రివ్యూ: అవును – పార్ట్ 2
రేటింగ్: 2/5
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి., ఫ్లయింగ్ ఫ్రాగ్స్
తారాగణం: పూర్ణ, హర్షవర్ధన్ రాణె, చక్రవర్తి, రవివర్మ, నిఖిత, సంజన, భార్గవి తదితరులు
కథనం: సత్యానంద్
మాటలు: నివాస్
సంగీతం: శేఖర్ చంద్ర
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి
నిర్మాతలు: సురేష్, రవిబాబు
కథ, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ: ఏప్రిల్ 3, 2015
చాలా హారర్ సినిమాల్లానే ఓపెన్ ఎండింగ్‌తో ‘అవును’ ముగించినప్పుడు.. దీనికి కొనసాగింపు తీద్దామనే ఆలోచన రవిబాబుకి లేదట. ‘అవును’ థియేటర్లలోనే కాక టీవీలో కూడా సక్సెస్ అవడం చూసి దానికి పార్ట్ 2 తీస్తే బావుంటుందని అనిపించి దీనిని తలపెట్టాడట. సాధారణంగా రెండో భాగానికి బీజం మొదటి భాగం తీస్తున్నప్పుడే పడిపోతుంది. నిజంగా ఆ కథలో కొనసాగించదగ్గ ‘మేటర్’ ఉన్నట్టయితే! అలా కాకుండా దాని విజయాన్ని చూసి దానికి కొనసాగింపు తీయాలనే ఐడియా పుట్టిందంటే… కేవలం ఆ మొదటి దాని సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలనే కోరికే తప్ప, నిజంగా దాని స్థాయికి తగ్గ సీక్వెల్ తెరకెక్కదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చాలా సీక్వెల్స్ ఫెయిల్ అవడానికి రీజన్ ఇదే.
మొదటి భాగం తీస్తున్నప్పుడు అదో ఫ్రెష్ ఐడియా. ఆడియన్స్‌ని ఎంతలా ఇంప్రెస్ చేయవచ్చో, ఏ రేంజ్‌లో థ్రిల్ చేయవచ్చో ఆలోచిస్తూ అందుకు తగ్గ సెటప్, బిల్డప్ అన్నీ సమకూర్చుకుంటారు. దాని సక్సెస్ చూసి మొదలెట్టిన ద్వితీయ భాగానికి వచ్చేసరికి అది ఇక ఎంత మాత్రం ఫ్రెష్ ఐడియా కాదు. ఆల్రెడీ ఆ ఐడియాని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయవచ్చో.. అదంతా మొదటి భాగంలోనే జరిగిపోయింది కాబట్టి ఇక రీసైకిల్డ్ సీన్లు, ఫస్ట్ పార్ట్‌లో ఫైనల్ డ్రాఫ్ట్‌కి చేరే అర్హత లేని సన్నివేశాలు వచ్చి ఇందులో చేరిపోతాయి. ఓపెన్ ఎండింగ్‌తో ముగిసిన చిత్రమే అయినా ‘అవును’ కథ అక్కడే ముగిసిపోయింది. అంటే అన్ని కథల్లానే అదీ కంచికి చేరిపోయింది. దానిని అక్కడ్నుంచి కాశీకి తీసుకెళ్లి మళ్లీ కంచికి చేర్చే ప్రయత్నం చేస్తే ఇలాగే అవుతుంది.
Watch Avunu 2 Movie Public Talk
హర్ష, మోహిని (హర్ష, పూర్ణ) ఆ గేటెడ్ కమ్యూనిటీ వదిలేసి ఒక బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్‌లో అద్దెకి దిగుతారు. మోహినిపై మోహం తీరని కెప్టెన్ రాజు ఆత్మ వారిని అనుసరిస్తూ ఇక్కడికి వస్తుంది. అయితే కాశిలో పూర్ణని చూసిన ఒక అఘోరా ఆమెకి మంత్రించిన రూపు ఒకటి ఇస్తాడు. అది సంవత్సరం పాటు ధరిస్తే ఆ ఆత్మ తననేం చేయలేదని చెప్తాడు. మోహిని ఆ రూపు వేసుకుని ఉండడంతో కెప్టెన్ రాజు ఆమెని ఏం చేయలేకపోతాడు. ఆ రూపుని ఆమెకి దొరక్కుండా చేయడమే లక్ష్యంగా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈసారి అయినా తన కోరిక తీర్చుకున్నాడా లేదా అనేదే ‘అవును పార్ట్ 2’ కథ.
ఫస్ట్ పార్ట్‌లోని మిస్టరీ ఎలిమెంట్‌కి ఇందులో చోటు లేదు. సమస్య, సంఘర్షణ ఏంటనేవి మనకి ముందే తెలుసు కనుక సరాసరి పరిష్కారానికి దిగిపోవాలి. ఇక్కడే ‘అవును’లో ఉన్న అదనపు బలాలన్నీ కోల్పోయి ఈ పార్ట్ 2 బేలగా మిగిలిపోయింది. హారర్ బిల్డప్‌కి స్కోపే లేకపోవడంతో ఇక ఎటాక్‌కి రెడీ అయిపోవాల్సి వచ్చింది. అయితే దానిని డిలే చేయడానికని ఆ ‘రూపు’ రూపంలో ఒక లాక్ వేసుకున్నారు. మొత్తం సినిమా అంతా ఇక దాని చుట్టూనే తిరుగుతూ పోయింది. దానిని ఆమె ఎప్పుడు తీస్తుంది, కెప్టెన్ రాజు ఆత్మకి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని వెయిట్ చేస్తుండాలన్నమాట. అసలే చిరాకు పెడుతోన్న ఈ ప్లే మధ్యలో మరింతగా ఇరిటేట్ చేసే పక్క ఫ్లాట్ అతని (రవివర్మ) క్యారెక్టర్ ఒకటి. ఆత్మలు ఉంటాయా ఉండవా అంటూ ఒక ఎక్స్‌పెరిమెంట్ జోడించి క్యూరియాసిటీ కలిగించే ప్రయత్నం జరిగింది కానీ అదీ మిస్‌ఫైర్ అయింది.
