Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య బాబు ఒక్కడు చాలు

బాలయ్య బాబు ఒక్కడు చాలు

మహాభారతం, భాగవతం చదివిన వారికి ముసలం అంటే ఇట్టే అర్థం అయిపోతుంది. యాదవులంతా కలిసి కట్టుగా వుండేవారు. హాయిగా కాలం గడచిపోయింది. అలాంటిది, వాళ్లలో ఒకళ్లు చేసిన చిన్న వెర్రి పని వల్ల ముసలం పుట్టింది. ఆ ముసలం మొత్తానికే ఎసరు తెచ్చింది. తప్పదు. ఒక్కరు చేసిన తప్పిదం అయినా మొత్తం అందరూ భరించాల్సిందే.

జనతాపార్టీ టైమ్‌లో చరణ్‌సింగ్‌ ఒక్కడు పక్కకు వెళ్లాడు. ప్రభుత్వం పడిపొయింది. అన్ని ఏళ్లు కష్టపడి సాధించిన సమైక్య నాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాస్తా పక్కకు పోయింది. జనతా ప్రయోగం ముక్కలైపోయింది.

కాంగ్రెస్‌ పార్టీని ఎవరో వచ్చి ఓడించనక్కరలేదు. పార్టీలో వున్నవాళ్లే చాలు అని అంటుంటారు. ఎందుకంటే పార్టీలో ఒకరు మీదకు వెళ్తుంటే, మరొకరు కిందకు లాగుతుంటారు. ఒకళ్లంటే మరొకళ్లు విమర్శించుకుంటూ వుంటారు.

అలాగే తెలుగుదేశం పార్టీకి తలకాయనొప్పి తెప్పించడానికి జగన్‌ నో, మరోకళ్లో అక్కరలేదు. చంద్రబాబు వియ్యంకుడు, కమ్‌ బావమరిది బాలయ్య బాబు చాలు. ఈ మధ్యకాలం బాలయ్య బాబు వ్యవహారాలతో తెలుగుదేశం పార్టీ తరచు ఆత్మరక్షణలో పడుతోంది. మరీ దూరంగా ఆలోచిస్తున్నారేమో అనకపోతే బాలయ్య బాబు తెస్తున్న తలకాయనొప్పులతో బావ చంద్రబాబుకు ఇలాంటి అలాంటి తలనొప్పి రావడంలేదు.

బాలయ్య బాబు కృషి ఫలితమా అన్నట్లు ఇన్నాళ్లు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గుట్టుమట్టుగా వుంటున్న విబేధాలు ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి. నువ్వంటే, నువ్వెంత అని ఎదురు ఎదురుగా నిల్చుని మాట్లాడుకునే రేంజ్‌కు చేరిపోయాయి. అసలు ఆ మాటకు వస్తే, గడచిన మూడేళ్లుగా బాలయ్య బాబు వ్యవహారాలు అన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. వీటిలో కొన్ని చిన్నస్థాయిలో ముగిసిపోతున్నాయి. మరి కొన్ని పార్టీ వరకు చికాకు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో కులాల చిచ్చును రేకెత్తించాయి.

బాలయ్య ముక్కుసూటి మనస్తత్వం కావచ్చు, మొండితనం కావచ్చు. మరేదైనా కావచ్చు తరచు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్‌ మీడియా అన్నది చాలా అలెర్ట్‌గా వుంది. దానికి తోడు డిజిటల్‌ టెక్నాలజీ అన్నది కీలకంగా మారింది. ప్రతీదీ రికార్డ్‌ అవుతోంది. ఏదీ తప్పించుకునే అవకాశంలేదు. ఇలాంటి టైమ్‌లో మన మాటలు, చేతలు అన్నీ జాగ్రత్తగా వుండాల్సిందే. కానీ బాలయ్య వైఖరి వేరు.

ఆయన పబ్లిక్‌గా మందు బాటిల్‌ పక్కన పెట్టుకుని కూర్చున్నా, తన మీదకు వచ్చిన అభిమానుల చెంప ఛెళ్లు మనిపించినా మిగిలిన వారు పట్టించుకోకపోవచ్చు. కానీ సోషల్‌ మీడియా మాత్రం అలాకాదు. కోడై కూస్తోంది. దాంతో రానురాను సోషల్‌ మీడియాలో మాత్రం బాలయ్యకు బాగా నెగిటివ్‌ పెరిగిపోయిందన్నది వాస్తవం.

అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీపై ఏమంత ప్రభావం కనబర్చింది లేదు. కానీ బాలయ్య నియోజకవర్గంలో ఆయన పిఏ వ్యవహారం మాత్రం స్థానికంగా పార్టీనే ఇబ్బంది పెట్టింది. పార్టీ అధినేత బామ్మర్ది అని కూడా చూడకుండా పార్టీ జనాలు అంతా బయటకు వచ్చి, సమావేశాలు పెట్టి, సీఎం దగ్గరకు వెళ్లి నానా యాగీ చేసారు. దీంతో చంద్రబాబు కలుగ చేసకొక తప్పలేదు. అప్పుడు కూడా బాలయ్య ఒకంతట మాట వినలేదు. ఆఖరికి చంద్రబాబే నేరుగా ఆ పిఏను తొలగించాల్సి వచ్చింది.

సరే ఆయన, హీరోగా ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారు అనుకుంటే పైసావసూల్‌ లాంటి సినిమాల్లో ఆ చేతి ఊపుడు, పాటలు వంటి వాటితో వయసుకు, వ్యవహారాలకు కాస్త తేడా అనిపించుకున్నారు. కుర్రాడైన ఎన్టీఆర్‌ తన వయసుకు మించిన మంచి పాత్రలు ఎంచుకుని వేస్తుంటే, బాలయ్య రివర్స్‌లో వెళ్తున్నారు. మొన్నటికి మొన్న తన కోసం విశాఖ బీచ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ మొత్తం ఆపేసి, డైవర్డ్‌ చేసి, ఆ ఏరియా జనాల అందరూ విమర్శించేలా చేసారు. ఇవన్నీ కాస్తో కూస్తో తెలుగుదేశం పార్టీ ఇమేజ్‌ మీద ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం.

ఇదిలా వుంటే బాలయ్య జోక్యం పుణ్యమా అని ఇప్పుడు టాలీవుడ్‌లోనే ముసలం పుట్టింది. టాలీవుడ్‌లో కాపు, కమ్మ వర్గాలు మధ్య ప్రచ్ఛన్న పోటీ వుందన్న సంగతి తెలిసిందే. ఇది పైకి కనిపించకపోవచ్చు కానీ, అంతర్గతంగా సాగుతోందన్నది వాస్తవం. ఏదో విధంగా పవన్‌కళ్యాణ్‌ను మేనేజ్‌ చేసుకుంటూ, కాపులను తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించుకుంటూ వస్తున్నారు చంద్రబాబు. ఓ పక్క ముద్రగడ పద్మనాభాన్ని నానా అవమానాలు చేస్తున్నా, పవన్‌ మీద వున్న పిచ్చి అభిమానంతో, కాపులు నోరు ఎత్తడంలేదు. ఇంకోపక్క క్షత్రియులను కూడా ఏదో విధంగా దువ్వుతూ వస్తున్నారు.

మరోపక్క బుడ్డోడు ఎన్టీఆర్‌కు పెరుగుతున్న చరిష్మా గమనించి, ఇన్నాళ్లు పక్కన పెట్టిన అతగాడిని మళ్లీ దువ్వే ప్రయత్నం స్టార్ట్‌ చేసారు. గతంలో ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి అంతగా ముందుకు రాలేదు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. అలాంటిది ఉన్నట్లుండి ప్రాజెక్ట్‌ సెట్‌ అయింది. దీనివెనుక బాబు-పవన్‌ల మంత్రాంగం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌ అంటే త్రివిక్రమ్‌, త్రివిక్రమ్‌ అంటే పవన్‌ అనేంతగా వారిద్దరి సాన్నిహిత్యం వుందన్న సంగతి తెలిసిందే. పవన్‌ మాట మీదే తివిక్రమ్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేయడం, ఆ విధంగా అతన్ని పవన్‌కు దగ్గర చేసే పని స్టార్ట్‌ చేసారని టాక్‌ వుంది.

ఇలాంటి టైమ్‌లో నంది అవార్డుల తకరారు వచ్చి పడింది. బాలయ్య కనుసన్నలలోనే నంది అవార్డుల కమిటీ పని చేసిందని, అందువల్లే ఇండస్ట్రీలోని కమ్మకులానికి చెందిన వారందరికీ ఏదో ఒక అవార్డు ఇచ్చారని, ముఖ్యంగా బాలయ్య నటించిన లెజెండ్‌ సినిమాకు అవార్డులు ఏకపక్షంగా ఇచ్చారని విమర్శలు స్టార్ట్‌ అయ్యాయి. అలాగే బాలయ్యకు అంతగా సరిపడని నాగార్జున 'మనం' సినిమాను వెనక్కు నెట్టారని ఆరోపణలు కూడా.

