చిత్రం: శుభం
రేటింగ్: 2.75/5
తారాగణం: హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలినీ కొండెపూడి, వంశీధర్ గౌడ్, సమంత తదితరులు..
సంగీతం: వివేక్ సాగర్, క్లింటన్ సెరెజో,
ఎడిటింగ్: ధర్మేంద్ర
నిర్మాత: సమంత రుత్ ప్రభు
దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
విడుదల: మే 9, 2025
హీరోయిన్ గానే మనందరికీ తెలిసిన సమంత, నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా. పైగా చాన్నాళ్ల తర్వాత అతిథి పాత్రలో సమంత తెరపై కనిపించిన సినిమా. వీటికితోడు ట్రయిలర్ కూడా క్లిక్ అవ్వడంతో శుభం సినిమాపై ఓ సెక్షన్ ఆడియన్స్ ఆసక్తి చూపించారు. మరి ఆ ఆసక్తిని థియేటర్లలో శుభం సినిమా నిలబెట్టుకుందా.. ప్రేక్షకుల్ని అంతే ఆసక్తిగా కూర్చోబెట్టగలిగిందా? చూద్దాం..
భీమిలిపట్నంలో నివశించే 3 యువ జంటల కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరికి ఆల్రెడీ పెళ్లయిపోతుంది. మూడో వ్యక్తి కేబుల్ ఆపరేటర్ శ్రీను (హర్షిత్) పెళ్లితో సినిమా మొదలవుతుంది. పెళ్లి చూపుల్లో శ్రీవల్లి (శ్రియ)ని ఇలా చూసి అలా ఇష్టపడతాడు శ్రీను. చకచకా పెళ్లి కూడా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ సీన్ లో అసలు ట్విస్ట్. జన్మజన్మల బంధం అనే సీరియల్ అంటే శ్రీవల్లికి ‘చచ్చేంత’ ఇష్టం. ఫస్ట్ నైట్ ను కూడా పక్కనపెట్టి ఆ సీరియల్ కు అతుక్కుపోతుంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ సమస్య తనది మాత్రమే అనుకుంటాడు శ్రీను.
కానీ తన స్నేహితులిద్దరిదీ అదే బాధ అనే విషయం తర్వాత తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన మరికొన్ని పరిణామాలతో ఊరంతా అదే సమస్య అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ సీరియల్ కు ఊరిలో మహిళలకు ఏంటి సంబంధం? సీరియల్ టైమ్ కు మహిళలంతా విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? మధ్యలో శ్రీను బృందానికి డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) ఇచ్చిన షాక్ ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈమధ్య వచ్చిన మత్తువదలరా-2 సినిమాలో కామెడీ కోసం సీరియల్ ను వాడుకున్నారు. కానీ ఈ శుభం సినిమాలో కథా వస్తువే ఓ సీరియల్. సినిమా మొత్తం ఆ సీరియల్ చుట్టూరా తిరుగుతుంది. ఓ చిన్న ఊరు, టీవీ సీరియల్, ఊరిలో మహిళలకు టీవీ సీరియల్ తో లింక్. పాలు నీళ్ల బంధం.. ఇది జన్మజన్మల బంధం అనే పాటతో టీవీ సీరియల్ స్టార్ట్ చేసి కథను వాడుకున్న విధానం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇలా పాత్రల పరిచయంతో పాటు, సినిమాలో మెయిన్ పాయింట్ ను ఆసక్తికరంగా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్.
బేసిగ్గా ఇదొక హారర్-కామెడీ. కాబట్టి పెద్దగా ట్విస్టులు ఆశించనక్కర్లేదు. అయినప్పటికీ సినిమాలో ఓ ట్విస్ట్ ఉంది. దాన్ని ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేదు. ఈ సంగతి పక్కనపెడితే, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ నైట్ సీన్ ను రిలీజ్ చేశారు. సినిమా మొత్తానికి అత్యంత కీలకమైన ఆ సన్నివేశాన్నే విడుదల చేసి అంచనాల్ని సెట్ చేశారు మేకర్స్.
మిడిల్ క్లాస్ కథ, సన్నివేశాలు ఫ్రెష్ గా ఉండడం, వాటికి కొత్త ముఖాలు యాడ్ అవ్వడం వల్ల ఫస్టాప్ మొత్తం చక్కగా సాగిపోతుంది. మెయిన్ పాయింట్ ను రివీల్ చేసిన తర్వాత కథపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అదే ఊపులో మంచి సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ వేయడం కూడా బాగుంది.
సెకెండాఫ్ కు వచ్చేసరికి మాత్రం దర్శకుడు కాస్త గాడితప్పాడు. కథను అటుఇటు తిప్పాడు, కామెడీ కోసం అదనంగా కొన్ని సన్నివేశాలు రాసుకున్నట్టు అనిపించింది. స్క్రిప్ట్ లో అక్కడక్కడ లోపాలు కనిపించాయి. అలా సెకండాఫ్ మిడ్ పోర్షన్ లో కాస్త గాడి తప్పిన కథ, ప్రీ-క్లయిమాక్స్ నుంచి మళ్లీ ఊపందుకుంటుంది. మంచి క్లయిమాక్స్ తో సినిమాకు ‘శుభం’ కార్డు వేశాడు దర్శకుడు.
