Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కోర్టు విడిచి పెట్టినా యింకా జైల్లోనే...

 ఎమ్బీయస్‌: కోర్టు విడిచి పెట్టినా యింకా జైల్లోనే...

లైంగిక ఆరోపణలు లేని మతగురువుల కోసం వెతకాల్సిన రోజులివి. ఇది కశ్మీర్‌లో మతగురువు కథ. పేరు గుల్జార్‌ ఆహ్మద్‌ భట్‌. చదువు రాదు. పశువులు మేపుకునేవాడు. తలిదండ్రులు 1993లో పెళ్లి చేస్తే ఆ బంధం ఎక్కువకాలం సాగలేదు. ఇల్లు వదిలి తిరగసాగాడు. సూఫీ పంథా గురించి ఉపన్యసించడంలో నేర్పు సంపాదించాడు. జనాలు అతన్ని 'పియర్‌' అని పిలవసాగారు. సూఫీ పండితులు మాత్రం యితను చెప్పేదంతా తప్పుల తడకలు అంటూన్నా అతని అనుచరులు పట్టించుకోలేదు. సూఫీ గురువులను దర్వేష్‌ అంటారు. ఇతనూ ఓ దర్వేష్‌ అయిపోయాడు.

సొంత జిల్లా బుడగామ్‌లోని షంషాబాద్‌ గ్రామంలో ఒక మతాధ్యయన శాల నెలకొల్పాడు. అక్కడ 80-100 మంది ఆడపిల్లలు సూఫీతత్వంపై గుల్జార్‌ రాయించిన మతగ్రంథాలు నేర్చుకుంటున్నారు.  వారిలో నలుగురు ఆడపిల్లలు యితను వారిని బలాత్కారం చేశాడని  2013లో కేసు పెట్టారు. అదే ఏడాది మేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. బలాత్కారాలకు సహకరించినందుకు 12 మంది ఆశ్రమ ఉద్యోగులపై కూడా కేసు పెట్టారు. కేసు విచారణ సాగింది. అయితే బుడగాం జిల్లా జడ్జి 2015 ఫిబ్రవరిలో అతన్ని నిర్దోషిగా విడిచి పెట్టేశాడు. ఇలా అనగానే ఆ న్యాయమూర్తుల నిజాయితీని శంకించడం సహజం. కానీ తప్పంతా ప్రాసిక్యూషన్‌ వాదనలో వుంది.

మొట్టమొదటగా చెప్పవలసినది సంఘటన జరిగిందని చెప్పబడుతున్న రోజు నుంచి 160 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఎందుకింత ఆలస్యం? అని అడిగితే 'ఆడపిల్లలు తమపై బలాత్కారం జరిగిన విషయాన్ని వాళ్ల తలిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే పోలీసుల వద్దకు వెళ్లలేదు. ఆశ్రమం వద్దకు వెళ్లి గోల చేశారు. తర్వాత బండిపోరాలో వున్న ఒక మతగురువు వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. ఆ తర్వాత దుఖ్‌తారణ్‌ ఎ మిల్లత్‌ అధినేత వద్దకు వెళ్లారు. వాళ్లు మేం న్యాయం జరిగేట్లు చూస్తాం అన్నారు. కానీ ఏమీ జరగలేదు. అప్పుడు వాళ్లు అనంత్‌నాగ్‌లో వున్న మౌల్వీ మొహమ్మద్‌ అమీన్‌ వద్దకు వెళ్లి మొత్తుకున్నారు. అప్పుడాయన వాళ్లను వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. మధ్యలో రాజకీయ నాయకులను కూడా కలిశారు.

అందువలన 160 రోజుల ఆలస్యం అయింది' అని బదులు చెప్పింది ప్రాసిక్యూషన్‌. 'ఇది నిజమే అయితే ఆ గురువులను, నాయకులను సాక్షులుగా కోర్టుకి ఎందుకు రప్పించలేదు?' అని అడిగింది కోర్టు. వీళ్ల దగ్గర జవాబు లేదు. సరే, బలాత్కారం ఎలా జరిగిందని అమ్మాయిలు చెప్పారు? అని అడిగింది కోర్టు. 'నన్ను ఒంటరిగా ఒక గదిలోకి పిలిపించి, నీకు మన ఆశ్రమంలో ఒక మంచి పదవి యిప్పిస్తాను. ఈ రహస్యం మనిద్దరే మధ్యే ఉంచు అంటూ ఒట్టేయించుకున్నాడు.

