Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సుప్రీమ్‌

సినిమా రివ్యూ: సుప్రీమ్‌

రివ్యూ: సుప్రీమ్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, రాశి ఖన్నా, రవికిషన్‌, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, మాస్టర్‌ మిఖాయిల్‌ గాంధీ, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, అలీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
సమర్పణ: దిల్‌ రాజు
నిర్మాత: శిరీష్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: మే 5, 2016

'పటాస్‌' సినిమాతో కమర్షియల్‌ సినిమాపై తనకెంత పట్టు ఉందో చూపెట్టిన అనిల్‌ రావిపూడి రెండో ప్రయత్నంలోను తన బలాలనే నమ్ముకున్నాడు. 'సుప్రీమ్‌' కూడా ఫక్తు కమర్షియల్‌ మీటర్‌లో నడిచే సినిమానే. సుప్రీమ్‌ అనేది ఇందులో కారు పేరు. సుప్రీమ్‌లో జర్నీ ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఎలాంటి స్పీడ్‌ బంప్స్‌ లేకుండా సరదాగా, సాఫీగా సాగిపోతుంది. కానీ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి 'రఫ్‌ రోడ్‌' ఎదురవుతుంది. అంతవరకు వివిధ కామెడీ పాత్రలతో నవ్వులకి లోటు లేకుండా చూసిన దర్శకుడు ద్వితీయార్ధంలో ఎక్కువగా రోడ్‌ మీదే నడిచే కథలోకి ఎక్కువ కామెడీని ఇరికించలేకపోయాడు. 'బ్యాండ్‌ మేళం' అంటూ పోసాని, శ్రీనివాసరెడ్డి అడపాదడపా నవ్వించినప్పటికీ ఫస్టాఫ్‌తో పోలిస్తే 'సుప్రీమ్‌' వేగం కోల్పోతుంది. ఫస్టాఫ్‌ ఫెరారీలా దూసుకుపోతే, సెకండ్‌ హాఫ్‌లో ఫుల్లీ లోడెడ్‌ లారీలా మందకొడిగా కదుల్తుంది. 

చిన్న పిల్లాడి క్యారెక్టర్‌ చుట్టూ అల్లిన ఎమోషన్స్‌ ఫరవాలేదనిపిస్తాయి కానీ గుండె లోతుల్ని స్పృశించే డెప్త్‌ అయితే లేదు. సుప్రీమ్‌కి సంబంధించి అతి పెద్ద బలహీనత మాత్రం విలన్లే. ఒక కసాయివాడి చేతిలోకి పాలబుగ్గల పసి పిల్లాడు చేరిపోతే 'ఏమైపోతాడో' అనే బెంగ పుట్టాలి. త్వరగా ఆ పిల్లాడిని హీరో చేరిపోవాలని, తనని కాపాడాలని అనిపించాలి. కానీ ఇక్కడ విలన్‌ కామెడీ చేస్తుంటాడు. చుట్టూ పది మందిని వేసుకుని చేసేవన్నీ రౌడీ పనులే అయినప్పటికీ అతడిని చూపించాల్సినంత కర్కశంగా చూపించకపోవడం వల్ల ద్వితీయార్ధంలో ఎక్సయిట్‌మెంట్‌కి తావు లేకుండా పోయింది. హీరోని ఛాలెంజ్‌ చేసే ఒక క్యారెక్టర్‌ కానీ, సమస్య కానీ లేనప్పుడు ఇక ఆ ప్లాట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూడ్డానికి అందులో ఏముంటుంది? అనిల్‌ రావిపూడికి కమర్షియల్‌ మీటర్‌ తెలుసు, ఎక్కడ కామెడీ వేసి గ్రాఫ్‌ పడిపోకుండా చూసుకోవాలో తెలుసు... కానీ కీలకమైన హీరో, విలన్‌ కాన్‌ఫ్లిక్ట్‌ విషయాన్ని మాత్రం వదిలేసాడు. హీరో ఎదుర్కొనేది అల్లాటప్పా విలన్లని కాదు. అవసరమైతే రెండు వేల అయిదు వందల కోట్లు విసిరేసే సత్తా ఉన్న విలన్‌. అలాంటివాడు హీరోకి ఎలాంటి ఆటంకాలు కలిగించాలి? వందల కొద్దీ కిలోమీటర్ల పాటు హైవేలో కారేసుకుని వెళ్లిపోతూ వుంటే, తమకి కావాల్సిన పిల్లాడు అందులో ఉన్నాడని తెలిసీ విలన్లేం చేయరు. తాపీగా అతను డెస్టినేషన్‌ చేరిపోయాక అప్పుడు కొంతమంది రౌడీలొచ్చి కత్తులకి పని చెప్తారు. ఒరిస్సా నుంచి పిల్లాడ్ని తిరిగి తీసుకురావడమనే పార్ట్‌ని థ్రిల్లింగ్‌గా తీసినట్టయితే ఇదే సినిమా ఇంకోలా ఉండేది. 

