ఈ వారంలో లూసీఫర్ సీక్వెల్ ఎంపురాన్ ఓటీటీలోకి వచ్చింది. విశేషం ఏమిటంటే.. ఆ సినిమా అలా ఓటీటీలోకి రాగానే.. థియేటర్లోకి మోహన్ లాల్ సినిమా ఒకటి విడుదలైంది. మార్చి 27వ తేదీన ఎల్ 2 విడుదల అయ్యింది. తుడరం అనే సినిమా ఏప్రిల్ 25 వ తేదీన విడుదల అయ్యింది!
సరిగ్గా చెప్పాలంటే.. 30 రోజుల్లోపే ఈ స్టార్ హీరోకి సంబంధించి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే ఇది కొత్త ఏమీ కాదు మలయాళీ స్టార్ హీరోలకు. ఈ వయసులో కూడా ఇన్ని వందల సినిమాలను చేసిన తర్వాత మమ్ముట్టీ, మోహన్ లాల్ లు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు అలవోకగా విడుదల చేస్తూ ఉంటారు!
మరి అసలు కథల గురించి పట్టించుకోకుండా సినిమాలు తీస్తారా.. అంటే అదేం కాదు! ఎప్పటికప్పుడు కొత్త తరహా కథ, కథనాలతో రావడమే వీరి ప్రత్యేకత! అయినప్పటికీ ఏడాదికి మినిమం నాలుగు సినిమాలు ప్లాన్ చేసి, వాటిని విడుదల చేసుకుంటూ, వాటితో హిట్లను కూడా కొడుతూ, తమ స్టార్ డమ్ ను కాపాడుకుంటూ రావడం నిజంగా చాలా గొప్ప సంగతి. ప్రత్యేకించి తెలుగునాట స్టార్ హీరోలు అంటే.. ఏడాదికి లేదంటే రెండేళ్లు, అదీ కాదంటే మూడు నాలుగేళ్లు.. ఒక్క సినిమా వస్తే అది చాలా చాలా గొప్ప సంగతి!
అలా రెండేళ్లకు ఒక సినిమా విడుదల చేస్తే.. అప్పుడు అభిమానుల, ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టేలా వెయ్యి రూపాయల టికెట్ తో రెండు మూడు రోజుల పాటు వసూళ్లను చూపించుకోవచ్చు! ఇలా నెలకు ఒక సినిమా విడుదల చేస్తే.. తెలుగు సినిమాలను వెయ్యి, రెండు వేల రూపాయల టికెట్ ధరలను పెట్టి చూసే నాథుడు కూడా ఉండడు కాబోలు. అయితే అలా అంటే ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడమే అవుతుంది.
నెల రోజుల కిందట లూసీఫర్ టూ భారీ అంచనాల మధ్య విడుదలైతే మలయాళీలు థియేటర్లకు క్యూలు కట్టారు. ఆ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికే తుడరుం డేట్ ను ప్రకటించారు. ప్రచారం పూర్తయ్యింది, ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో.. బెంగళూరు వంటి నగరంలో కూడా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ కనిపిస్తున్నాయి! లూసీఫర్ 2 మలయాళ వెర్షన్ కు అంచనాలతో థియేటర్లు నిండితే తుడరుంకు టాక్ తో థియేటర్లు నిండుతూ ఉన్నాయి! ఈ ఏడాదిలో ఇప్పటికే మోహన్ లాల్ సినిమాలు రెండు విడుదల అయ్యాయి తుడరుంతో కలిపి.
ఇక ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న, పోస్ట్ ప్రొడక్షన్ దశలో మరో మూడు సినిమాలున్నాయి. ఇవన్నీ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. వచ్చే ఏడాదికి కూడా ఒక సినిమాను ఇప్పటికే డేట్ కు ప్రకటించి పని చేస్తున్నాడు ఈ హీరో! ఇలా ఒకే సారి మినిమం అరడజను సినిమాలను సెట్స్ మీద పెట్టి.. వరస పెట్టి విడుదలలు చేసుకుంటున్నారు. గత కొంతకాలంలో మలయాళీ సినిమాలు కలెక్షన్ల విషయంలో కూడా తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సవాళ్లు విసురుతున్నాయి! తెలుగు వాళ్ల జనాభాను, మలయాళీల జనాభాను పోల్చి చేసినా.. వాటికి వస్తున్న కలెక్షన్లు మరీ తక్కువేం కాదు!