సినీ స్నిప్పెట్స్‌: దిలీప్‌, సైరా, రాజేంద్ర కుమార్‌

దిలీప్‌ కుమార్‌ రొమాంటిక్‌ హీరోగా, అందునా విషాదాంత హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాటి పాత్రలంటే స్త్రీ ప్రేక్షకులకే కాదు, నటీమణులకు కూడా క్రేజ్‌. పెళ్లి చేసుకోమంటూ దిలీప్‌ వెంట ఎందరో నటీమణులు పడ్డారు.…

దిలీప్‌ కుమార్‌ రొమాంటిక్‌ హీరోగా, అందునా విషాదాంత హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాటి పాత్రలంటే స్త్రీ ప్రేక్షకులకే కాదు, నటీమణులకు కూడా క్రేజ్‌. పెళ్లి చేసుకోమంటూ దిలీప్‌ వెంట ఎందరో నటీమణులు పడ్డారు. ఇతను ఎవరినీ పెళ్లి చేసుకోకుండా చాలాకాలం కథ నడిపాడు. చివరకి సైరా బానుని చేసుకోవలసి వచ్చింది. అదీ ఓ తమాషా పరిస్థితుల్లో! 

 ''జంగ్లీ'' సినిమాలో షమ్మీ పక్కన హీరోయిన్‌గా వేసిన సైరా బానుకు అదే తొలి సినిమా. సైరా బాను తల్లి నసీం బాను కొన్ని 1930, 40లలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ గా వేసింది. భర్త మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌ తో కలిసి తాజ్‌మహల్‌ పిక్చర్స్‌ అని ఓ సంస్థ నెలకొల్పింది. వీరిద్దరికీ ఒక కూతురు (సైరా), ఒక కొడుకు ( సుల్తాన్‌). దేశవిభజన వీరిద్దరి మధ్య విభజనను కొని తెచ్చింది. ఎహ్‌సాన్‌ పాకిస్తాన్‌ తరలిపోయాడు. నసీం యిక్కడే వుండిపోయింది.  కొంతకాలానికి పిల్లలతో సహా నసీం లండన్‌లో పదేళ్లు వుంది. కొన్నాళ్లకి 1959లో ఇండియాకు తిరిగి వచ్చి 18 యేళ్ల కూతురును సినిమాల్లో ప్రవేశపెట్టింది. సైరా బాను తొలి సినిమా ''జంగ్లీ'' (1961). హీరో షమ్మీ కపూర్‌.  

''జంగ్లీ'' సూపర్‌ హిట్‌. సైరాకు బ్యూటీ క్వీన్‌ అనే పేరు వచ్చేసింది. తర్వాత బోల్డు సినిమాలు వచ్చి పడ్డాయి. ''బ్లఫ్‌ మాస్టర్‌'', ''ఏప్రిల్‌ ఫూల్‌'', ''దూర్‌ కీ ఆవాజ్‌'', ''ఆవో ప్యార్‌ కరే'' ''ప్యార్‌ మొహబ్బత్‌''. టాప్‌ హీరోలందరితోనూ ఆమె వేసింది. అప్పట్లో సిల్వర్‌ జూబిలీ స్టార్‌గా పేరు పొందిన రాజేంద్ర కుమార్‌ పక్కన ఆమె తొలి సినిమా ''ఆయీ మిలన్‌ కీ బేలా''. ఆ సినిమా బ్రహ్మాండంగా విజయవంతం కావడంతో ''అమన్‌'', ''ఝుక్‌ గయా ఆస్మాన్‌'' సినిమాలు వెంటవెంటనే వచ్చాయి. తెరమీద శృంగారం తెర వెనుకకు కూడా కొనసాగడంతో గాసిప్‌ మ్యాగజైన్లు వీరిద్దరి గురించి రాయడం మొదలెట్టాయి. సైరా తల్లి నసీంకు కంగారు పుట్టింది. తను కూడా ఒకనాటి తారే కాబట్టి యిలాటి బంధాలు ఎలా రూపుదిద్దుకుంటాయో ఊహించగలిగింది. రాజేంద్ర కుమార్‌ అన్యమతస్థుడే కాక వివాహితుడు, ముగ్గురు పిల్లల తండ్రి కూడా. 

