మూవీ రివ్యూ: అర్జున్ సన్నాఫ్ వైజయంతి

యాక్షన్ సెంటిమెంట్ చిత్రమే అయినా యాక్షన్ డామినేట్ అయిపోయి, సెంటిమెంట్ అందని పరిస్థితి నెలకొంది.

చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి
రేటింగ్: 2.5/5
తారాగణం: కళ్యాణ్ రాం, విజయశాంతి, శ్రీకాంత్, సాయీ మంజ్రేకర్, పృథ్వి, సొహైల్ ఖాన్, మహేష్, వడ్లమాని శ్రీనివాస్, గాయత్రి భార్గవి తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
దర్శకత్వం: ప్రదీప్ చిలుకురి
విడుదల: 18 ఏప్రిల్ 2025

“సరిలేరు నీకెవ్వరు” తర్వాత విజయశాంతి తెర మీద కనిపించిన చిత్రమిది. కళ్యాణ్ రాం నటించిన యాక్షన్ సెంటిమెంట్ ఫిలిం ఇది. ట్రైలర్ ని బట్టే కథేంటో, కథనం ఎలా ఉండబోతోందో అర్ధమైపోయేలాగా ఉంది. అలా ప్రెడిక్టిబుల్ గా కాకుండా ఇంకేదైనా ఇందులో ఉందా? చూద్దాం.

కథలోకి వెళ్లితే ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ (వైజయంతి). ఆమె భర్త నావల్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్. వాళ్ల కొడుకు అర్జున్ విశ్వనాథ్ (కళ్యాణ్ రాం). అతను కూడా యూపీఎస్సీ పరీక్ష పాసయ్యి ఐపీఎస్ అవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ తన తండ్రిని ఒక క్రిమినల్ హతమార్చాడని తెలిసి పగతో రగిలిపోతుంటాడు. తల్లి వైజయంతి మాత్రం ఆ హంతకుడికి న్యాయబద్ధంగానే శిక్ష పడాలని, సిస్టం కి విధేయంగా పనిచేయాలి తప్ప సొంత రివెంజులు తీర్చుకోకూడదని చెబుతుంది. కానీ అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్యలో ఒక గ్యాప్.

ఇంతకీ చట్టాన్ని అతిక్రమించి తన సొంత శిక్షాస్మృతిని ప్రవేశిపెట్టిన అర్జున్ కి వైజాగ్ లో ఒక ప్రాంతం బ్రహ్మరథం పడుతుంది. అప్పటి నుంచీ అర్జున్ కనుసన్నల్లోనే అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుంది.

ఇదిలా ఉంటే పఠాన్ (సొహైల్ ఖాన్) అనే యరవాడ జైల్లో ఉండే ఒక నేషనల్ క్రిమినల్ వైజయంతిని చంపాలని ప్లాన్ చేస్తాడు. అతనెవరు? అతనికి, వైజయంతికి లింకేంటి? ఇదంతా ఒక ట్రాక్. ఆ పఠాన్ నుంచి అర్జున్ తన తల్లిని ఎలా కాపాడుకుంటాడు అనేది తక్కిన కథ.

ఈ కథంతా వింటుంటే, ట్రైలర్లో ఉన్నది ఇదే కదా అనిపించట్లేదూ! అవును, పూర్తి ప్రెడిక్టిబుల్ కథ.

సెకండాఫ్ చివర్లో మాత్రం ఒక చిన్నపాటి ట్విస్ట్, క్లైమాక్స్ లో హీరో వీరత్వం మాత్రం ఊహించని విధంగా ఉన్నాయి.

కథ నిజానికి చిన్నది, పాతది అన్నట్టుంది. కానీ కథనంలో మాత్రం చాలా హెవీనెస్ తీసుకొచ్చారు. సాంకేతిక బలంతో ఎక్కడా బోర్ కొట్టని విధంగా మలచారు.

ముఖ్యమైన హైలైట్ అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్. డైలాగులు, డబ్బింగ్ కూడా బాగున్నాయి.

అయితే ఇలాంటి సినిమాకి కావాల్సిన పాటలు మాత్రం లేవు. ఉన్న పాటలేవీ హత్తుకోకపోగా, నెరేషన్ కి అడ్డంగా ఉన్నాయి. ఆఖరికి తల్లి సెంటిమెంట్ పాట సాహిత్యంలో కూడా ఆకట్టుకునే లైన్ ఒక్కటి కూడా లేదు. పాటల్లోని పంక్తులు, పదాలు అన్నీ ట్యూన్ కి పేర్చినట్టున్నాయి తప్ప ఎక్కడా కూడా మనసుని తాకిన పుణ్యానికి పోలేదు. అజనీష్ మరోసారి తాను పాటల కంపోజిషన్లో ఎంత వీకో చూపించాడు.

కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు అన్నీ సమపాళ్లల్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. రిలీఫ్ కోసం చిన్నపాటి వినోదం కూడా లేదు. అదొక మైనస్. కమర్షియల్ ఫార్ములా సినిమా చూడడానికి టికెట్ కొనుక్కుని వచ్చే ప్రేక్షకుడికి ఒక్క నవ్వు కూడా లేకుండా అంత సేపు యాక్షన్ నే భరించమనడం అన్యాయం.

అది పక్కన పెట్టి కంటెంట్ పరంగా చూసుకున్నా, ఈ చిత్రం నిజానికి ఒక ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చుంటే బాగుండేది. కాలం చెల్లిన కథ ఎంత గొప్పగా తీసినా ఆశించిన అనుభూతి కలిగించదు.

