ఎమ్బీయస్: ద్రావిడకు దాసోహమన్న బిజెపి

పళనిస్వామి తమిళ ప్రయోజనాలను ఉత్తరాది బిజెపికి తాకట్టు పెట్టేశాడని, తక్కువ సీట్లకే ఒడంబడేట్లు వున్నాడని డిఎంకెయే కాదు, ఎడిఎంకెలో కూడా సణుగుళ్లు మొదలయ్యాయి. ‘

ఈ నెలలోనే తమిళనాడులో తన రాష్ట్ర అధ్యక్షుడైన అన్నామలైను బిజెపి మార్చింది. ఉపాధ్యక్షుడైన నయనార్ నాగేంద్రన్‌కు ప్రమోషన్ యిచ్చి అధ్యక్షుణ్ని చేసింది. విజయసాయి రెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభ సభ్యుణ్ని చేసి, ఆ పై కేంద్రమంత్రిని చేస్తారని అనుకున్నారు. కానీ విజయసాయి స్థానంలో వేరేవార్ని తీసుకున్నారు. అన్నామలైకి వేరే మార్గంలో కాంపెన్సేట్ చేయవచ్చు కానీ అలాంటి ఫయర్ బ్రాండ్‌ను తీసేయడం క్యాడర్‌కు ఎలాటి సందేశం యిస్తుందనేదే యిక్కడ ఆలోచించవలసిన విషయం. తెలంగాణలో బండి సంజయ్‌ని తీసేశాక అలా చేసి వుండకూడదు అని అనుకున్నారని వార్తలు వచ్చాయి. బండి సంజయ్‌ కూడా ఫయర్ బ్రాండ్, పార్టీ క్యాడర్‌ను ఉత్తేజ పరచగలిగిన నాయకుడే కానీ విద్యాధికుల, తటస్థుల మన్నన పొందినవాడు కాదు. అన్నామలై మాజీ ఐపిఎస్ అధికారి కావడం, వాదనాపటిమ కలవాడు కావడం చేత బిజెపి అభిమానుల గౌరవాభిమానాలు పొందాడు. అలాటి వాడిని యిలా వెడలనంపడం పైపైన చూస్తే వింతగా అనిపిస్తుంది.

ఒక పార్టీ తన రాష్ట్ర అధ్యక్షుణ్ని మార్చడం వింతేమీ కాదు. అతని నాయకత్వంలో వెళ్లిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో అధిష్టానం తృప్తి పడకపోతే, మార్చేస్తారు. అదే కారణమైతే ఏడాది క్రితమే మార్పు జరగాల్సింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో వుండగా యిప్పుడు మార్చడమేమిటి? సరే, మార్చారే అనుకున్నా, అతని స్థానంలో తెచ్చినదెవర్ని? 2017 వరకు ఎడిఎంకెలో వున్న నాగేంద్రన్‌ని! అతనెందుకు? 2013 నుంచి 2019 వరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై సౌందరరాజన్ వుందిగా! తెలంగాణ గవర్నరు పదవి యిస్తే 2024 పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయడానికి దానికి రాజీనామా చేసి వచ్చి ఖాళీగా వుంది. తండ్రి కాంగ్రెసు నాయకుడైనా, బిజెపి విధానాల పట్ల ఆకర్షితురాలై 1999 నుంచి పార్టీ మెడికల్ విభాగంలో, తర్వాత అనేక హోదాల్లో సేవలందించింది. మూడు సార్లు అసెంబ్లీకి, మూడు సార్లు పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయిన మాట వాస్తవమే కానీ అన్నామలై కూడా 2024లో కోయంబత్తూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడుగా. ఎడిఎంకెతో పొత్తు లేకపోతే అతన్ని కంటిన్యూ చేసేవారుగా!

