రివ్యూ: బిరియాని
రేటింగ్: 2.5/5
బ్యానర్: స్టూడియో గ్రీన్
తారాగణం: కార్తీ, హన్సిక, ప్రేమ్‌జీ, నాజర్, సంపత్, మధుమిత, రాంకీ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి. శ్రీకాంత్
ఛాయాగ్రహణం: శక్తి శరవణన్
నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా
కథ, కథనం, దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2013
సూర్య తమ్ముడు కార్తీ తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా వేగంగా క్లిక్ అయ్యాడు. వరుస హిట్స్‌తో దూసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత ఆ స్పీడ్ మెయింటైన్ చేయలేక బోల్తా కొట్టాడు. అతని రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తమిళంలో సరిగా ఆడలేదు. తెలుగులోను వర్కవుట్ కాలేదు. కొన్ని అయితే అసలు ఇక్కడ విడుదలే అవలేదు.
కథేంటి?
సుధీర్ (కార్తీ), పరశు (ప్రేమ్‌జీ) చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి రాజమండ్రి తమ కంపెనీ కొత్త షోరూమ్ ఓపెనింగ్ ఉంటే వెళతారు. తిరిగి వస్తుండగా ఓ ‘మాయ’లాడి (మాండీ తక్కర్) వలలో పడి ఆమెతో పాటు హోటల్‌కి వెళతారు. తప్పతాగి తెల్లారి లేచి చూసేసరికి తాము ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటారు. వరదరాజులు (నాజర్) అనే వ్యాపారవేత్తని వీరిద్దరూ కిడ్నాప్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరికీ తమ కారు డిక్కీలో వరదరాజులు శవం కనిపిస్తుంది. ఈ హత్య కేసు తమ మెడకే చుట్టుకుంటుందని అర్థం చేసుకున్న తర్వాత దానినుంచి బయటపడేందుకు పథకం రచిస్తారు. అసలు వరదరాజులుని ఎవరు చంపుతారు. వీరిపై నింద ఎందుకు నెడతారు?
కళాకారుల పనితీరు!
కార్తీ తన పాత్రని ఎలాంటి హంగామా, హడావుడి లేకుండా సింపుల్‌గా చేశాడు. ప్రేమ్‌జీ ఎప్పుడూ ‘వెంకట్ ప్రభు’ సినిమాల్లో ప్రధాన పాత్రలు కొట్టేస్తాడు. ఇందులో అతనికి హీరోతో సమానమైన క్యారెక్టర్. ఫైట్లు మినహా మిగతా అన్ని సీన్స్‌లోను కార్తీతో సమానంగా ఉంటాడు. కొన్ని మంచి జోక్స్‌తో ప్రేమ్‌జీ నవ్వులు పూయించాడు. హన్సిక హీరోయిన్ అనే కానీ ఆమెది ఇందులో చాలా చిన్న రోల్. నిజానికి హీరో క్యారెక్టరైజేషన్‌కి అతనికో హీరోయిన్ అవసరం కూడా లేదిందులో. రాంకీ ఓకే అనిపించాడు. నాజర్‌ది రొటీన్ క్యారెక్టర్. సంపత్ ఫర్వాలేదు. మధుమిత, మాండీ తదితరులంతా తమ పాత్రలకి అనుగుణంగా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
యువన్ శంకర్ రాజా వందవ చిత్రమిది. తన ల్యాండ్‌మార్క్ ఫిలింకి ఇవ్వాల్సిన మ్యూజిక్ అతను ఇవ్వలేదు. ఒక్క పాట మినహా ఏదీ వినసొంపుగా లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్‌గా ఉండాల్సింది. కనీసం ఇరవై నిముషాల పాటు సినిమా లెంగ్త్ అవసరానికి మించి పెరిగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
వెంకట్ ప్రభు మరోసారి థ్రిల్లర్ జోనర్‌ని టచ్ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ కాకుండా సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయాలని చూశాడు. అయితే అతను ఈ ప్రయత్నంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు. కామెడీలో కొంత భాగం నవ్వించినట్టే, థ్రిల్లర్ పార్ట్‌లో కూడా కొంతే ఎక్సయిట్‌మెంట్ కలుగుతుంది. హాస్యం పండించడానికి చాలా తెలివి చూపించిన దర్శకుడు అవసరమైన చోట్ల మాత్రం తెలివితేటల్ని ప్రదర్శించలేదు.
హైలైట్స్:
- కార్తీ-ప్రేమ్‌జీ కామెడీ
డ్రాబ్యాక్స్:
- లాజిక్ లేని సెకండ్ హాఫ్
విశ్లేషణ:
సినిమా కథని ఆరంభించిన తీరు, చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్స్‌తో హీరో క్యారెక్టర్‌ని, ప్రేమ్‌జీని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కార్తీ, ప్రేమ్‌జీ ఇద్దరి బాండింగ్‌ని, స్నేహితులైనా ఇద్దరూ పక్కపక్కనే ఉంటూ గోతులు తవ్వుకునే విధానాన్ని దర్శకుడు ఫన్నీగా చూపించాడు. అయితే అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ప్రథమార్థంలో కాసేపు బోర్ కొడుతుంది. కానీ ఇంటర్వెల్ టైమ్‌కి కథ రసకందాయంలో పడుతుంది.
ఈ చిక్కు నుంచి వీరు ఎలా బయటపడతారు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత దానిని అంతే ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. కామెడీ సీన్స్‌ని ఎంతో తెలివిగా, క్లెవర్ హ్యూమర్‌తో రక్తి కట్టించిన దర్శకుడు నిజంగా తెలివితేటలు ప్రదర్శించాల్సిన చోట మరీ కామెడీగా సీన్స్ కన్సీవ్ చేశాడు. అంత పెద్ద చిక్కునుంచి హీరో బయటపడే విధానం చాలా సిల్లీగా ఉంటుంది.
లాజిక్‌ని పూర్తిగా గాలికి వదిలేసిన దర్శకుడు మినిమమ్ కామన్‌సెన్స్ కూడా చూపించలేదు. ఎప్పుడో చనిపోయిన వాడిని తర్వాత చనిపోయాడని చూపించడం వల్ల అంతా నమ్మేస్తారా? పోస్ట్‌మార్టమ్‌లో చనిపోయిన టైమ్ తెలియదా? చిన్న చిన్న విషయాల్ని కూడా సరిగా డీల్ చేయకుండా తనకి తోచింది తీసేసి చివర్లో అదంతా జరగడానికి వివరించిన కారణం కూడా సినిమాటిక్‌గా ఉంది.
లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే ఓకే కానీ ఒక్కసారి అటుగా ఆలోచన వెళితే మాత్రం దీనిని చివరి వరకు ఎంజాయ్ చేయడం కష్టం. కార్తీ నటించిన శకుని, బ్యాడ్‌బాయ్‌లాంటి చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. అలా అని అతను ఆశిస్తున్న ఆ బ్రేక్ అయితే దీంతో రాదు. కామెడీ కారణంగా ఓవరాల్‌గా యావరేజ్ అనిపిస్తుంది తప్ప తప్పక చూడాల్సిన సినిమా అనిపించదు. దర్శకుడు ‘బిరియాని’ అని పేరు పెట్టి… తనకి తెలిసిన రెసిపీతో ‘పులిహోర’ కలిపేశాడు. ఏది పెట్టేసినా తినేస్తామన్నంత ఆకలితో వెళితే తప్ప ఈ బిరియాని తిని సంతృప్తిగా బయటకి రావడం కష్టం.
బోటమ్ లైన్: బిరియానిలో మసాలా బాగా తగ్గింది!
– జి.కె