“మన పెళ్లికి సాక్షులు తప్ప ప్రేక్షకులు లేరు” అని ఒక సీన్లో అంటుంది హీరోయిన్. కంటెంట్ పరంగా అద్భుతమనిపించుకోకపోతే, “మన సినిమాకి సమీక్షకులే తప్ప, ప్రేక్షకులు లేరు” అని నిర్మాతలు అనుకోవాల్సి వచ్చే ప్రమాదముంది.

నటనపరంగా విజయశాంతి టఫ్ కాప్ గా బాగా చేసింది. ముఖంలో వయసు కనిపిస్తున్నా ఆమె ఫిట్నెస్ మాత్రం పోలీసాఫీసర్ పాత్రకి తగ్గట్టుగా ఉంది.

కళ్యాణ్ రాం తనదైన శైలిలో పాత్రని పండించాడు. డైలాగ్ డెలివెరీలో డెప్త్, అవసరమైన చోట వాయిస్ లో బేస్, పిచ్ మాడ్యులేషన్ అన్నీ పర్ఫెక్ట్ అనిపించాడు. క్లైమాక్సులో తల్లిని కాపాడే ప్రయత్నంలో చేసిన త్యాగంతో ఆకట్టుకున్నాడు.

సయీ మంజ్రేకర్ హీరోగారి భార్యగా చీరకట్టుని అందంగా కనిపించింది తప్ప నటించడానికి ఏమాత్రం స్కోప్ లేని పాత్ర. కథకి ఎక్కడా ఉపయోగపడలేదామె.

శ్రీకాంత్ ది గ్రావిటీ ఉన్న కేరెక్టర్. డబుల్ షేడ్స్ లో సరిగ్గా సరిపోయాడు.

కానిష్టేబుల్ గా పృథ్విది కూడా ఉన్నంతలో పెద్ద పాత్రే.

వడ్లమాని శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ కనీసం ఒక ఫ్రేం లోనైనా కనిపించకుండా ఉండట్లేదు. ఇందులోనూ అంతే.

మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకి న్యాయం చేసారు.

దర్శకత్వం పరంగా చూస్తే, ఫైట్ మాస్టరే సినిమాని డైరెక్ట్ చేసినట్టుంది. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచీ చివరి వరకూ ఫైట్లతో నింపేసారు. విజయశాంతి ఇంట్రోకి ఒక ఫైట్, హీరో ఎంట్రీకి ఒకటి, విలన్ ఎంట్రీకి ఒకటి..ఇలా మొత్తం ఫైట్లే గుర్తుంటాయి థియేటర్లోంచి బయటికొస్తే.

– ఒక టీకి బదులు ఆరు టీలు పట్టుకెళ్లే సీన్, అక్కడ పడే డైలాగ్

– పోలీసులు చేయాల్సిన డ్యూటీని సామాన్యుడు చేస్తే పోలీసులకి ఎలా అనిపిస్తుందో శ్రీకాంత్ హీరోయిన్ తో చెప్పే డైలాగ్

– “నేనెవరో తెలుసా” అని ఏ పోలీస్ ముందు అనకూడదని విజయశాంతి విలన్ తో చెప్పే డైలాగ్

..ఈ మూడూ కొత్తగా ఉన్నాయి, ఆకట్టుకున్నాయి. ఇలాంటివి కనీసం ఇంకో నాలుగు పడుంటే కంటెంట్ ఎలా ఉన్నా, రైటింగ్ కి మంచి పేరొచ్చేది.

నిర్మాణ విలువలు చాలా బాగున్నాయనే చెప్పాలి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నమ్మిన కథనే చాలా కష్టపడి చెక్కారు. చెక్కుడు బానే ఉంది కానీ కథ అనబడే చెక్కలోనే అంత బరువు లేదు.

ఓవరాల్ గా చూస్తే, యాక్షన్ సెంటిమెంట్ చిత్రమే అయినా యాక్షన్ డామినేట్ అయిపోయి, సెంటిమెంట్ అందని పరిస్థితి నెలకొంది. తల్లీకొడుకుల మధ్యలో కాన్-ఫ్లిక్ట్ పాయింట్ హత్తుకునేలా లేదు. తల్లీ, కొడుకు..ఇద్దరూ తెర మీద సమాజం దృష్టిలోనూ, తెర బయట ప్రేక్షకుల ముందు మంచివాళ్ళే అయిపోతే ఇక కాన్-ఫ్లిక్ట్ ఏమున్నట్టు? చట్టంతో పని జరగట్లేదని తెలుసుకుని, చట్టవిరుద్ధమైనా సరే కొడుకు మీదే ఆధారపడే తల్లిగా ముగిసింది వైజయంతి పాత్ర. ఈ కమర్షియల్ ఫార్ములా కథని, హోరెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని, హై డోస్ యాక్షన్ సీన్లని, ఒకటి రెండు డైలాగ్ మొమెంట్స్ ని కోరుకునేవాళ్లు ఈ చిత్రాన్ని చూడొచ్చు. కళ్యాణ్ రాం కష్టాన్ని మెచ్చుకోవచ్చు.

బాటం లైన్: సెంటిమెంటుని మింగేసిన యాక్షన్

15 Replies to “మూవీ రివ్యూ: అర్జున్ సన్నాఫ్ వైజయంతి”

  1. Meeru movie ratings out of 3 ki isthe best next of all reviewer change cheyadam ayana age ki ee generation movies ki reviews rayadam set kadu

Comments are closed.