తర్వాత నీకు పాపప్రక్షాళన చేస్తాను. నీ శరీరాన్ని నా శరీరం తాకిన చోటుని నరకపు అగ్నిజ్వాలలు ఏమీ చేయలేవు అంటూ దగ్గరకు తీసుకున్నాడు. నాకేదో తాగమని యిచ్చాడు. నాకు మత్తెక్కింది. ఆ సమయంలో నన్ను అనుభవించాడు.' అంది ఒకమ్మాయి. 'మంత్రాలు వల్లించి నన్ను మత్తులో పెట్టేశాడు' అన్నారు తక్కిన అమ్మాయిలు. కోర్టు యీ వాదాన్ని తోసిపుచ్చింది. మంత్రాలతో మత్తులో ముంచడమేమిటి? దానికి సాక్ష్యమేదైనా వుందా? పోనీ మత్తుమందు కలిపిన డ్రింకు యిచ్చారంటున్నారు కదా, దానికైనా సాక్ష్యం వుందా అంటే ప్రాసిక్యూషన్‌ తెల్లమొహం వేసింది.  

'ఆ ఆశ్రమంలో వందమంది దాకా యితర బాలికలున్నారు కదా, వాళ్లెవరినీ సాక్ష్యానికి ఎందుకు పిలవలేదు? నిందితులకు ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ ఎందుకు చేయించలేదు? బలాత్కారం జరిగిందని చెప్పబడుతున్న పక్కదుప్పట్లపై వీర్యం దొరికి వుంటే, దాన్ని ముద్దాయి వీర్యంతో పోల్చి చూడాలి కదా, ఎందుకు ఆ పని చేయలేదు?' అని అడిగింది. ఘటన జరిగిన 5 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తే అప్పటివరకు ఆ దుప్పట్లు అలాగే వుంటాయా? 'ఉన్నాయి. వాటిని ముగ్గురు సాక్షుల ఎదుట పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేటుగారు సీల్‌ చేసి ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపించారు' అని చెప్పింది ప్రాసిక్యూషన్‌. ఆ మేజిస్ట్రేటుగారు ఏరి? అని అడిగితే ఆయన చచ్చిపోయారంది. సరే ఆ సాక్షులను పిలవండి అంటే వాళ్లు వచ్చి మాకేమీ తెలియదనేశారు. ఇలా తప్పులుతడకలుగా కేసు పెట్టినందుకు ప్రాసిక్యూషన్‌కు తలవాచేట్లు చివాట్లు పెట్టి జడ్జి గుల్జార్‌తో బాటు తక్కిన 12 మంది ముద్దాయిలనూ వదిలేశాడు.

ప్రాసిక్యూషన్‌ చేత యీ తప్పులు చేయించిన శక్తులేవో ప్రజలకు తెలియదు కానీ తీర్పు విన్నాక భగ్గుమన్నారు. డేరా బాబాకి శిక్ష పడినందుకు శిష్యులు ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు ఆస్తులు ధ్వంసం చేసి, అమాయక పౌరులను చంపేస్తే, యితనికి శిక్ష పడనందుకు సామాన్య ప్రజలు బయటకు వస్తే అతన్నే చంపేస్తామని బెదిరిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాంతో ప్రభుత్వం భయపడి, తీర్పుపై హైకోర్టుకి అప్పీలు చేసి, యితన్ని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ కింద, పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్లోనే వుంచేసింది. మాజీ మిలిటెంట్లను కూడా యిదే చట్టం కింద జైల్లో పెడతారు. ఇప్పుడు పియర్‌గారు వాళ్లతో కలిసి ఒకే సెల్‌లో వుంటున్నాడు.

2017 ఫిబ్రవరిలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ వాదనలు, సాక్ష్యాలు అలా అఘోరించినప్పుడు ట్రయల్‌ కోర్టే కాదు, మేమైనా అలాటి తీర్పే యివ్వాల్సి వుంటుంది అంటూ అపీల్‌ కొట్టేసింది. హైకోర్టు తీర్పు వచ్చాక కూడా అతన్ని జనం మధ్య వదలడానికి ప్రభుత్వం వణుకుతోంది. అందువలన అతన్ని యింకా కటకటాల వెనకే వుంచి, సుప్రీం కోర్టుకి అప్పీలు చేసింది.

(ఫోటో - గుల్జార్‌ భట్‌, అతని ఆశ్రమం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?