కూతురికి చెప్పి చూసి, లాభం లేకపోవడంతో ఫ్యామిలీ ఫ్రెండయిన దిలీప్‌ కుమార్‌ను, సైరా బానుని సినిమాల్లోకి తెచ్చిన సుబోధ్‌ ముఖర్జీని వెళ్లి బతిమాలింది – 'మీరైనా నచ్చచెప్పండి' అని. ముఖర్జీ చాలా సార్లు చెప్పాడు కానీ సైరా వినలేదు. దిలీప్‌కి యిటువంటి వ్యవహారాల్లో కలగజేసుకోవడం యిష్టం లేక సాధ్యమైనంత వరకు దూరంగా వున్నాడు. చివరకు 1966 ఆగస్టు 23 న సైరాబాను 25 వ పుట్టినరోజు పార్టీనాడు కలగజేసుకోక తప్పలేదు. అవేళ పార్టీకి రాలేనని దిలీప్‌ కుమార్‌ ఓ ఉత్తరం రాసి పంపించేశాడు. 

కానీ కాస్సేపటికి రాజేంద్ర కుమార్‌ ఆ పార్టీకి తన భార్యతో సహా విచ్చేశాడు. అది చూడగానే సైరా అప్‌సెట్‌ అయిపోయింది. 'నిన్ను పెళ్లి చేసుకున్నా, నా భార్యను మాత్రం విడిచిపెట్టను' అని సందేశం యిస్తున్నాడా యితను అని గందరగోళ పడిపోయింది. ఆమె అవస్థ చూసి నసీం బాను వెంటనే దిలీప్‌ యింటికి పరిగెట్టుకుంటూ వచ్చింది. రాకపోతే లాభం లేదని మొత్తుకుంది. దిలీప్‌కి రాక తప్పలేదు. పార్టీ అయిపోయాక కూచుని నచ్చచెప్పటం ప్రారంభించాడు.

సైరా బానుకి మొదటినుండీ దిలీప్‌ కుమారంటే ఆరాధన. దిలీప్‌ కుమార్‌ రొమాంటిక్‌ హీరోగా, అందునా విషాదాంత హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాటి పాత్రలంటే స్త్రీ ప్రేక్షకులకే కాదు, నటీమణులకు కూడా క్రేజ్‌. పెళ్లి చేసుకోమంటూ దిలీప్‌ వెంట ఎందరో నటీమణులు పడ్డారు. ఇతను ఎవరినీ పెళ్లి చేసుకోకుండా చాలాకాలం కథ నడుపుతూంటాడని సంకోచం.  పార్టీలో దిలీప్‌ కనబడగానే అతన్ని చూసి మురిసిపోయి రాజేంద్ర కుమార్‌ను ఝాడించే కార్యక్రమం వాయిదా వేసింది. 

తర్వాత దిలీప్‌ అతన్ని వదిలేయమని చెప్తూ పోతూండగా అతన్ని ఆపి ఓ ప్రశ్న అడిగింది – 'అతన్ని వదిలేస్తాను. కానీ మీరు నన్ను చేసుకుంటారా?' అని. దిలీప్‌ తెల్లబోయాడు. 'నేను నీ కంటె ఎంత పెద్దవాణ్నో తెలుసా? నాకు 43. నీకు 25. మీ అమ్మ నా కంటె ఒక్క సంవత్సరం మాత్రమే పెద్దది. ''ఫుట్‌ పాత్‌'' సినిమాలో నా పక్కన కథానాయికగా వేసి వుండాల్సింది కానీ వేషం తప్పిపోయింది.'' అన్నాడు. ''నాకు అదంతా తెలియదు. నువ్వు పెళ్లాడతానంటేనే నీ మాట వింటాను'' అంది సైరా. 

అక్టోబరు 2 న వాళ్లిద్దరి ప్రధానం జరిగింది. నెల తిరక్కుండా పెళ్లయిపోయింది. ఈ పెళ్లి వల్ల నష్టపోయిన వారిలో దర్శక నిర్మాత, దిలీప్‌ కుమార్‌ బావగారు  కె. అసిఫ్‌ కూడా వున్నాడు. ''మొఘలే ఆజమ్‌'' తీసిన అసిఫ్‌ సైరా బాను, రాజేంద్ర కుమార్‌లతో ''సస్తా ఖూన్‌ – మెహంగా ప్యార్‌'' అనే సినిమా ప్లాన్‌ చేశాడు. కొన్ని దృశ్యాలు తీశాడు కూడా. అయితే ఆ జంటతో సినిమా రిలీజైతే దిలీప్‌కు యిబ్బందిగా వుంటుందన్న ఉద్దేశ్యంతో సినిమాను మధ్యలో వదిలేేశాడు. (సశేషం) 

(ఫోటోలు- సైరాబాను, రాజేంద్రకుమార్‌ 2) సైరా, దిలీప్‌ పెళ్లి 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]