Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కుమారి 21ఎఫ్‌

సినిమా రివ్యూ: కుమారి 21ఎఫ్‌

రివ్యూ: కుమారి 21ఎఫ్‌
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: పిఏ మోషన్‌ పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌
తారాగణం: రాజ్‌ తరుణ్‌, హెబా పటేల్‌, నోయల్‌, సుదర్శన్‌, నవీన్‌ నేని, తాగుబోతు రమేష్‌, హేమ తదితరులు
సంభాషణలు: పొట్లూరి వెంకీ
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: అమర్‌ రెడ్డి
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: విజయ్‌ప్రసాద్‌ బండిరెడ్డి, థామస్‌ రెడ్డి
కథ, కథనం: సుకుమార్‌
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌
విడుదల తేదీ: నవంబరు 20, 2015

సుకుమార్‌ సినిమాల్లో ఎప్పుడూ రొటీన్‌కి భిన్నమైన ఆలోచనలే కనిపిస్తుంటాయి తప్ప రెగ్యులర్‌ కథలు కానరావు. ఏదైనా కొత్తగా ఉండాలని తపన పడే సుకుమార్‌ తనే నిర్మాతగా మారి ఒక సినిమా తీసాడంటే తప్పకుండా అందులో వైవిధ్యం ఒక పిసరంత ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. 'కుమారి 21ఎఫ్‌'లో సుకుమార్‌ నుంచి మనం ఊహించే దానికంటే కాస్త ఎక్కువ సంచలనం, కాస్త ఎక్కువ ఆశ్చర్యం, కాస్త ఎక్కువ వైవిధ్యం ఉన్నాయి. ఇది సగటు తెలుగు సినిమా కాదు. సగటు సోకాల్డ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అసలే కాదు. బోల్డ్‌ సినిమా. బోల్డ్‌ అంటే అలాంటిలాంటి బోల్డ్‌ కాదు... పలక తీసుకుని అదే పనిగా ఒకే అక్షరాన్ని దిద్దీ, దిద్దీ బలపం అరిగిపోతే వచ్చేటంత బోల్డ్‌ సినిమా! 

ప్రేమలో పడ్డ టీనేజ్‌ అబ్బాయిలు కొందరు తమ ప్రేయసి తనతోనే ముందుగా ప్రేమలో పడిందా లేక ముందే ఏవైనా అనుభవాలున్నాయా అనే సంఘర్షణకి గురవుతారు. ఆ సంఘర్షణనే సుకుమార్‌ కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఒక అమ్మాయి వేషధారణ, సామాజిక పరమైన నడవడికని బట్టి 'క్యారెక్టర్‌'ని తూకమేసే చదువుకున్న బడుద్దాయిలు మనకి అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి సెన్సిటివ్‌ ఇష్యూని సుకుమార్‌ కథగా మలిచాడు. అబ్బాయిలతో ఫ్రెండ్‌ అంటూ చనువుగా తిరిగేసి, ఎంత రాత్రయినా ఎలాంటి బెరుకు లేకుండా వెళ్లేసి వచ్చేసే కుమారి (హెబా పటేల్‌) ఒక మామూలు కుర్రాడు సిద్ధుని (రాజ్‌) ప్రేమిస్తున్నానంటుంది. అతనికీ ఆమె నచ్చుతుంది. కానీ ఆమె తననే ప్రేమిస్తుందా లేక తాను ప్రేమిస్తున్నానని చెప్పుకు తిరిగే చాలా మందిలో తానూ ఒకడా? తనకున్న సందేహాలు చాలవన్నట్టు ఆమె బిహేవియర్‌ దృష్ట్యా కుమారి 'కన్య' కాదని సర్టిఫై చేసేస్తారు స్నేహితులు. తప్పని పరిస్థితుల్లో ఆమె క్యారెక్టర్‌కి టెస్ట్‌ పెట్టాలని చూస్తాడు. నన్ను ప్రేమించేంత పరిపక్వత నీలో వచ్చినప్పుడు చూద్దామంటూ సిద్ధూని కడిగేస్తుంది. కుమారికి తనకి తెలియని గతం ఒకటుందని తర్వాత తెలుస్తుంది. ఇంతకాలం తనని మోసం చేసిందని సిద్ధు ఊగిపోతాడు. అతను రియలైజ్‌ అయ్యేలోగా ఒక అనర్ధం జరిగిపోతుంది. కానీ కుమారి కోరుకున్న పరిపక్వతని మించి మెచ్యూరిటీ చూపిస్తాడు. 

