Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: దృశ్యం

సినిమా రివ్యూ: దృశ్యం

రివ్యూ: దృశ్యం
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి., రాజ్‌కుమార్‌ థియేటర్స్‌ ప్రై.లి.
తారాగణం: వెంకటేష్‌, మీనా, నదియా, నరేష్‌, రవి కాలే, సమీర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, కృతిక తదితరులు
కథ, కథనం: జీతు జోసెఫ్‌
మాటలు: డార్లింగ్‌ స్వామి
సంగీతం: ఎస్‌. శరత్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: ఎస్‌. గోపాల్‌ రెడ్డి
నిర్మాతలు: రాజ్‌కుమార్‌ సేతుపతి, సురేష్‌
దర్శకత్వం: శ్రీప్రియ
విడుదల తేదీ: జులై 11, 2014

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారంటే పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ చిత్రాన్ని తెలుగులో అంతే గొప్పగా తిరిగి తెరకెక్కించగలరా? మోహన్‌లాల్‌ చేసిన పాత్రకి వెంకటేష్‌ న్యాయం చేయగలడా? తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా కొత్త పంథాలో సాగే ఈ చిత్రం మన వారిని మెప్పిస్తుందా? అన్ని ప్రశ్నలకి, అనుమానాలకి సమాధానమిస్తూ... దృశ్యం ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అరుదైనదిగా నిలిచింది. తిరుగులేని కథ, కథనాలతో ఆద్యంతం కట్టి పడేసింది.

కథేంటి?

సాఫీగా సాగిపోతున్న కేబుల్‌ ఆపరేటర్‌ రాంబాబు (వెంకటేష్‌) జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంటుంది. తన తెలివితేటలతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను తన సినీ పరిజ్ఞానాన్ని వాడి ఏం చేస్తాడు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని ఎలా బోల్తా కొట్టిస్తాడు అనేది దృశ్యం కథ. ఇంతకుమించి కథ చెప్పుకుంటే క్లూస్‌ తెలిసిపోయే ప్రమాదముంది. ఈ చిత్ర కథ గురించి ముందే తెలుసుకుంటే ఆ థ్రిల్‌ మిస్‌ అయిపోయే అవకాశాలెక్కువ కనుక దీని గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సరాసరి సినిమాకెళ్లిపోయే మంచిది. 

కళాకారుల పనితీరు:

వెంకటేష్‌ ఇంతకుముందు కూడా చాలా ఫ్యామిలీ సినిమాలు చేసాడు కానీ తనకీ ఇందులోని ఫ్యామిలీ హీరో పాత్ర చాలా కొత్త. తన ఇమేజ్‌కి సంబంధం లేకుండా ఒక సగటు మధ్య తరగతి తండ్రిలా వెంకటేష్‌ చాలా బాగా చేసాడు. మోహన్‌లాల్‌తో కంపారిజన్‌ అవసరం లేదు కానీ తనదైన శైలిలో ఈ పాత్రకి వెంకటేష్‌ న్యాయం చేసాడు. సోలో హీరోగా చాలా కాలంగా విజయాలు లేని వెంకటేష్‌కి ఈ చిత్రం అన్ని విధాలుగా రిలీఫ్‌ ఇస్తుంది.

వెంకటేష్‌ తర్వాత ఈ కథలో అత్యంత కీలకమైన పాత్ర నదియాది. రీఎంట్రీలో మరపురాని పాత్రల్ని సొంతం చేసుకుంటోన్న నదియా మరో మంచి పాత్రలో ఆకట్టుకుంది. పోలీస్‌ అధికారి పాత్రలో ఎంత ఠీవీగా కనిపించిందో... కొడుకు జాడ తెలియని నిస్సహాయ తల్లిగా బ్రేక్‌ అయ్యే టైమ్‌లోను అంతే బాగా నటించి మెప్పించింది. 

మీనా తన పాత్రకి తగ్గట్టు ఉంది. వెంకటేష్‌ పెద్ద కూతురిగా కృతిక కీలక సన్నివేశాల్లో బాగా నటించింది. మలయాళ వెర్షన్‌లో కూడా నటించిన బేబీ ఎస్తేర్‌ కూడా తన నటనతో ఆకట్టుకుంది. దుష్ట పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో రవి కాలే పర్‌ఫార్మెన్స్‌ మెప్పిస్తుంది. మిగిలిన అందరు నటీనటులు తమ తమ పరిధుల్లో బాగా చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

డార్లింగ్‌ స్వామి సంభాషణల్లో చాలా వరకు ఒరిజినల్‌కి కట్టుబడి సాగాయి. ప్రథమార్థంలో కొన్ని హాస్య సంభాషణలతో తన ప్రత్యేకతని చాటుకున్నాడు మాటల రచయిత. సినిమాలో రెండే పాటలున్నాయి. సందర్భానుసారం వచ్చే ఆ పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఎస్‌. గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ డ్రామా ఎలివేషన్‌లో మంచి రోల్‌ ప్లే చేసింది. ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ చక్కగా కుదిరాయి. 

మలయాళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన జీతూ జోసెఫ్‌ రచన దృశ్యానికి తిరుగులేని బలం. అతని స్క్రిప్ట్‌ని తు.చ. తప్పకుండా ఫాలో అయిపోయిన శ్రీప్రియ తొంభై తొమ్మిది శాతం అతనేం చేసాడో అదే చేసింది. ఒరిజినల్‌ చూసిన వారికి శ్రీప్రియ ఇందులో యాక్షన్‌ కట్‌ మినహా చేసిన డైరెక్షన్‌ ఏమీ లేదని అనవచ్చు. కళ్ల ముందు పర్‌ఫెక్ట్‌ సినిమా ఉన్నప్పుడు దానికి తమదైన టచ్‌ ఇచ్చే నెపంతో చెడగొట్టడం కంటే... జిరాక్స్‌ మిషన్‌ డ్యూటీ చేయడమే ఒక్కోసారి చాలా ఉత్తమం. ఆ పనిని శ్రీప్రియ పర్‌ఫెక్ట్‌గా చేసింది. తన నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకునే విషయంలో దర్శకురాలిగా సక్సెస్‌ అయింది. 

హైలైట్స్‌:

  •  స్క్రిప్ట్‌
  •  స్క్రిప్ట్‌
  •  స్క్రిప్ట్‌

డ్రాబ్యాక్స్‌:

  •  ఆరంభంలో కాస్త విసిగిస్తుంది
  •  హీరో అల్లే కట్టు కథలో కొన్ని లాజిక్స్‌ మిస్సయ్యాయి

విశ్లేషణ:
 
సస్పెక్ట్‌ ఎక్స్‌ అనే జపనీస్‌ సినిమా ఆధారంగా మలయాళంలో తీసిన ఈ చిత్రాన్ని తెలుగులో యథాతథంగా రీమేక్‌ చేసారు. దృశ్యం రక్తి కట్టాలంటే ముందు రచన పకడ్బందీగా ఉండాలి. రచన బలంగా ఉంటే దృశ్యం ఆ‘కట్టి పడేయడానికి’ స్కోప్‌ పెరుగుతుంది. అందుకే ‘కథాబలం’ అంటూ సినిమా వాళ్లు తరచుగా మాట్లాడుతుంటారు. ఈమధ్య టైమ్‌పాస్‌ సినిమాల తాకిడి పెరిగిపోయి... కాసిని కామెడీ సీన్లు రాసుకుని, బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకుంటే హిట్టు గ్యారెంటీ అనిపిస్తూ ఉండడంతో బుర్రనంతా అటు వాడేస్తున్నారు చాలామంది. అయితే కథలో బలం ఉంటే కదలకుండా కూర్చోబెట్టడానికి అదనపు హంగులు, కామెడీలు, పాటలు, ఫారిన్‌ లొకేషన్లు అక్కర్లేదని చాటి చెప్పడానికి దృశ్యం చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. 

కంటెంట్‌ డ్రివెన్‌ సినిమాలు చూడ్డానికి ఇంకా మన ఆడియన్స్‌ ప్రిపేర్‌ అయి ఉన్నారో లేదో తెలియదు కానీ దృశ్యంలాంటి చిత్రాలు భవిష్యత్‌లో రాబోయే ఇలాంటి సినిమాలు చూడ్డానికి వారిని సిద్ధం చేస్తాయి. ‘ఇది వెంకటేష్‌ సినిమా..’, లేదా ‘ఇదో ఫ్యామిలీ సినిమా..’ అని ఏవో కొన్ని అంచనాలతో థియేటర్లోకి వెళితే దృశ్యం చాలా సర్‌ప్రైజులు విసురుతుంది. హీరో హీరోయిన్లపై డ్యూయట్లు ఉండవు. గట్టిగా మాట్లాడితే సెకండాఫ్‌లో అసలు పాటే ఉండదు. కామెడీ ట్రాకులుండవు. విలన్లు ఉన్నా కానీ హీరో తెలివితేటలకే తప్ప బల ప్రదర్శనలకి చోటుండదు. మన ప్రేక్షకులు మరీ ఇంత వైవిధ్యాన్ని ఒకేసారి స్వీకరిస్తారా... దీనికి పట్టం కట్టి తిరుగులేని విజయాన్ని అందిస్తారా? ఈ ప్రశ్నలకి కొద్ది రోజులు ఆగితే కానీ స్పష్టమైన సమాధానం దొరకదు.

మామూలుగా అయితే ఇందులో వెంకటేష్‌లాంటి స్టార్‌ అక్కర్లేదు. సినిమా రీచ్‌ పెరగడానికి అతను హెల్ప్‌ అవుతాడు. ఇదేమీ లోపాలు లేని దృశ్య కావ్యం అయితే కాదు. ఇందులోను కొన్ని లోపాలున్నాయి. హీరో అల్లే కథలో లాజిక్‌కి అతీతంగా కొన్ని పొరపాట్లు దొర్లిపోయాయి. అయితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేనంత పకడ్బందీగా కథనం వేగంగా సాగుతూ, అనుక్షణం ఉత్కంఠ రేపుతూ దృశ్యం అలరిస్తుంది. మొదట్లో కాస్త నీరసంగా సాగినా కానీ అసలు కథ మొదలైన తర్వాత దృశ్యం చివరి వరకు ఆసక్తి సడలకుండా పరుగులు పెడుతుంది. మలయాళంలో చూసిన వారు తెలుగులో వచ్చిన ఈ జిరాక్సుని చూసి కాస్త నిరాశ పడవచ్చు కానీ అది చూడని వారు మాత్రం తప్పకుండా థ్రిల్‌ ఫీలవుతారు. లిమిటెడ్‌ అప్పీల్‌ ఉంటుందేమో అనే అనుమానం ఒక్కటీ ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకోలగలదనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. వైవిధ్యభరిత సినిమాలెప్పుడొస్తాయంటూ పడిగాపులు పడే సినీ ప్రియులు మాత్రం ఈ దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని మిస్‌ చేసుకోవద్దు.

బోటమ్‌ లైన్‌: అరుదైన ‘దృశ్యం’!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?