మోహ‌న్ లాల్ ‘తుడ‌రుం’ మ‌రో ‘దృశ్యం’!

చిత్రీక‌ర‌ణ‌, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న ఈ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ వారంలో విడుద‌లైన మ‌ల‌యాళీ స్టార్ హీరో మోహ‌న్ లాల్ సినిమా తుడ‌రుం. తెలుగులో కూడా దీన్ని అనువ‌దించిన‌ట్టుగా ఉన్నారు ఇదే పేరుతో! తుడ‌రుం అంటే.. కొన‌సాగింపు అని అర్థం. మ‌రి ఇదే టైటిల్ తెలుగులో పెట్టి ఉంటే కాస్త ప్ర‌చారం అయినా ద‌క్కి ఉండేదేమో. త‌మిళ సినిమాల‌ను తెలుగులో అదే పేర్ల‌తో విడుద‌ల చేస్తున్న‌ట్టుగా మ‌ల‌యాళీ సినిమాల‌ను కూడా అదే పేర్ల‌తో వ‌ద‌ల‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం అయితే ఉండ‌దు. క‌నీసం టైటిల్ తో క‌నెక్ట్ అయ్యే వాళ్లు కొంత‌మంది అయినా దాన్ని బ‌ట్టి థియేట‌ర్ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. మ‌ల‌యాళ, త‌మిళ‌ య‌థాత‌థ టైటిళ్ల‌లో విడుద‌ల వ‌ల్ల అణాపైసా ఉప‌యోగం అయినా ఉండ‌దు. అయినా ఈ ధోర‌ణి క‌న‌బ‌డుతూ ఉంది అనువాద నిర్మాత‌ల వ‌ద్ద‌!

ఆ సంగ‌త‌లా ఉంటే.. అస‌లు మల‌యాళీల‌కు ఇన్నిన్ని థ్రిల్ల‌ర్ సినిమాల‌కు క‌థాంశాల ఐడియాలు ఎలా వ‌స్తున్నాయ‌నే అభిప్రాయం క‌లుగుతుంది ఈ సినిమా చూశాకా! ఒక‌వైపు కాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్లు వ‌ర‌స పెట్టి వస్తూనే ఉంటాయ‌. మ‌ధ్య మ‌ధ్య‌లో కిష్కింద‌కాండం, సూక్ష్మ‌ద‌ర్శిని వంటి సినిమాలకు లోటు ఉండ‌దు. దృశ్యం స్ఫూర్తితో కిష్కింద‌కాండం, సూక్ష్మ‌ద‌ర్శిని వంటి సినిమాలు వ‌చ్చాయ‌నుకుంటే.. దృశ్యం సినిమా క‌థ‌నే కాస్త అటుగా ఇటుగా చేసి.. మునివేళ్ల‌పై నిల‌బెట్టే థ్రిల్ల‌ర్ ను తీయొచ్చ‌ని ఈ తుడరుం నిరూపిస్తంది!

మోహ‌న్ లాల్ హీరోగా వ‌చ్చిన దృశ్యం దాని సీక్వెల్ ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. దానికి మూడో పార్టును కూడా ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. తుడ‌రుం చూస్తే.. దృశ్యం సినిమా చాలా సార్లు గుర్తుకు వ‌స్తుంది. అయితే ఇది చాలా ప్ర‌త్యేకం ఇదే స‌మ‌యంలో! దృశ్యం త‌ర‌హాలో ఈ సినిమాలోనూ మోహ‌న్ లాల్ ఒక బాధిత కుటుంబ పెద్ద‌గా నిలుస్తాడు. అయితే ఇందులో హీరోయిజం పోక‌డ‌లుంటాయి. దృశ్యం ఒక రియ‌ల్ టైమ్ క్రైమ్ స్టోరీలాంటిది అయితే, తుడ‌రం ప‌గా, ప్ర‌తీకారంతో కూడిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. దృశ్యంలో మోహ‌న్ లాల్- మీనా చేసిన దంప‌తుల పాత్ర‌ల‌కు ఇద్ద‌రు కూతుళ్ల పాత్ర‌లుంటే, ఇందులో మోహన్ లాల్- శోభ‌న దంప‌తుల‌కు ఒక కొడుకు, ఒక కూతురు పాత్ర‌లుంటాయి.

షణ్ముగం అలియాస్ బెన్స్(మోహ‌న్ లాల్) ఒక ట్యాక్సీ డ్రైవ‌ర్. క‌నీసం ట్యాక్సీ ప‌ర్మిట్ కూడా ఉండ‌దు, త‌న‌కంటూ మిగిలిన ఒక పాత అంబాసిడ‌ర్ కారును ఊళ్లో పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు దింపేందుకు, ఎవ‌రైనా టూర్ కు పిలిస్తే వారికి రెంట్ కు వెళ్తూ వ‌చ్చిన సంపాద‌న‌తో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ‌మే అయినా జీవితంలో ఎదురుదెబ్బ‌లున్నా.. ఆనందంగా గ‌డిపే కుటుంబం.