కొన్ని కథలు ఊహలోకి వస్తేనే 'చూస్తారా లేదా' అనే సందేహం దాటి ముందుకు కదలవు. కానీ సుకుమార్‌ అలాంటి ఒక కథని ఊహించాడు, రాసాడు, తనే నిర్మాతగా మారి తెరకెక్కించాడు కూడా! 'కుమారి' చిత్రానికి రచయితగా సుకుమార్‌ తన మెచ్యూరిటీ లెవల్స్‌ చూపించాడు. ఇందులో హీరో ఒక మాదిరి లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ కాలనీలో ఉంటాడు. కనీస అవసరాలు కూడా సరిగా లేని ఆ కాలనీలో పెరిగిన కుర్రాళ్లు చాలా ఈజీగా క్రైమ్‌కి అలవాటు పడతారనేది చెప్పకనే చెప్తాడు. ఏటీమ్‌ల వద్ద దొంగతనాలకి పాల్పడే స్నేహితుల బృందంతో కలిసి తిరిగే హీరో వారి దగ్గర్నుంచి షేర్‌ కూడా తీసుకుంటూ ఉంటాడు. తను చేసేదీ, తిరిగేదీ అంతా తప్పే అయినా కానీ తనని ప్రేమించే అమ్మాయి మాత్రం పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు. 

కుమారి అయితే తనకి ఎంత 'రేటు' పలుకుతుందో హీరోనే అడుగుతుంది. అతనితో కలిసి చాలా క్యాజువల్‌గా మందు కొడుతుంది. అంతే క్యాజువల్‌గా పెదాలపై ముద్దులు కూడా పెట్టేస్తుంది. తనని ప్రేమించడం వల్లే ఇదంతా చేస్తుందని అనుకునేంత మెచ్యూరిటీ హీరోకి లేకపోవడం వల్ల క్యారెక్టర్‌లెస్‌ అనేసుకుని పొరపడతాడు. ఆమె ప్రవర్తన, వేషధారణ అతని అనుమానాలకి ఆజ్యం పోస్తాయి. కానీ సరిగ్గా గమనిస్తే కుమారి ఎక్కడా హీరోతో తప్ప ఎవరితోను చనువుగా మూవ్‌ అవదు. ఎవరి దగ్గర లూజ్‌గా మాట్లాడదు. పక్షవాతంతో కుర్చీలో పడి ఉన్న తాతతో జోక్‌లు వేస్తుందీ, హీరో దగ్గర ఫిల్టర్‌ లేకుండా మాట్లాడేస్తుంది తప్ప మిగిలిన ఎవరి దగ్గరా 'లూజ్‌'గా బిహేవ్‌ చేయదు. ఆర్టిస్ట్‌ ఒక బొమ్మ గీస్తున్నప్పుడు దానిని స్టార్టింగ్‌లో చూస్తే ఏవో పిచ్చిగీతల్లా అనిపిస్తాయి. బొమ్మ పూర్తయితే తప్ప దాని అసలు అందం ఏంటనేది తెలీదు. కుమారి క్యారెక్టర్‌ స్కెచ్‌ని ఒక ఆర్టిస్ట్‌ మాదిరిగా తీర్చిదిద్దాడు సుకుమార్‌. ఆ పాత్ర ఏంటనేది పరిపూర్ణంగా తెలిసాక కానీ ఆమె ఏంటనేది అర్థం కాదు. అయితే హీరోతో పాటు ప్రేక్షకులకి కూడా 'కుమారి'ని 'లవ్‌ చేయాలా వద్దా' అనే అనుమానాన్ని అలాగే ఉంచాలని ఆమెతో గీత దాటించి మాట్లాడించడం, ప్రవర్తించడం చేయించారు. కుమారి ఏంటనేది హీరోతో పాటే చూసేవాళ్లకీ ఒక్కసారే క్లారిటీ వస్తుంది.

