#Single Review: మూవీ రివ్యూ: సింగిల్

సినిమాలో ఏదో విశేషముందని, కడుపుబ్బ నవ్వుకునే కామెడీ ఉంటుందని అనుకుంటే మాత్రం పొరపాటే.

చిత్రం: సింగిల్
రేటింగ్: 2.5/5
తారాగణం: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవాన, వెన్నెల కిషోర్, విటివి గణేష్, రాజేంద్రప్రసాద్, సత్య తదితరులు
కెమెరా: వేల్ రాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ కె ఎల్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు: విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి
దర్శకత్వం: కార్తిక్ రాజు
విడుదల: 9 మే 2025

శ్రీవిష్ణు సినిమాలకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. అతనిలోని హ్యూమర్ సెన్స్, ఈజ్, ఉన్నంతలో కథలో కూడా ఏదో ఒక మేటర్ ఉంటాయని నమ్మకం. అదే లెక్కలో ఆకట్టుకునే టీజర్ తోనూ, తర్వాత పర్వాలేదనిపించే ట్రైలర్ తోనూ “సింగిల్” గా పలకరించాడు. సరే, విషయమేంటో చూదాం.

విజయ్ (శ్రీవిష్ణు) ఒక బ్యాంక్ ఉద్యోగి. బాల (వెన్నెల కిషోర్) అతని కొలీగ్. ఎన్నేళ్ళైనా జీవితానికి అమ్మాయికి దొరక్క ఎప్పటికప్పుడు ట్రై చేసి విఫలమయ్యే కేరెక్టర్ విజయ్ ది. ఆ క్రమంలో అతనికి పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయి తారసపడుతుంది. హీరోగారు మనసు పారేసుకుంటాడు. ఆమె ఒక కార్ షోరూం లో సేల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటుంది. ఆమెని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. కానీ అనుకోకుండా హరిణి (ఇవాన) అనే మరొక అమ్మాయి విజయ్ నచ్చి, అతనిని ఇంప్రెస్ చేసే పనిలో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎటు వెళ్తుంది అనేదే కథనమంతా.

ఇది నిజానికి పెద్దగా కథాబలం లేని కథనం. కథలో బరువు లేనప్పుడు కథనాన్ని చాలా హ్యూమర్ తో నడిపించాలి. ఆ ప్రయత్నం అయితే జరిగింది కానీ ఫలితమే ఆశించినట్టుగా లేదు.

హ్యూమర్ కి కావాల్సిన డైలాగ్స్ లేవా అంటే.. ఉన్నాయి. ఆర్టిస్టుల టైమింగ్ తేడా కొట్టిందా అంటే…అదీ కాదు. మరి లోపమెక్కడుంది అంటే..ఆడియన్స్ ని పూర్తిగా నెరేటివ్ లోకి లాక్కుపోయే సాంకేతికత లేకపోవడం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరమ వీక్ గా ఉంది. ఈ జానర్ సినిమాలకి స్టైలిష్ ఎడిటింగ్ ఉండాలి..”మత్తు వదలరా” టైపులో. అది లేదు. ఇక సెకండాఫులో రాజేంద్రప్రసాద్ ట్రాక్ పూర్తిగా నాన్-సింక్ గా, చిరాకుగా ఉంది.

ఒక ఉదాహరణతో చెప్పాలంటే, పాయసం వండడానికి డిసైడైతే అందులో ఉప్పు, కారం కలిపే ప్రయత్నం చేయకూడదు. కానీ ఇక్కడ హ్యూమర్ నెరేటివ్ కి డిసైడ్ అయ్యి సెకండాఫులో సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి రసాభాస చేసారు.

పైగా సినిమా మొత్తం శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ మీదే నడుస్తుంటుంది. ఫుల్ లెంగ్త్ సైడ్ కిక్ గా వెన్నెల కిషోర్ ఒక స్థాయి దాటి ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏదో సెకండాఫులో కాసేపు వచ్చి వెళ్లిపోయే పాత్ర అయితే ఓకే కానీ, పూర్తిగా అతని భుజాలమెద పెట్టి కామెడీని పండించమంటే కష్టమనిపించే రోజులొచ్చాయి. ప్రస్తుతానికి సత్య పూర్తి నిడివిగల కామెడీని మోయగలిగే స్థితిలో ఉన్నాడు. కానీ తనని చివర్లో ఒక చిన్న గెస్ట్ రోల్ కి పరిమితం చేసారిందులో.

