రివ్యూ: జత కలిసే
రేటింగ్: 2.5/5
బ్యానర్: యుక్త క్రియేషన్స్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: అశ్విన్, తేజస్వి మదివాడ, స్నిగ్ధ, షకలక శంకర్, సప్తగిరి, పృధ్వీ, సూర్య, ప్రియ తదితరులు
సంగీతం: ఎం.సి. విక్కీ
నేపథ్య సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
ఛాయాగ్రహణం: చీకటి జగదీష్
నిర్మాత: నరేష్ రావూరి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: రాకేష్ శశి
విడుదల తేదీ: డిసెంబరు 25, 2015
వారాహి చలనచిత్రం బ్యానర్ ఈ చిన్న సినిమాతో అసోసియేట్ అవడంతో సినీ సర్కిల్స్‌లో ఒక్కసారిగా దీనిపై ఆసక్తి ఏర్పడింది. అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న సాయి కొర్రపాటి ఎండార్స్ చేస్తున్నారంటే.. అదీ 'రాజుగారి గది' తర్వాత అనేసరికి మరింతగా దీనిపై గురి కుదిరింది. ప్రమోషన్ మెటీరియల్ కూడా మేటర్ ఉన్న సినిమా అనే నమ్మకాన్ని కలిగించింది. ఫేస్‌బుక్ చాట్ విండోలో.. ఫన్నీ కామెంట్స్‌తో టైటిల్ కార్డ్స్ పడుతోంటే.. అటు ఇవివిలోని వినోదాన్ని, ఇటు సుకుమార్‌లోని క్రియేటివిటీని కలిపి కొట్టే యువ దర్శకుడనే కాన్ఫిడెన్స్ వస్తుంది.
సరదాగా స్నేహితుల మధ్య అల్లరి సన్నివేశాలతో మొదలైన సినిమా ప్లాట్ ఏంటనేది తెలిసాక ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. తన స్నేహితురాలి పెళ్లి చెడగొట్టిన బ్యాచ్‌కి బుద్ధి చెప్పడానికి ఒక స్కెచ్ వేస్తుంది తేజస్వి. అది అమలు జరుగుతూ ఉండగా అనుకోకుండా ఆ స్నేహితుల బృందానికి లీడర్ అయిన అశ్విన్‌తో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి క్యాబ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. తనని, తన ఫ్రెండ్స్‌ని నడి బజార్లో నిలబెట్టిన అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి అశ్విన్ లోలోపల రగిలిపోతూ ఉంటాడు. పక్కనే తనతో జర్నీ చేస్తోన్న అమ్మాయిని ముగ్గులో దించడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. తన పరువు తీసిన అమ్మాయినే ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడనేది అతనికి తెలీదు. సెటప్ అంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ? దీని చుట్టూ ఫస్ట్ హాఫ్ తిరుగుతుంది కనుక దర్శకుడి పని ఈజీ అయిపోయింది. ఫ్రెండ్స్‌పై ఫన్నీ ఇన్సిడెంట్స్ సృష్టించి బాగానే నవ్వించే వీలు చిక్కింది. అలాగే ఇక్కడ హీరో హీరోయిన్లతో పాటు కీలకమైన క్యాబ్ డ్రైవర్‌గా ఒక స్టార్ కమెడియన్‌ని పెట్టుకున్నట్టయితే ఇంకాస్త ఫన్ పుట్టించడానికి స్కోపుండేది.
మగరాయడిలా కనిపించే కామెడీ నటి స్నిగ్ధ నవ్వించడానికి నానా తంటాలు పడినా మననుంచి తను ఎక్స్‌పెక్ట్ చేసే రియాక్షన్ రాబట్టుకోవడం కష్టమే పాపం. ఇక రొమాంటిక్ కామెడీ పండాలంటే లీడ్ పెయిర్‌ని సరిగ్గా ఎంచుకోవడమూ చాలా కీలకం. అశ్విన్‌ని చూస్తే ఏ యాంగిల్ నుంచి కూడా యుఎస్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ అనిపించడు. అతని బాడీ లాంగ్వేజ్‌తో పాటు అతని వేషధారణ, ఆంగ్ల ఉచ్ఛారణ.. ఏదీ కూడా తను ఎన్నారైనే అని బలవంతంగా అయినా మనల్ని మనం కన్విన్స్ చేసుకోనివ్వవు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆమె ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళుతోందని చెప్తారు. లైఫ్ ఛేంజింగ్ ఈవెంట్ అయిన దాని కోసం వెళుతూ ఎవరైనా ఏమాత్రం రిలయబుల్ కాని మార్గాన్ని ఎంచుకుంటారా? దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల జర్నీని క్యాబ్‌లో ప్లాన్ చేసుకుంటారా? అది కూడా ఎవరో అపరిచితుడితో కలిసి అంత దూరం క్యాబ్ షేర్ చేసుకుంటారా? సరే ఇలాంటి లాజిక్కులు సినిమాలకి వర్తించవు కనుక వాటిని వదిలేసినా కానీ తేజస్వి, అశ్విన్ మధ్య అస్సలు కెమిస్ట్రీ కుదర్లేదు. సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ ట్రై చేసిన విచిత్రమైన స్లాంగ్‌ని అనుకరించడానికి అశ్విన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజుగారి గది చిత్రాన్ని తనతో పాటు నడిపించడానికి చాలా ముందు ఉన్నారు కాబట్టి చెల్లిపోయింది. తన భుజాలపై ఒక సినిమాని నడిపించడానికి అశ్విన్ ఇంకా చాలా చాలా మెరుగుపడాలి.