ఇలాంటి కథకి ఎలాంటి క్లయిమాక్స్‌ అయితే పర్‌ఫెక్ట్‌ అనిపిస్తుందో అదే ముగింపునిచ్చాడు సుకుమార్‌. ఈ విషయంలో మెజారిటీ ప్రేక్షకుల ఆమోదం ఉంటుందా లేదా అనేది ఆలోచించకుండా కథౌచిత్యానికే ప్రాధాన్యమిచ్చి తాను మిగిలిన వారి కంటే చాలా భిన్నమని మరోసారి చాటుకున్నాడు. హీరో పేరెంట్స్‌ త్రెడ్‌ ద్వారా హీరోకి రియలైజేషన్‌ వచ్చే సీన్‌ని సృష్టించి 'కుమారి'కి సుకుమార్‌ ఇచ్చిన రైటర్‌ 'టచ్‌' సూపర్బ్‌ అనిపిస్తుంది. అలాగే హీరోయిన్‌ కోరుకునే మెచ్యూరిటీకి మించిన మెచ్యూరిటీని హీరో చూపించడమనే థాట్‌కి సుకుమార్‌ హేట్సాఫ్‌ చెప్పాలి. అందరికీ ఆమోదయోగ్యం కాని దానిని ఆమోదించేలా చేయడంలోనే ఒక రచయిత గొప్పతనం దాగి ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఉత్తమోత్తమ రచయితల్లో సుకుమార్‌కి సముచిత స్థానం ఇస్తుంది కుమారి. ఈ కథని ఇంకాస్త అండర్‌ ప్లే చేస్తూ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చెప్పి ఉండొచ్చు. 'అడల్ట్‌ సినిమా' ముద్ర పడకుండా కనీసం 'పీజీ (యు/ఏ)' స్థాయి కంటెంట్‌తో అయినా సరిపెట్టి ఉండొచ్చు. అయితే ఫక్తు అడల్ట్‌ సినిమా మాదిరిగానే డీల్‌ చేయడం వల్ల కుమారి మెజారిటీ ఆడియన్స్‌కి రీచ్‌ కాకపోవచ్చు. 

రాజ్‌ తరుణ్‌ తన పాత్రకి అతికినట్టు సరిపోయాడు. ఆ పాత్రకి కావాల్సిన భావోద్వేగాలని చాలా అలవోకగా పలికించేసి తన ప్రతిభ చాటుకున్నాడు. హెబా పటేల్‌కి అలవాటు పడడానికి కాస్త టైమ్‌ పడుతుంది. ఒక్కసారి అలవాటయ్యాక ఆమె బాగానే అనిపిస్తుంది. నోయల్‌ నటన ఆకట్టుకుంటుంది. హేమ తను చేసే పాత్రలకి భిన్నమైన సాత్విక పాత్రలో కొత్తగా కనిపిస్తుంది. హీరో స్నేహితుల బృందంలో సుదర్శన్‌ తన మార్కు యాస డైలాగులతో నవ్విస్తాడు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ప్రత్యేకించి ఆ వయొలిన్‌ థీమ్‌ విశేషంగా మెప్పిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. దర్శకుడు సూర్య ప్రతాప్‌ కథలోని సోల్‌ని క్యారీ చేయగలిగాడు. ప్రతాప్‌ బాగానే హ్యాండిల్‌ చేసినా కానీ ఇది సుకుమార్‌ తీసి వుంటే ఇంకెలా ఉండేదో అనే ఆలోచన అయితే రాకపోదు. 

తమిళంలో తప్ప తెలుగులో ఇలాంటి బోల్డ్‌ ఎటెంప్ట్స్‌ ఎందుకు చేయరనే వారికి కుమారి 21ఎఫ్‌ సమాధానంగా నిలుస్తుంది. యూనివర్సల్‌ అప్పీల్‌ లేకపోవడం, అక్కడక్కడా బోల్డ్‌నెస్‌ పేరిట బోర్డర్లు దాటడం తప్పిస్తే 'కుమారి 21ఎఫ్‌' ఒక సంచలనాత్మక చిత్రంగా మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. 

బోటమ్‌ లైన్‌: సుకుమార్‌ 'పెన్‌'సేషన్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?