ఔను, ఆవిణ్ని కాదని నాగేంద్రన్‌కు ఆ పదవి కట్టబెట్టడానికి కారణం – ఎడిఎంకెతో పొత్తు కుదుర్చుకోవడం. తమతో పొత్తు కుదరాలంటే అన్నామలైను తీసేయాల్సిందేనని, అతని స్థానంలో తమ పాత సహచరుడు నాగేంద్రన్‌ను పెట్టాలని పళనిస్వామి పట్టుబట్టాడని, అందుకే బిజెపి అలా చేయవలసి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అన్నామలైని తీసివేయడానికి వేరే కారణమేదీ కనబడక పోవడం చేత ఆ వార్తలను నమ్మాల్సి వస్తోంది. ఇది తమిళనాడులో బిజెపి ఉన్న పరిస్థితిని సూచిస్తోంది. తమిళనాడులో 1967 వరకు కాంగ్రెసు పాలించింది. దాన్ని ఓడించి, డిఎంకె వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఓడించి ఎడిఎంకె వచ్చింది. అధికారం ఆ రెండు పార్టీల మధ్యే వుంటోంది. కాంగ్రెసు జాతీయ పార్టీ అయినా యీ రెండిటిలో ఏదో ఒక దానికి తోకగా వుంటూ వస్తోంది. ఒకసారి ఒకరితో, మరొకసారి మరొకరితో జట్టు కట్టి, అధికారంలోనో, ప్రతిపక్షంలోనో వుంటూ వచ్చింది తప్ప సొంతంగా అధికారం పొందింది లేదు.

ఎమ్జీయార్ కాలం నుంచి ద్రవిడ పార్టీలు ఒక ఫార్ములాను అనుసరిస్తున్నాయి. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని వారికి పార్లమెంటు సీట్లలో మూడింట రెండు వంతులు, అసెంబ్లీ సీట్లలో మూడింట ఒక వంతు యిస్తున్నారు. తమ వాటాకు వచ్చిన సీట్లను, తమతో పొత్తు పెట్టుకున్న భాగస్వామ్య పక్షాలకు పంచుతున్నాయి. తమిళనాడులో అనేక చిన్నాచితకా పార్టీలున్నాయి. ఫలానా పార్టీనే అంటిపెట్టుకోవాలనే సిద్ధాంతం వాటికి లేదు. ఎవరివైపు గాలి వీస్తోంది, ఎవరు మనకు ఎన్ని సీట్లు యిస్తున్నారు అనేదే లెక్క. డిఎంకె, ఎడిఎంకె కూటములు తమ ప్రత్యర్థిని యిబ్బంది పెట్టడానికి కేంద్రంలో అధికారంలో వున్న కూటమికి మద్దతిస్తూ వచ్చాయి. బిజెపి ఉత్తరాదిన పెద్ద పార్టీగా వున్నా దక్షిణాదిన ఎప్పుడూ బలంగా లేదు. రామజన్మభూమి వివాదం తర్వాత కర్ణాటకలో కాస్త పుంజుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపితో పొత్తు పెట్టుకున్నపుడు కాస్త జోరుగా వున్నా ఆంధ్ర ప్రాంతంలో బలపడలేదు. తెలంగాణలో దీర్ఘకాలంగా వున్న ఆరెస్సెస్ కారణంగా కాస్త బలం వుంది. లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెసు ఫ్రంట్ రాజకీయాలతో విసిగిన కేరళలో కొన్ని ప్రాంతాల్లో మతం పేర బిజెపి బలం పుంజుకోసాగింది. కానీ ప్రాంతీయ భావాలు బలంగా వున్న తమిళనాడు మాత్రం బిజెపికి దుర్భేద్యంగానే వుండిపోయింది. దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో హిందూ మున్నని బలంగా వున్న చోట మాత్రం కాస్త కాస్త ఓటు తెచ్చుకోసాగింది. దేశమంతా మోదీ హవా వీచినా తమిళనాడులో మాత్రం నెగ్గేటన్ని ఓట్లు, సీట్లు తెచ్చుకునేంత బలంగా వీచలేదు. ఉత్తరాది పార్టీగా, హిందీ పార్టీగా పేరు బడిన బిజెపి తమిళుల మనసు గెలవడం కష్టమని భావించి, 1998 లోకసభ ఎన్నికలలో జయలలితతో పొత్తు కుదుర్చుకుని 4 సీట్లు సంపాదించింది. వాజపేయి హయాంలో బిజెపి డిఎంకెను ఎన్‌డిఏలో చేర్చుకుంది. బిజెపిలో మోదీ ప్రాభవం పెరిగిన కొద్దీ, డిఎంకెకు దూరమై, జయలలితకు దగ్గర కావడం ఎక్కువైంది.