ష‌ణ్ముగం పూర్వాశ్ర‌మంలో ఒక ఫైట్ మాస్ట‌ర్ కు అసిస్టెంట్. చెన్నైలో ఒక ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ (భార‌తి రాజా) వ‌ద్ద ప‌ని చేసి ఉంటాడు. అక్క‌డ ఒక ఫైట్ చిత్రీక‌ర‌ణ‌లో ఇత‌డిని కాపాడ‌బోయి ఒక స‌హ‌చ‌రుడు మ‌ర‌ణించి ఉంటాడు. ఆ పాత్ర‌ను ఫోటోలో మాత్ర‌మే చూపుతారు, ఆ పాత్ర‌కు విజ‌య్ సేతుప‌తి ఫొటో వాడారు. క‌థాగ‌మ‌నంలో తెలిసేది ఏమిటంటే.. ఆ మ‌ర‌ణించిన మ‌రో ఫైట‌ర్ భార్య శోభ‌న‌. అత‌డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. అండ లేకుండా పోయిన కుటుంబానికి ష‌ణ్ముగం తోడ‌వుతాడు. వారు భార్యాభ‌ర్త‌లై ఉంటారు.

ఇలా సాగిపోయే బెన్స్ కు త‌న ఒక‌ప్ప‌టి గురువైన ఫైట్ మాస్ట‌ర్ చ‌నిపోయాడ‌నే వార్త తెలిసి చెన్నై వెళ్తాడు. ఆ వెళ్ల‌డానికి ముందు త‌న కారు చిన్న రిపేర్ రావ‌డంతో.. రెగ్యుల‌ర్ గ్యారేజ్ లోనే ఇచ్చి వెళ్లి ఉంటాడు. అత‌డు తిరిగి వ‌చ్చే స‌రికి కారు పోలిస్ స్టేష‌న్ లో ఉంటుంది! ఈ విష‌యం తెలిసి రావ‌డంతోనే స్టేష‌న్ కు వెళ్తాడు. ఆ గ్యారేజ్ లో ప‌నిచేసే ఒక కుర్రాడు గంజాయి స్మ‌గ్లింగ్ చేయ‌డానికి వెళ్లి గ్యారేజ్ లో రిపేర్ కు వ‌చ్చిన కారును తీసుకెళ్లి ఉంటాడు. అత‌డిని పోలీసులు వెంబ‌డించగా.. కారును వ‌దిలి పారిపోయి ఉంటాడు. పోలీసులు కారును స్టేష‌న్ లో పెడ‌తారు. పారిపోయిన వాడు ఒక ఎస్ఐని కొట్టి మ‌రీ పారిపోయి ఉంటాడు. దీంతో పోలీసులు క‌సిగా ఉంటారు.

వారిని బ‌తిమాలి, బుజ్జ‌గించుకుని ఆ కారును విడిపించుకోవ‌డానికి ష‌ణ్ముగం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వుతాయి. ఎస్ఐ అడిగినంత డ‌బ్బును ఇత‌డు ఇవ్వ‌లేడు. అయితే ఆ రాత్రికి డీవై ఎస్పీ స్టేష‌న్ కు వ‌స్తాడ‌ని తెలిసి.. రాత్రిపూట స్టేష‌న్ కు వెళ్తాడు. వెళ్ల‌గానే అత‌డు కూల్ గా మాట్లాడి.. కారు కీస్ ఇచ్చేయ‌మ‌ని ఎస్ఐకి చెబుతాడు. ఎస్ ఐ కూడా చేసేది లేక కారు కీస్ ఇస్తాడు. అయితే అదే స‌మ‌యంలో స్టేష‌న్ లో ప‌ని చేసే ఒక కానిస్టేబుల్ చెల్లెలి పెళ్లి ఉంద‌ని, త‌మ‌కు మ‌రే వాహ‌నం లేద‌ని.. త‌మ‌ను అక్క‌డ వ‌ద‌ల‌మ‌ని డీవై ఎస్పీ కోర‌డంతో.. బెన్స్ కాదన‌లేక‌పోతాడు.

త‌న‌కు కారును ఇప్పిస్తున్నాడు క‌దా అనే మొహ‌మాటంతో ఒప్పుకుంటాడు. ఆ పెళ్లికి వెళ్తే.. అక్క‌డ ఈ పోలీసులు తాగితంద‌నాలు ఆడ‌తారు. మ‌రింత‌గా తాగ‌డానికి అడ‌విలోకి తీసుకెళ్ల‌మ‌ని బెన్స్ పై ఒత్తిడి చేస్తారు. అక్క‌డ కూడా కాద‌న‌లేక కారును తీయ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది! కొంత దూరం వెళ్లాకా.. కారు డిక్కీలో శ‌వం ఉంద‌ని, పెళ్లి వేడుక స‌మ‌యంలో దాన్ని డిక్కీలో చేర్చిన‌ట్టుగా.. అడ‌విలో దాన్ని పాతి పెట్టాల‌ని , ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్పొందంటూ వారు ట్విస్ట్ ఇవ్వ‌డంతో బెన్స్ నిర్ఘాంత‌పోతాడు! పోలీసుల చెప్పిన‌ట్టుగా చేయ‌డం మిన‌హా అత‌డికి మ‌రో మార్గం ఉండ‌దు. అప్ప‌టి వ‌ర‌కూ మెత్త‌గా కనిపించే డీవై ఎస్పీ క్రౌర్యంలో తొలి మెట్టు అక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుంది. కానిస్టేబుల్ చెల్లెలిని ఒక కుర్రాడు బ్లాక్ బెయిల్ చేశాడ‌ని, వీడియోలు ఉన్నాయ‌ని, దీంతో కానిస్టేబుల్ తండ్రి అత‌డిని చంపిన‌ట్టుగా బెన్స్ కు ఆ పోలీసు చెబుతాడు.