రవిబాబు మంచి దర్శకుడనే దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. చాలా సింపుల్ ఐడియాస్‌తో, లో బడ్జెట్‌లో ఆకట్టుకునే సినిమాలు తీయగల ప్రతిభ అతని సొంతం. అయితే ఒక్కోసారి చాలా నాసిరకం సినిమాలు తీసేస్తుంటాడు. అరకొర ఆలోచనలతో, హాఫ్ బేక్డ్ స్క్రిప్టులతో సినిమాలు చేసేద్దామని చూసి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. ‘అవును’ అతని ప్రతిభకి అద్దం పడితే, ‘అవును 2’ అతని బలహీనతని భూతద్దంలో చూపిస్తుంది. అయిపోయిన కథని బలవంతంగా ఇంకో గంటన్నర పాటు పొడిగించాలని చూస్తే అందుకు తగ్గ మేటర్ ఉండాలి. లేదంటే ఆ గంట గడవడమే గండం అయిపోతుంది. అవును 2 ప్రథమార్థం పూర్తయ్యే సరికే నెక్స్‌ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా అడుగంటిపోతుంది. ఒక హారర్ లేదా థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అంతగా డిస్‌కనెక్ట్ అయిపోతే ఇక ఏం చేసినా ఉపయోగం ఉండదు. ప్రథమార్థంలోనే రాజు సంగతి మోహినికి తెలిసిపోతే పూర్తి నిడివి ఉన్న సినిమా తీయడానికి తగిన స్టఫ్ ఉండదని భావించారో ఏమో, ఆ కాన్‌ఫ్రంటేషన్‌ని సెకండాఫ్ వరకు డిలే చేసారు.
అది జరిగిన తర్వాత అయినా ఒక్కటైనా థ్రిల్ కలిగించే సీన్ లేదు. అక్కడక్కడా కాస్త టెన్షన్ పుట్టించినా కానీ నెమ్మదిగా కదిలే రాజు కాలయాపన చేస్తున్నాడే తప్ప తన కాంక్ష తీర్చుకోవాలని తొందర పడ్డం లేదని అర్థమైపోతుంటుంది. ఇంకా చెప్పాలంటే ముగింపు ఏంటనేది కూడా ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇక అలాంటప్పుడు ఈ జోనర్ సినిమాకి నిలబడే స్కోప్ ఏముంటుంది? ఇలాంటి వీక్ సినిమాలో కూడా పూర్ణ తన నటనతో మెప్పించింది. ఆమె భయాన్ని అభినయించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి ఎట్రాక్షన్ అంటూ ఉంటే అది పూర్ణ మాత్రమే. అటు కథానుసారం కావాల్సిన గ్లామర్ కానీ, ఇటు పాత్ర ప్రకారం చూపాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ అవనీ.. పూర్ణ రాణించింది. మిగిలిన వారిలో హర్ష ఒక్కడే ఫర్వాలేదనిపిస్తాడు. చక్రవర్తి, సంజన, రవివర్మ అందరూ హద్దు మీరి ఓవరాక్షన్ చేసారు. సీన్లో భయపెట్టే స్టఫ్ లేకపోవడంతో నేపథ్య సంగీతంతో భయపెట్టడానికి సంగీత దర్శకుడు విఫలయత్నం చేసాడు. అదో రకం అరుపులు, కేకలతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం బాగున్నాయి.
Watch Avunu 2 Movie Public Talk
‘అవును’ చూసినట్టయితే ఈ కొనసాగింపు చూడాల్సిన అవసరమే లేదు. ఈ వంద నిముషాల సినిమా చూడ్డం కంటే… దీని కోసం కట్ చేసిన ఆ ఒక్క నిముషం ట్రెయిలర్‌ని వంద సార్లు చూస్తే ఎక్కువ థ్రిల్ కలుగుతుందేమో! కేవలం అవును సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలనే ఎటెంప్ట్ తప్ప అవును చిత్రానికి తగ్గ సీక్వెల్ ఎంతమాత్రం కాదు. ‘అవును’ సినిమాకి ఉన్న గుడ్‌విల్ వల్ల దీనికి ఏమైనా కలెక్షన్స్ రావాలేమో కానీ, సినిమాగా అయితే దాని దరిదాపులకి వచ్చే లక్షణం ఒక్కటీ లేదు. మరో భాగం తీయడానికి అవకాశముండేలా ముగింపు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంకో భాగం వస్తే బాగుండనే ఫీలింగ్ కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
బోటమ్ లైన్: అవును.. ఈసారి ఫెయిలయ్యారు!
– గణేష్ రావూరి