల్ని సాధిస్తే, పెద్ద సినిమా.. సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఇంకా పెంచుతుంది. అలా దేని పాత్ర దానిదే సినీ రంగంలో. అయినాసరే, చిన్న సినిమాకి థియేటర్ల కొరత అనే సమస్య ఎప్పుడూ వుంటూనే వుంటుంది. 

తాజాగా 'ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్' అనే సినిమా యూనిట్‌ రోడ్డెక్కింది. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వడంలేదంటూ చిత్ర దర్శకుడు ఆదిత్య ఓం ఏకంగా నిరాహార దీక్షకు దిగాడు. ఆదిత్య ఓం అంటే చాన్నాళ్ళ క్రితం 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కదా.. అతనే. ఈయన దర్శకుడిగా మారి 'ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్' సినిమాని తెరకెక్కించాడు. సినిమా విడుదలయ్యేందుకు నానా తంటాలూ పడింది. థియేటర్లు దొరక్కపోవడమే ప్రధాన సమస్య.. అన్నది ఆదిత్య ఓం ఆరోపణ. 

గతంలో ఇలాగే పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు నిరాహార దీక్షలు చేశారు.. తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది.. మళ్ళీ వ్యవహారం మామూలే. కొందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా అవతారమెత్తి థియేటర్లను కబ్జా చేశారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. పెద్ద సినిమాలకే ఒక్కోసారి ఈ మాఫియా కారణంగా థియేటర్లు దొరకని పరిస్థితి. ఏం చేసినా, ఈ థియేటర్ల మాయాజాలం నుంచి తెలుగు సినీ పరిశ్రమ బయటపడ్తుందా.? కష్టమే మరి.!