వ్యూస్ కోసం లక్షల ఖర్చు

ఖర్చులు అన్నీ అసలు కన్నా ఊరగాయ ఘనం అన్నట్లు వుంటాయి. వెనుక బండబూతులు తిట్టుకుంటూనే, పైకి నవ్వుతూ భరిస్తారు నిర్మాతలు.

వెనకటికి సామెత వుంది. వీధిలోంచి దోమలు పోకూడదు కానీ, పెరట్లోంచి ఏనుగులు పోయినా ఫరవాలేదు అని. సినిమా నిర్మాతల వైనం కూడా అలాగే వుంటుంది. సినిమా ప్రకటనలు కట్టడి చేసి, సమీక్షలను, సమీక్షకులను దారిలోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇదే నిర్మాతలు చేసే కొన్ని వృధా ఖర్చులు చూస్తే భలే చిత్రంగా వుంటుంది.

అందులో అతి కీలకమైనది పాటలు, గ్లింప్స్, టీజర్, ట్రయిలర్ తదితర కంటెంట్ ల కు మిలియన్ల వ్యూస్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది కేవలం హీరోల మెహర్బానీ కోసం. రికార్డుల కోసం తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు సినిమాకు. ఫ్యాన్స్ కొట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. తమ హీరో గ్లింప్స్ కు టీజర్ కు ట్రయిలర్ కు ఇన్ని మిలియన్ల వ్యూస్, అన్ని లైకులు అంటూ. గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకుంటారు. కానీ దీని వెనుక మిలియన్ కు ఇంత అని లక్షలు ఖర్చు చేస్తారు నిర్మాత అన్న సంగతి చాలా మందికి తెలియదు. అలా కొట్టించకుండా ఏ కంటెంట్ కు అన్నేసి వ్యూస్ రావు అన్నది పచ్చి వాస్తవం.

ఎంత పెద్ద హీరో అయితే అంతకు అంతా ఖర్చు పెట్టాల్సిందే యూ ట్యూబ్ కోసం. కానీ దీని వల్ల టికెట్ లు తెగవు. నిజంగా కంటెంట్ బాగుంటే అదే వైరల్ అవుతుంది. ఆర్టిఫిషియల్ వైరల్ చేయనక్కరలేదు.

ఇక పబ్లిసిటీ కోసం కాలేజీలు తిరగడం మరో చిత్రం. ప్రతి కాలేజీలో వేలాది మంది స్టూడెంట్స్ వుంటారు. తమ కాలేజీకి హీరో, హీరోయిన్లు వచ్చి, స్టేజ్ మీద చిత్ర విచిత్రాలు చేసి వెళ్తే, ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ గా చూస్తారు. వాళ్లలో పది మంది కూడా సినిమా చూడరు. అలా చూసేదే అయితే ఇలా కాలేజీ టూర్ లు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలి. కాలేజీ స్టూడెంట్స్ కు ప్రీ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం కోసం తప్ప వేరు కాదు.

ఇలా కాలేజీలు తిరగడానికి బోలెడు ఖర్చు.విమానం టికెట్ లు, హోటల్ రూమ్ లు, కార్లు ఒకటి కాదు, రెండు కాదు లక్షల ఖర్చు. ఓ రేంజ్ హీరోలు అయితే ఈ మధ్య చార్టర్ ఫ్లయిట్ లు కూడా వాడుతున్నారు. ఇలా కాలేజీలు, మాల్స్ తిరగడం వల్ల సినిమా జనాలకు దగ్గరైపోయింది, బజ్ వచ్చేసింది అనుకుంటున్నారు. కానీ హీరోలను, హీరోయిన్లను కాలేజీల్లో, మాల్స్ లో నేరుగా చూసేస్తుంటే, వాళ్ల డ్యాన్స్ లు, స్కిట్ లు అక్కడే చూసేస్తుంటే ఇక సినిమాకు ఎందుకు వెళ్లడం. అద్భుతమైన కంటెంట్ వుంటే అప్పుడు వెళ్తారు. లేదంటే లేదు. అంటే సినిమా నటుల మీద వున్న క్రేజ్ ను ఇలా తగ్గించేస్తున్నట్లే కదా?

సినిమా నిర్మాణంలో వున్నన్నాళ్లు హీరోల సమస్త ఖర్చులు నిర్మాతవే. మేనేజర్ దగ్గర నుంచి మేకప్ మన్ వరకు అన్నీ నిర్మాత ఖాతాలోనే. తిరుపతి వెళ్లాలన్నా ఖర్చు నిర్మాతలదే. హీరోల కోసం చేసే మరో ఖర్చు స్టయిలింగ్. ముంబాయి స్టయిలిస్ట్ లు, డ్రెస్ డిజైనర్లు, దుబాయ్ లో షాపింగ్ లు. ఇలా ఒకటి కాదు. రెండు కాదు. అస్సలు నిర్మాతలు నో అనలేని ఖర్చులు.

ముంబాయి నుంచి పాపులర్ హీరోయిన్లు లేదా డ్యాన్స్ డైరక్టర్లు, లేదా ఫైట్ మాస్టర్లను తీసుకువస్తే ఖర్చు ఓ లెక్కలో వుంటుంది. ఒక హొటల్ రూమ్ తో సరిపోదు. కనీసం మూడు రూమ్ లు వుంటాయి. మూడు కార్లు వుండాలి. హీరోయిన్ స్టాఫ్ గొంతెమ్మ కోర్కెలు మామూలుగా వుండవు. ముంబాయి సినిమాటోగ్రాఫర్ల టెక్నికల్ స్టాఫ్ ఖర్చు ఓ రేంజ్ లో వుంటుంది.

ఈ ఖర్చులు అన్నీ అసలు కన్నా ఊరగాయ ఘనం అన్నట్లు వుంటాయి. వెనుక బండబూతులు తిట్టుకుంటూనే, పైకి నవ్వుతూ భరిస్తారు నిర్మాతలు.

4 Replies to “వ్యూస్ కోసం లక్షల ఖర్చు”

Comments are closed.