బలహీనతల్ని కామెడీతో కవర్‌ చేయాలని చూసారో, లేక తమ సినిమాకి కామెడీనే బలమని అనుకున్నారో తెలీదు కానీ పూర్తిగా కామెడీ మీదే బేస్‌ అయిపోయినట్టు కనిపించింది. రఘుబాబు చేసే కృష్ణంరాజు ఇమిటేషన్‌, వాళ్లింట్లో జరిగే తంతు, అలాగే మరికొన్ని 'అమేజింగ్‌' క్యారెక్టర్లు నవ్విస్తాయి. సెకండ్‌ హాఫ్‌లో ఉన్న కామెడీ కూడా అంతగా పేలలేదు. వికలాంగులతో ఫైట్‌లాంటివి పెట్టి ఎమోషన్‌ పండించే ప్రయత్నం జరిగింది కానీ సెకండ్‌ హాఫ్‌లోని ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లే వల్ల 'జింగ్‌' మిస్‌ అయింది. 

సాయి ధరమ్‌ తేజ్‌ ఎంత ఎనర్జిటిక్‌గా వుంటాడు, ఏం చేస్తాడు అనేది మనకి ఇంతకు ముందు తెలిసిందే. మనకి తెలియని కోణం ఏదీ ఇందులో కనిపించలేదు. డైలాగ్‌ డెలివరీ పరంగా ఉన్న సమస్యలని కరక్ట్‌ చేసుకున్నాడు. డాన్సుల్లో తన పెద్ద మేనమామని తలపించాడు. ముఖ్యంగా 'అందం హిందోళం' పాటలో చిరు స్టెప్స్‌ని మ్యాచ్‌ చేసాడు. 'జేబుదొంగ' సినిమాలో 'స్టీల్‌ప్లాంట్‌ బాబాయ్‌' మేనరిజమ్‌ ఇమిటేషన్‌ కూడా బాగా చేసాడు. రాశి ఖన్నా క్యారెక్టరైజేషన్‌ ఫన్నీగా ఉన్నా దానిని పండించే కామెడీ టైమింగ్‌ ఆమెలో లేదు. కామెడీ బాగా చేసే నటి అయితే ఈ పాత్ర మరింత పండేది. కీలక పాత్ర చేసిన మాస్టర్‌ గాంధీ తన నటనతో, ముద్దు ముద్దు మాటలతో అలరించాడు. ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాడు. రవికిషన్‌ ఓకే అనిపించాడు. రియలైజేషన్‌ సీన్‌లో రాజేంద్రప్రసాద్‌ తన అనుభవం చూపించారు. రఘుబాబు కామెడీ మెప్పిస్తుంది. పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను క్యారెక్టర్స్‌ నవ్విస్తాయి. 

పాటలు సోసోగా ఉన్నాయి కానీ రీమిక్స్‌ సాంగ్‌ మాస్‌ని, చిరు అభిమానుల్ని మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అందం హిందోళం పాట చిత్రీకరణ, సెకండాఫ్‌లో వచ్చే ఛేజ్‌ సీక్వెన్స్‌లో ఫోటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. అనిల్‌ రావిపూడి రాసిన సంభాషణలు బాగున్నాయి. టెక్నికల్‌గా సినిమా మంచి స్టాండర్డ్స్‌ మెయింటైన్‌ చేసింది. ఓవరాల్‌గా కామెడీతో కాలక్షేపానికి లోటుండదు కానీ కొత్తదనానికే బొత్తిగా చోటు లేదు. అనిల్‌ రావిపూడికి సెన్సాఫ్‌ హ్యూమర్‌ బాగానే ఉంది. కామెడీ వరకు కాచుకున్నా కానీ కట్టిపడేసే కథ, కథనాలు లేకపోవడంతో ఒక పాయింట్‌ దాటిన తర్వాత అతను కూడా ఈ చిత్రాన్ని 'యావరేజ్‌ రేఖ' ఎగువకి మాత్రం తీసుకురాలేకపోయాడు. 

బోటమ్‌ లైన్‌: ఫస్టాఫ్‌ సుప్రీమ్‌.. సెకండాఫ్‌ డిమ్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?