2 గంటల 5 నిమిషాల ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ జనానికి కొత్త కాదు. మిడిల్-క్లాస్ జీవితాలు కూడా మనకు కొత్త కాదు. హారర్-కామెడీ కథలు అసలే కొత్త కాదు. ఉన్నంతలో కొత్తదనం ఉన్న పాయింట్ ఏదైనా ఉందంటే, అది డైలీ సీరియల్ కు ముడిపెడుతూ నిజజీవిత వ్యక్తులను హారర్ యాంగిల్ లో చూపించడమే. ‘చచ్చినా చూడాల్సిందే’ అనే క్యాప్షన్ ఈ సినిమాకు ఎంత బాగా కుదిరిందంటే, ఈ విషయాన్ని ఇక్కడ చెప్పేకంటే తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా భయపెట్టవు. ఎందుకంటే, అంతకుమించి హారర్ ను చూశారు ప్రేక్షకులు. అదే విధంగా సినిమాలో కామెడీ కూడా ఎక్కువగా నవ్వించదు. ఎందుకంటే, అంతకుమించి పొట్ట చెక్కలయ్యే కామెడీ సన్నివేశాలు ఇదివరకే చూసి ఉన్నారు. ఎటొచ్చి కథలో కామెడీని కాస్త మిక్స్ చేసి, పైపైన హారర్ మేకప్ వేసి, కొత్త ముఖాలతో ఫ్రెష్ గా చెప్పడం వల్ల ఈ సినిమాకు శుభాశీస్సులు దక్కుతాయి.
పూర్తిగా నటీనటుల పెర్ఫార్మెన్సు మీద ఆధారపడి తీసిన ఈ సినిమాలో కేబుల్ టీవీ శీనుగా హర్షిత్, అతడి ఇద్దరి స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి బాగా చేశారు. ఒకరు యాక్షన్ కోసం, ఒకరు కామెడీ కోసం అని గిరిగీసుకోకుండా కథలు, సన్నివేశాలకు తగ్గట్టు ముగ్గుర్ని చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. ఈ ముగ్గురితో పాటు నటించిన శ్రియ, శ్రావణి, షాలినీ బాగా చేశారు. మరీ ముఖ్యంగా శ్రీవల్లిగా శ్రావణి చాలా బాగా చేసింది. సినిమాలో కీలకమైన ఈ పాత్రను ఆమె పోషించిన విధానం ఆకట్టుకుంటుంది. శ్రావణి, షాలినీ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. డిష్ కుమార్ గా వంశీధర్ గౌడ్, మాయ పాత్రలో సమంత, డిష్ కుమార్ తల్లిగా గంగవ్వ ఆకట్టుకున్నారు. చిన్నచిన్న పదాలకు కూడా పిచ్చిపిచ్చి అర్థాలు చెప్పే పాత్రలో సమంత ఫన్నీగా నటించింది.
టెక్నికల్ గా సినిమాలో మెరుపుల్లేవ్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ కథకు తగ్గట్టు ఉన్నాయి. కథను క్రిస్ప్ గా 2 గంటల్లో కట్ చేసిన ఎడిటర్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే.
ప్రవీణ్ కండ్రేగుల మరోసారి తన మార్క్ కథ రాసుకొని, అక్కడక్కడ తన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. ‘సినిమా బండి’ని అతడు వాడుకున్న విధానం బాగుంది కానీ, అదే టైమ్ లో కాస్త ఆసక్తిని కూడా తగ్గించింది. మ్యూజిక్ అర్థవంతంగా ఉంది.
తొలిసారి సమంత నిర్మాతగా మారి తీసిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయని చెప్పలేం. కథకు తగ్గట్టుగా మాత్రమే ఉన్నాయి. అయితే నిర్మాతగా తన తొలి సినిమాకు ఇలాంటి కథను ఎంచుకున్న సమంతకు ప్రత్యేక అభినందనలు.
ఓవరాల్ గా శుభం సినిమా కొంచెం మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఇంకొంచెం హారర్ ఎలిమెంట్స్, మరికొంచెం కామెడీతో ఓ ఫీల్ గుడ్ అనుభూతినిస్తుంది. హారర్ చూసి గజగజ వణికిపోతాం, కామెడీ సన్నివేశాలకు పగలబడి నవ్విపోతాం లాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే, 2 గంటల పాటు సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
బాటమ్ లైన్ – అంతా శుభం
flop movie – worst cinematography
రివ్యూ రాసిన వారికి నాదొక ప్రశ్న – ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా లేవు , కథకు తగ్గట్టుగా మాత్రం వున్నాయి అని రాసారు .ప్రొడక్షన్ వాల్యూస్ కధకు తగ్గటుగానే ఉండాలి కానీ రిచ్ గా ఎందుకు ఉండాలి. కధకి తగ్గట్టు ఖర్చు పెట్టడమే కదా ప్రొడ్యూసర్ పని ..
️
Ante l 11 palace laga vundali avasaram lekapoina
all 3 wives are already dead. anduke chachina chustaru serial ni. this is the twist. guessing only.
package delivered to gas andhra.
శుభం మంచి మూవీ సూపర్ గా వుంది తప్పక చూడండి
సాధారణం గా ఇలాంటి చిన్న సినిమాలకి అన్నీ వంకలు పెట్టి 2.5 కన్నా ఎక్కువ వేయవు. ఓహో తారాగణం లో రెండు రె*డ్లు కనిపించేసరికి రెండు పాయింట్లు ఎక్కువేశావా.. దొంగి..