కోన కష్టం.. పగవాడిక్కూడా వద్దు.!

ఇదివరకటి రోజుల్లో కథ ఎవరిది.? కథనం ఎవరిది.? మాటలు ఎవరు రాశారు.? వంటి వాటి గురించి పెద్దగా జనం ఆలోచించేవారు కాదు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీరి పేర్లు బయటకొచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు..…

ఇదివరకటి రోజుల్లో కథ ఎవరిది.? కథనం ఎవరిది.? మాటలు ఎవరు రాశారు.? వంటి వాటి గురించి పెద్దగా జనం ఆలోచించేవారు కాదు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీరి పేర్లు బయటకొచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు.. రచయితలూ స్టార్‌డమ్‌ సంపాదించేసుకుంటున్నారు. అలా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రచయితల్లో కోన వెంకట్‌ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. 

'కోన వెంకట్‌ అంటే ఓ బ్రాండ్‌..' అనేలా ఆయన గురించి ప్రచారం జరిగింది. కోన వెంకట్‌ కూడా తనకొచ్చిన స్టార్‌డమ్‌తో మురిసిపోయాడు. కానీ, టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ ఎప్పుడెలా ఎవరికి చుక్కలు చూపిస్తుందో చెప్పలేం. ఎత్తేస్తుంది.. ఎత్తి కుదేస్తుంది.. అదే సినీ మాయ. ఇప్పుడు కోన వెంకట్‌ పరిస్థితి ఎత్తికుదేయబడ్డ స్థితిలో వుంది. దెబ్బ మీద దెబ్బ.. వరుసగా నాలుగు దెబ్బలు తగిలేసరికి, 'బాబోయ్‌ కోన వెంకట్‌..' అంటున్నారిప్పుడు టాలీవుడ్‌లో. ఒకప్పుడు.. కోన వెంకట్‌ని ఏదో ఒక రకంగా ఒప్పించి, అతని పేరు వేసుకుందామని తహతహలాడినవారే, కోన వెంకట్‌ని ఇప్పుడు పూర్తిగా సైడేసేస్తున్నారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 

'అన్నిటికీ నన్నే అంటే ఎలా.? సినిమా ఫ్లాపయితే దానికి చాలా కారణాలుంటాయి..' అంటూ ఇప్పుడు తాపీగా కోన వెంకట్‌ సన్నిహితుల వద్ద వాపోతున్నాడు. 'బ్రూస్‌లీ' విషయంలో శ్రీనువైట్లను కోన ఏ స్థాయిలో ఏసుకున్నాడో అందరికీ తెల్సిందే. శ్రీనువైట్ల ఇప్పుడేమీ అనడంలేదు.. వస్తున్న ఫ్లాపులే కోనను కడిగి పారేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అయితే నెటిజన్లు కోన వెంకట్‌పై విరుచుకుపడ్తున్నారు. 

సినిమాలు ఫ్లాపవడం ఒక ఎత్తు.. ఆ ఫ్లాపుల పేరు చెప్పి, తనను అంతా కడిగి పారేస్తుండడం ఇంకో ఎత్తు. గోరు చుట్టు మీద రోకలి పోటు అంటే ఇదే మరి. తప్పదు, చేసుకున్నోడికి చేసుకున్నంత. స్టార్‌ హీరో రేంజ్‌లో తనను తాను ప్రమోట్‌ చేసుకున్న కోన వెంకట్‌, ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడంతే.

కొసమెరుపు: కోన వెంకట్ మీద స్ఫూఫ్ కామెడీలు వదిలేందుకు కోన బాధితులైన దర్శక నిర్మాతలు సమాయత్తమవుతున్నారట. త్వరలో ఓ సినిమాలో కోనవారి మీద సెటైర్ కనిపించబోతోందనట. అదే నిజమైతే, అది కూడా కోన నుంచి ఇన్ స్పయిర్ అయ్యిందే అనుకోవాలి.