నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి ఏడాదే రెండు తెలుగు రాష్ట్రాలను ముంచేసింది. సదానంద గౌడ రైల్వే బడ్జెటులో, అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెటులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు శూన్య హస్తమే మిగిలింది. రెండు బడ్జెట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి బలవంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించిన బీజేపీ ఆ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. మీరేం భయపడొద్దు. మీకు కావల్సినంత సాయం చేస్తాం అని ఆంధ్రప్రదేశ్‌ను ఊరడిరచిన కమలదళం ఆ రాష్ట్రానికి తవ్వి తలకెత్తింది ఏమీ లేదు. రైల్వే బడ్జెటులో రెండు రాష్ట్రాలకు ఏమీ విదిల్చకపోగా, సాధారణ బడ్జెటులో మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు కంటితుడుపు చర్యగా ఏవో కొన్ని పిప్పరమెంట్లు పంచినట్లు పంచారు. జైట్లీ తన బడ్జెటులో తెలంగాణకు కేవలం ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయించి ఊరుకున్నారు.
ఆంధ్రకు మాత్రం ఓ ఐఐటీ, వ్యవసాయం విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా ఆస్పత్రి ఇచ్చారు. ఐఐఎం ఇస్తామని గతంలో రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ వాగ్దానం చేసినా మోదీ ప్రభుత్వానికి ఆ సంగతి గుర్తు లేనట్లుంది. ఇక కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటు, కాకినాడ పోర్టు సమీపంలోని ప్రాంతాల అభివృద్ధి, విశాఖ`చెన్నయ్ మధ్య పారిశ్రామిక కారిడార్, హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం…ఇవీ బడ్జెటులోని మిగిలిన అంశాలు. తక్షణం ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీర్చే అంశాలేవీ ఈ బడ్జ్టెటులో లేవు. తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారేతప్ప అది ఏవిధంగానో వివరించలేదు. అందుకు సంబంధించిన ప్రణాళిక లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెటులో ఏమీ కేటాయించకపోవడం బాధాకరమే అయినా వడిరచిన విస్తరిలా రాజధాని ఉండటం, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా ఉండటంతో ఇప్పటికిప్పుడు దానికి కలిగే నష్టం ఏమీ లేదు. కాని రాజధానిగాని, ఆర్థిక వనరులు లేకుండా లోటు బడ్జెటుతో అవస్థలు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కారు ఆశించిన చేయూత ఇవ్వలేదు. రాష్ట్ర విభజన సమయంలో మోదీ సహా బీజేపీ నాయకులు చెప్పిన మాటలకు, చేసిన వాగ్దానాలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్లకు పొంతన లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ గురించి అసలు బడ్జెటులో ప్రస్తావనే లేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైలు ఛార్జీల పెంపు సహా యుపిఎ పెండిరగ్‌లో పెట్టిపోయిన వాటినే తాము అమలు చేస్తున్నామని చెబుతున్న మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ అలాగే వ్యవహరించాలి కదా…! కాని ఆ పని చేయలేదు. ఆంధ్రకు రాజధాని నిర్మాణం గురించి, దానికి నిధుల కేటాయింపుల గురించి కూడా జైట్లీ తన బడ్జెటులో ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన జరగ్గానే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు అవసరమని అన్నారు. రాజధాని నిర్మాణానికి దాదాపు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర నిపుణుల బృందం కూడా అభిప్రాయపడిరది. మోదీ సర్కారు వైఖరి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోకుండా నట్టేట ముంచే పరిస్థితి కనబడుతోంది. మోదీ ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రజలకు ‘సింగపూర్ ఆశలు’ రేకెత్తించారు. కాని కేంద్రం తన మొదటి బడ్జెటులోనే ఆంధ్రను పట్టించుకోలేదు. ఈ బడ్జెటు చంద్రబాబుకు సంతృప్తి కలిగించలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కాని..తాను ఏరికోరి మిత్రత్వం చేస్తున్నారు కాబట్టి అసంతృప్తిని దిగమింగుకొని బడ్జెటుపై పాజిటివ్‌గా మాట్లాడారు.
‘మేం ఎంతో అడిగితే కొంతే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించడం చూస్తే ఆయన సంతోషంగా లేరని అర్థమవుతోంది. ఆదాయ లోటును తగ్గించడానికి బడ్జెటులో 15 వేల కోట్లు కేటాయించాలని కోరితే 1,180 కోట్లు కేటాయించడాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మొన్నటివరకూ ఉమ్మడి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే వచ్చింది. మంత్రి పదవుల విషయంలోనే కాదు, బడ్జెటు కేటాయింపుల్లోనూ వివక్షే కొనసాగింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విభజన జరిగాక కూడా అదే వివక్ష కొనసాగుతోంది. ‘ఒక్క రాత్రికి రాత్రే అన్నీ చేయలేం’ అని మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. నిజమే…అందులో అబద్ధమేమీ లేదు. కాని ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని చెప్పి బలవంతంగా రాష్ట్ర విభజన చేయించిన పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మొండి చేయి చూపించడం ప్రారంభించింది. వచ్చే నాలుగేళ్లలో ఏం చేస్తుందో చూడాలి…!