పాటల పరంగా కూడా ఇది చాలా వీక్ అనిపించే సినిమా. ఎందుకంటే అన్నీ బిట్ సాంగ్స్ లాగానే ఉన్నాయి. మొదటి పాట “వెయ్యిన్నొక్క జిల్లాల వరకు….” స్టైల్లో ఉంది వినడానికి. టైటిల్ సాంగైతే పరమ రొటీన్ గా బోరింగ్ గా ఉంది.

ఇక నానా రకాల నటుల, సినిమాల రిఫెరెన్స్ లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ రోజుల్లొ వచ్చే అన్ని సినిమాలు పనిగట్టుకుని చూసే క్రిటిక్స్ కి, ఫిల్మ్ బఫ్స్ కి తప్ప అందరికీ అర్ధం కావవి. అందుకే కొందరు ఆ డైలాగ్స్ కి నవ్వుతుంటే, ఇంకొందరికి ఎందుకు నవ్వుతున్నారో అర్ధం కాక దిక్కులు చూసే పరిస్థితి.

మొత్తానికి “శివయ్యా...” అని, “మంచు కురిసిపోతుంది...” అని ట్రైలర్లో వినిపించిన డైలాగ్స్ వివాదమయ్యాక మార్చారు. “శివయ్యా..” ప్లేసులో “భగవంతుడా..” అని, “మంచు కురిసిపోతుంది..” ప్లేసులో “మట్టి కరిచిపోతుంది..” అని సెట్ చేసారు.

ఇక బాలయ్య, చిరంజీవి తరహా ఇమిటేషన్లు, వెంకటేష్ స్టైల్లో నడవడాలు ఆయా సీన్లలో బాగానే ఉన్నాయి.

ఈ చిత్రానికి టార్గెట్ ఆడియన్స్ యూత్. వాళ్లకి తగ్గట్టుగా డబల్ మీనింగ్ డైలాగ్స్, స్పూఫ్ వేల్యూ ఉన్న సింగిల్ లైనర్స్ పెట్టి ఆకర్షించే ప్రయత్నం బానే ఉంది. అంతకు మించి చెప్పుకోవడానికి పాజిటివ్స్ ఏవీ లేవు.

శ్రీవిష్ణు ఎప్పటిలాగానే మంచి ఈజ్ తో చాలా బాగా నటించాడు. వెన్నెల కిషోర్ పంచులు అక్కడక్కడ బాగున్నాయి. కేతిక ఓకే కానీ, హరిణికి నటించేందుకు మరీ పెద్ద స్కోపేమీ లేదు. విటివి గణేష్ బోర్ కొట్టాడు. రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ ఎందుకో కూడా తెలీని పరిస్థితి. సత్యది సింగిల్ సీన్ రోల్. గెస్ట్ రోల్ లో నార్నె నితిన్ కూడా కనిపించాడు.

హడావిడి క్లైమాక్స్ తో సినిమా ముగిసాక “సింగిల్ 2” అంటూ చివర్లో క్లోజింగ్ టైటిల్ వేసారు. అది వస్తుందని నమ్మకం కలగాలంటే ఈ చిత్రం టికెట్ల అమ్మకం బాగుండాలి. ఒక వేళ దీనికి సీక్వెల్ తీస్తే కచ్చితంగా కథ మీద, కథనంలో ట్విస్టుల మీద, స్టైలిష్ మేకింగ్ మీద, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద విశేషమైన దృష్టి పెట్టాలి. శ్రీవిష్ణు టైమింగుని మాత్రమే ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లకి ఇబ్బంది ఉండదు కానీ, సినిమాలో ఏదో విశేషముందని, కడుపుబ్బ నవ్వుకునే కామెడీ ఉంటుందని అనుకుంటే మాత్రం పొరపాటే. అలా వెళ్లే వాళ్లు లైట్ కామెడీతో మాత్రమే సరిపెట్టుకోవాలి.

బాటం లైన్: లైట్

10 Replies to “#Single Review: మూవీ రివ్యూ: సింగిల్”

  1. శ్రీ విష్ణు ఈ మూవీ లో మంచి నటన ప్రదర్శించాడు మూవీ మంచి గానే వుంది

  2. సినిమా అందరూ బాగుందంటున్నారు నువ్వేంటి ఇలా రాశావు ఆమ్యామ్యా ముట్ట లేదా? 

  3. better stop RP to take  in any movie and stop taking vennela kishore. you are right satya is doing really great job as comedian he should be given more chances 

  4. It is not a Good review. The movie is out and out comedy. Simple story and except songs, you dont get bored anywhere.

    Decided to not depend on reviews (except below 2). Please inform your team to watch 2/3 times/members and write review.

Comments are closed.