అయితే.. ఆ త‌ర్వాత చాలా ట్విస్టుల‌తో సినిమా సాగుతుంది. ఆ శవం ఎవ‌రిది, దాంతో బెన్స్ కు సంబంధం ఏమిటి? ఆ మ‌ర్డ‌ర్ ఆ త‌ర్వాత ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది, బెన్స్ ఎలా ఇక్క‌ట్ల పాల‌వుతాడు, వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగ‌తా క‌థ‌!

సుదీర్ఘ‌మైన క‌థ‌. ప్ర‌తి పాత్ర‌కూ ఒక నేప‌థ్యం ఉంటుంది. వాటినంతా చెప్పుకుంటూ వ‌చ్చి.. ఇంట‌ర్వెల్ వ‌ద్ద అస‌లు క‌థ మొద‌లు పెడ‌తారు. మ‌రి ఈ క‌థ ఇంట‌ర్వెల్ ద‌గ్గ‌ర నుంచి మొద‌లుపెట్టొచ్చు క‌దా.. అని మొద‌ట అనుకుంటాం. అయితే.. క్లైమాక్స్ లో రివీల్ చేసే అనేక ట్విస్టుల‌కూ.. ఇంట‌ర్వెల్ ముందు చెప్పే సుదీర్ఘ‌మైన నేప‌థ్యానికి ముడి ఉంటుంది. ఒక ద‌శ‌కు వ‌చ్చాకా ఎక్స్ పెక్ట్ చేయ‌గ‌ల క‌థే అయినా.. కొంచెం కొంచెం స‌స్పెన్స్ ను రివీల్ చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లేను ప్ర‌శంసించ‌క త‌ప్ప‌దు! ఒకే సారి ప్లాట్ ట్విస్ట్ లా కాకుండా.. కొంచెం కొంచెంగా ముడివిప్పే సినిమాలు ఎక్కువ‌గా థ్రిల్ ను ఇస్తాయి. ఈ సినిమా అదే కోవ‌కే చెందుతుంది.

చిత్రీక‌ర‌ణ‌, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న ఈ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ప్ర‌త్యేకించి భావోద్వేగ‌పూరిత‌మైన స‌న్నివేశాలు చ‌లింప‌జేసే స్థాయిలో ఉంటాయి. మోహ‌న్ లాల్, శోభ‌న‌ల న‌ట‌నాప‌టిమ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరితో పాటు.. డీవై ఎస్పీ క్యారెక్ట‌ర్ చేసిన న‌టుడు ప్రేక్షకుల్లో క‌ల‌వ‌రం పుట్టిస్తాడు. అంత క‌ర్క‌శ ప్ర‌ద‌ర్శ‌న‌తో భ‌య‌పెడ‌తాడు. ఇతడికి ఇదే తొలి సినిమా అని తెలుస్తుంది. స్వ‌త‌హాగా ఇత‌డు యాడ్ ఫిల్మ్ మేక‌ర్ అట‌. వొడాఫోన్ జూజూ యాడ్స్ ను రూపొందించిన ద‌ర్శ‌కుడు ఇత‌డేన‌ట‌. న‌వ్వుతూ, ప‌ర‌మ సాత్వికంగా ప‌రిచ‌యం అయ్యే ఈ పాత్ర తెలుగు దృశ్యం సినిమాలో ర‌వి కాలే చేసిన పాత్ర‌కు ప‌ది రెట్ల క్రౌర్యం ప్ర‌ద‌ర్శిస్తుంది!

కొన్ని రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి రావొచ్చు. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ లో ఈ సినిమా చూడ‌టం ఎలాంటి నిరాశ‌నూ క‌లిగించ‌క‌పోగా, ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని మిగులుస్తుంది.

-జీవ‌న్

9 Replies to “మోహ‌న్ లాల్ ‘తుడ‌రుం’ మ‌రో ‘దృశ్యం’!”

  1. Ohh! Looking at this article I went and watched this movie. This is not so good movie and not even one magical moment. This is thousands of miles away from Drishyam series moviea. Malayalam movies in general are good, but don’t praise every movie. This has taken the malayalam industry a decade back.

    Not worth movie, don’t watch it. 

    1. First, I thought of watching the movie. But, after the article praised a headache inciting extremely boring movie like KISHKINDHA KAANDAM made me drop my plan of watching this movie

Comments are closed.