హీరోయిన్ తన పక్కనే ఉండి తనతో, తన స్నేహితులతో ఆడుకుంటోందని హీరో తెలుసుకునే వరకు సినిమా సాఫీగానే నడిచిపోయింది. ఇంటర్వెల్‌కి ఆ అధ్యాయానికి తెర పడిన తర్వాత కథనం ఎలా నడిపించాలనే దానిపై దర్శకుడికి క్లూ లేకపోయింది. అక్కచెల్లెళ్ల మధ్య సెంటిమెంట్ యాంగిల్ పెట్టి, ఆ సమస్యని 'శంకర్‌దాదా జిందాబాద్' స్టయిల్లో హీరో డీల్ చేసే సీన్‌తో హీరో మీద హీరోయిన్‌కి ఇంప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక అక్కడ్నుంచి కామెడీ పండించడానికి వాళ్లిద్దరి మధ్య కీచులాటలకి ఆస్కారం లేదు కాబట్టి, క్యాబ్ డ్రైవర్‌గా స్నిగ్ధ ఎలాగో నవ్వించలేదు కాబట్టి షకలక శంకర్‌ని లీవ్‌లో ఉన్న దొంగ పాత్రలో క్యాబ్‌లోకి ఎక్కించి అప్పటికప్పుడు కామెడీ పుట్టించడం కష్టమన్నట్టు.. శ్రీమంతుడు-గబ్బర్‌సింగ్ స్పూఫ్ పెట్టి ఏదో ట్రై చేసారు. స్పూఫ్ చేయడం అంత ఈజీ కాదని, టైమింగ్ అద్భుతంగా కుదిరితే తప్ప అది పండదని ఈమధ్య చాలా సినిమాల్లో తేలిపోయింది. ఇందులోను ఆ స్పూఫ్ సీన్ 'తేలిపోయింది'. క్లయమాక్స్ చేర్చే ముందు హడావుడి చేయడానికని ఒక బలవంతపు యాక్షన్ సీన్ పెట్టినా ఫలితం లేకపోయింది.
ప్రామిసింగ్‌గా స్టార్ట్ అయిన జత కలిసే చిత్రం రోడ్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ జోరందుకుంటుంది. ఒక్కసారి ఇంటర్వెల్ చేరగానే బ్రేక్స్ పడిపోయి అన్ని అడ్డదారులూ తొక్కేసి చివరకు ఎలాగో గమ్యం చేరుకుంటుంది. కారులో సుదూర ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆరంభంలో సరదాగానే ఉంటుంది. కానీ సగం దూరం చేరుకున్నాకే ఇంకా అటు వెళ్లడానికైనా, వెనక్కి వెళ్లడానికైనా సగం దూరం వెళ్లాలని తెలిసొచ్చినప్పుడే విసుగు మొదలవుతుంది. ఈ చిత్రం కూడా సగం నుంచి అలాంటి బోరింగ్ రోడ్ ట్రిప్‌లానే అనిపిస్తుంది. అసలే సన్నివేశాల్లో విషయం లేక చిరాకు పుడుతోంటే సాయికార్తీక్ నేపథ్య సంగీతం లేని హంగామాని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఇరిటేట్ చేస్తుంది. లో బడ్జెట్ సినిమా కనుక క్వాలిటీ విజువల్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. అటు లీడ్ పెయిర్ సరిగ్గా కుదరక, ఇటు మేకింగ్ పరంగా క్వాలిటీ లేక, ఇంకోవైపు సగం నుంచి కథనం సరిగ్గా లేక మనం జత కట్టలేని సినిమాగా మిగిలిపోతుంది.
బోటమ్ లైన్: జత కట్టగలిగేది ఇంటర్వెల్ వరకే!
– గణేష్ రావూరి