Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రన్‌

సినిమా రివ్యూ: రన్‌

రివ్యూ: రన్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: సందీప్‌ కిషన్‌, బాబీ సింహా, అనీషా ఆంబ్రోస్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాధ్‌, ప్రవీణ్‌, మధునందన్‌ తదితరులు
సంగీతం: సాయికార్తీక్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌
నిర్మాతలు: సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్‌ సుంకర
కథ, కథనం: ఆల్ఫోన్స్‌ పుతిరేన్‌
దర్శకత్వం: అని కన్నెగంటి
విడుదల తేదీ: మార్చి 23, 2016

రీమేక్‌ సినిమా అనగానే ఉన్నది యథాతథంగా తీసేసి కూడా కథనంకి ఒరిజినల్‌ దర్శకుడికి క్రెడిట్‌ ఇవ్వడానికి మన దర్శకులు వెనకాడతారు. ఈ విషయంలో అని కన్నెగంటిని మెచ్చుకోవాలి. కథ, కథనాలకి పూర్తిగా ఆల్ఫోన్స్‌ పుతిరేన్‌కే క్రెడిట్‌ ఇచ్చేయడమే కాదు, అతను తీసిన 'నేరమ్‌' సినిమాని అణువంతైనా మార్చకుండా ఉన్నది ఉన్నట్టు తీసాడు. అయితే ఆల్రెడీ గీసిన ఒక చిత్రాన్ని తిరిగి గీస్తే అది ఇమిటేషనే అవుతుంది కానీ ఒరిజినల్‌ అనిపించుకోదు. 'నేరమ్‌' చూసిన వాళ్లకి 'రన్‌' చూస్తే పైపైన ఎలాంటి తేడాలు కనిపించవు. కానీ ఒరిజినల్‌లోని సహజత్వం, అందులోని రా అప్పీల్‌ మాత్రం మిస్‌ అవుతారు. 

ఒక కసాయి వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకున్న హీరో బకాయి తీర్చాల్సిన గడువు రోజున స్నేహితుడు చేసిన సాయంతో అప్పు తీర్చడానికి బయల్దేరతాడు. కానీ తన చేతిలోని డబ్బుని ఒక దొంగ కాజేసి పారిపోతాడు. సాయంత్రంలోగా అప్పు తీర్చకపోతే విలన్‌ చేతిలో ఏమైపోతాడో తెలీదు. మరోవైపు తనని ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనుంచి వచ్చేసి తన కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. ఈలోగా తన అక్క భర్త కట్నం బకాయిల్లో లక్ష రూపాయలు సాయంత్రానికల్లా ఇమ్మంటూ వచ్చి పడతాడు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న హీరోని చూస్తే జాలి కలగాలి. తన చేతిలోని డబ్బు పోతే మనసు చివుక్కుమనాలి. అతని కష్టాలు తీరిపోతే ఆనందించాలి. కానీ ఇందులో ఏ భావోద్వేగానికీ, ఏ క్షణంలోను లోను కాలేం. 

'రన్‌'లో మెచ్చుకోతగ్గ అంశాలన్నీ ఒరిజినల్‌లోని పాజిటివ్‌ పాయింట్సే. యథాతథంగా అనువ'దించడం' వల్ల థ్రిల్‌ కలిగించే సంఘటనలు, అనూహ్యంగా వచ్చే మలుపులు ఇంపాక్ట్‌ వేయగలిగినా, పాత్రలతో కలిసి ట్రావెల్‌ చేసే ఎమోషనల్‌ కనెక్ట్‌ ఏర్పడకపోవడం దీనికి సంబంధించి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌. ఇలాంటి బలహీనతల్ని కామెడీతో కవర్‌ చేసుకునే వీలుంది. కామెడీ కోసమని పెట్టిన సీన్లు చాలా వరకు మిస్‌ఫైర్‌ అయ్యాయి. దాంతో ఫైనల్‌గా 'రన్‌' ఒక డిఫరెంట్‌ అటెంప్ట్‌ అనిపించుకుంటుందే తప్ప గుడ్‌ ఫిల్మ్‌ అనిపించుకోలేక పోయింది. 