దీనికితోడు ముగ్గురు కమ్మ హీరోలను ఉత్తమ నటులుగా చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతోసాయం అదించిన క్షత్రియ కులానికి చెందిన ప్రభాస్‌ను పక్కన పెట్టేసారు. దీంతో క్షత్రియులకు చాలా ఇబ్బందిగా మారింది. అద్భుతమైన విజయం సాధించిన బాహుబలికి గాను, ప్రభాస్‌కు అవార్డు ఇవ్వకుండా చేయడం అంటే చిన్న విషయం కాదు.

మరోపక్క కాపు కులానికి చెందిన మెగా హీరోలు అనేకమంది వున్నారు. ఇప్పుడు అవార్డులు తీసుకున్నవారి సినిమాలు కూడా కమర్షియల్‌ సినిమాలే. అందువల్ల ఇవ్వాలి అనుకుంటే మెగాహీరోలకు కూడా అవార్డులు ఇచ్చి వుండొచ్చు. కానీ అలా జరగలేదు. కాపుల సినిమాలను పక్కన పెట్టి, బాలయ్య తన ప్రభావంతో మొత్తం అవార్డులు డిసైడ్‌ చేసారని బయటపడిపోయింది. ఇప్పుడు వెనక్కు తీసుకోలేరు. ముందుకు వెళ్లలేరు. ఇంత వివాదం తలెత్తాక అవార్డు ఫంక్షన్‌ చేయలేరు. చేసినా, సరైన సంతప్తి కలగని చాలా మంది వెళ్లరు. మొత్తంమీద ఇండస్ట్రీని ఈ అవార్డులు రెండుగా చీల్చినట్లు అయింది.

అవార్డులు ఇచ్చిన తరువాత ఇంత రగడ రేగుతుందని ఎవ్వరూ ఊహించి వుండరు. పోనీ రగడ రేగినా, వన్‌సైడ్‌గా ఊరుకుని వుంటే వేరేగా వుండేది. కానీ సోషల్‌ మీడియాలో బాలయ్య మద్దతువర్గం కూడా యథాశక్తి ఆజ్యం పోస్తోంది. దీంతో మాటలు సంస్కారం దాటుతున్నాయి. మొత్తానికి బాలయ్య పుణ్యమా అని కాపు, క్షత్రియ యువతలో మళ్లీ కొత్త ఆలోచనలు పురుడు పోసుకోవడం ప్రారంభమైంది.

అయితే ఇదంతా కేవలం అల్లుఅర్జున్‌ క్యాంప్‌ అసంతృప్తి మాత్రమే తప్ప వేరే మరేమీ కాదని, అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు, బన్నీ ఫ్యాన్స్‌కు అంతగా పొసగడం లేదన్న సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్‌ కూడా బన్నీ విషయంలో కాస్త దూరంగానే వుంటున్నారని గుసగుసలు వున్నాయి. పవన్‌ మాట బాబు జవదాటరు కాబట్టి, ఈ అవార్డుల వెనుక మరేమైనా ఆలోచనలు చేసి వున్నా ఆశ్చర్యంలేదు.

కానీ ఇక్కడ సమస్య అలాలేదు. కాపులు మొత్తంగా తమ వాళ్లను చిన్న చూపు చూస్తున్నట్లు ఫీలవుతున్నారు. అందువల్ల పవన్‌ సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఫలితం అంతగా వుండకపోవచ్చు. ఇక ఇప్పుడు చంద్రబాబు కలుగ చేసుకుని, కాపులను సంతృప్తి పరిచే విధంగా ఏదో ఒక మంత్రం వేయాల్సి వుంటుంది. అది వేస్తే తప్ప ఈ అసంతృప్తి జ్వాల ఆరదు.

ఇంత జరిగాక, చంద్రబాబు ఈ మూడేళ్ల అవార్డుల ప్రధానోత్సవం ఉగాది వేళకు చేస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికంగా సద్దుమణిగిన దాన్ని ఉత్సవం చేయడం ద్వారా రేకెత్తించినట్లు అవుతుంది. అందువల్ల బాలయ్య బాబు పుణ్యమా అని ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన చాణక్యానికి పదును పెట్టాలి. లేదూ అంటే పార్టీ ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి సినిమా అవార్డుల గడబిడ అన్నట్లు కనిపిస్తున్నా, సోషల్‌ మీడియాలో జరుగుతున్న రగడ అలాలేదు. రెండు కులాల నడుమ నెలకోన్న పోరు మాదిరిగా వుంది. మొత్తానికి ఒక్క బాలయ్య ఎంత సాధించగలిగారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?