రొటీన్‌ సినిమాల ట్రాక్‌లో పడిపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న సందీప్‌ కిషన్‌ కొత్త ప్రయత్నాల దిశగా అడుగువేయడం ప్రశంసనీయం. తన సహజసిద్ధమైన ఎనర్జీ, ఈజ్‌ చూపించే అవకాశం లేని కాస్త నెమ్మదైన పాత్రలో అతను బాగానే చేసాడు. నేరమ్‌లో విలన్‌ పాత్ర చేసిన బాబీ సింహానే రన్‌లో కూడా తీసుకోవడం ప్లస్‌ పాయింట్‌. తనదైన శైలిలో మరోసారి బాబీ ఈ పాత్రలో రాణించాడు. కీలకమైన హీరోయిన్‌ తండ్రి పాత్రకి కాశీవిశ్వనాధ్‌లాంటి కామెడీ టైమింగ్‌ లేని నటుడ్ని ఎంచుకోవడం బాలేదు. ఆయన తానున్న సన్నివేశాలన్నిటినీ సక్సెస్‌ఫుల్‌గా చెడగొట్టేసాడు. పోలీస్‌ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ బాగుంది. హీరో స్నేహితుడి పాత్రలో ప్రవీణ్‌ నేచురల్‌గా చేసాడు. హీరోయిన్‌ క్యారెక్టర్‌ వేసిన అనీషా ఆంబ్రోస్‌ చేయడానికంటూ పెద్దగా ఏం లేదు. పోసానిది రొటీన్‌ క్యారెక్టరే. బట్లర్‌ ఇంగ్లీష్‌ మాట్లాడే టపోరి తరహా పాత్రలో మహత్‌ రాఘవేంద్ర మాత్రం మెప్పించలేకపోయాడు.

ఒరిజినల్‌లోని పిస్తా పాటకి అనువాదం మినహా సాయికార్తీక్‌ బాణీలు ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. దర్శకుడు తన ముద్ర చాటుకోవడానికి కానీ, నేరమ్‌ కథ, కథనాలని తనదైన శైలిలో ప్రెజెంట్‌ చేయడానికి కానీ కనీసం ట్రై చేయలేదు. అచ్చంగా 'కంట్రోల్‌ సి, కంట్రోల్‌ వి' సూత్రం ఫాలో అయిపోయాడు. 

కొత్త తరహా సినిమాలని ఆదరిస్తున్న ట్రెండ్‌లో ఈ చిత్రాన్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మూడేళ్ల క్రితం వచ్చిన 'నేరమ్‌'ని ఇప్పుడు రీమేక్‌ చేసినట్టున్నారు. ఆలోచన మంచిదే. ఖచ్చితంగా ఇందులోని కొత్తదనం ఒక వర్గం ప్రేక్షకులని ఒకింత శాటిస్‌ఫై చేస్తుంది. తక్కువ నిడివితోను నిదానంగా సాగే కథనం, ఇంటర్వెల్‌కి ముందు, క్లయిమాక్స్‌కి ముందు తప్ప అలర్ట్‌గా కూర్చోబెట్టే ఎలిమెంట్స్‌ లేకపోవడం, అన్నిటికీ మించి క్యారెక్టర్స్‌తో రిలేట్‌ చేసుకోలేకపోవడం 'రన్‌'కి ప్రతికూలతలుగా మారాయి. మైనస్‌లు ఉన్నప్పటికీ 'రొటీన్‌కి భిన్నంగా ఉంది', 'అన్ని పాత్రలనీ కలుపుతూ ఊహించని మలుపులతో ఇచ్చిన ముగింపు బాగుంది' లాంటి అనుకూలతలతో ఇది ఎందాకా 'పరుగెడుతుందో' చూడాలి. 

బోటమ్‌ లైన్‌: వేగం లేని పరుగు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?