2016లో జయలలిత మరణం తర్వాత సొంతంగా ఎదగడానికి ఛాన్సు వచ్చిందనుకుంది బిజెపి. ఎడిఎంకె అండగా నిలబడింది. కానీ ఎడిఎంకెలో చీలిక వచ్చింది. శశికళను పక్కకు తప్పించి, పళనిస్వామి, పన్నీరు శెల్వంల మధ్య సయోధ్య కుదర్చబోయింది కానీ అది సాధ్యపడలేదు. చివరకు పళనిస్వామియే ఎడిఎంకె ముఖ్యమంత్రిగా స్థిరపడ్డాడు. 2019 పార్లమెంటు ఎన్నికలలో ఎడిఎంకె, బిజెపి, యితర పార్టీలు కలిసి పోటీ చేస్తే, 39 సీట్లలో 38 డిఎంకెకు పోయాయి. పార్టీ అధ్యక్షుడిగా వున్న పన్నీర్ శెల్వం కొడుకు మాత్రమే ఎడిఎంకె తరఫున నెగ్గాడు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకెకు 133, దాని కూటమి భాగస్వాములకు 26 వచ్చి డిఎంకె కూటమి అధికారంలోకి వచ్చింది. ఎడిఎంకెకు 66, దానితో పొత్తు పెట్టుకున్న పిఎంకెకు 5, బిజెపికి 4 రాగా, ఆ కూటమిలో వున్న తక్కిన 7 పార్టీలకు ఒక్కటీ రాలేదు.

ఓటమి పళనిస్వామి స్థానాన్ని పార్టీలో బలహీన పరిచింది. ఉత్తరాది పార్టీ ఐన బిజెపితో పొత్తు పెట్టుకుని బావుకున్నది లేదని, పన్నీరుశెల్వం, దినకరన్ వర్గాలతో పేచీ పెట్టుకున్నది నష్టపోయినది ఎక్కువనీ అనేకమంది వాదించసాగారు. ఇది గమనించిన బిజెపి తన కంటూ కొత్త పాత్రను సృష్టించుకోసాగింది. కేరళలో లెఫ్ట్, కాంగ్రెసులతో విసిగిన ఓటర్లను ఆకర్షించినట్లే, తమిళనాడులో ద్రవిడ పార్టీల విన్యాసాలతో విసిగిన ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నించింది. వారిలో మధ్యతరగతి వారు, మేధావులు వుంటారని, వారిలో చాలామంది మోదీ అభిమానులై వుంటారని లెక్క వేసి, వారిని ఆకర్షించడానికి అన్నామలైను తీసుకుని వచ్చింది. అతను కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపిఎస్ అధికారి. 8 ఏళ్ల సర్వీసు వదిలేసి 2020 ఆగస్టులో బిజెపిలో చేరాడు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. 2021 జులైలో తమిళిసై వారసుడిగా వచ్చిన మురుగన్‌ని కేంద్రమంత్రిగా పంపి, అతని స్థానంలో యితన్ని పార్టీ అధ్యక్షుడిగా చేసింది.

ఇతను వచ్చిన దగ్గర్నుంచి ఎగ్రెసివ్‌గానే ఉన్నాడు. ద్రవిడవాదాన్ని నిరసిస్తూ మాట్లాడాడు. అదే సమయంలో తమిళనాడు గవర్నరుగా వున్న రవి కూడా ద్రవిడవాదాన్ని నిరాకరించసాగాడు. 2023లో అసెంబ్లీని ఉద్దేశిస్తూ చేయవలసిన ప్రసంగంలో డిఎంకె ప్రభుత్వం రాసిచ్చిన ఉపన్యాసంలో పెరియార్, అణ్నాదురైల ప్రస్తావన తీసేసి మాట్లాడసాగాడు. ప్రభుత్వం తామిచ్చినదే మాట్లాడాలని పట్టుబడితే అతను అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాడు. ఇటు అన్నామలై జయలలిత అవినీతి గురించి మాట్లాడడమే కాక, ద్రవిడ పార్టీలు దైవసమానుడిగా భావించే అణ్నాదురైను కూడా వదలలేదు. 1956లో మధురైలో హిందూమతం గురించి అణ్నా వ్యతిరేకంగా మాట్లాడితే పెద్ద గొడవ అయిందని, దాంతో అణ్నా దాక్కోవలసి వచ్చిందని, క్షమాపణ చెప్పిన తర్వాతే బయటకు రాగలిగాడని అన్నాడు.

ఈ స్టేటుమెంటు తర్వాత పళనిస్వామి బిజెపితో 2023 సెప్టెంబరులో పొత్తు తెంచుకున్నాడు. ద్రవిడ పార్టీలతో పొత్తు అక్కర్లేకుండా తాము గెలవగలమనుకుని అంచనా వేసిన అన్నామలై ఆధ్వర్యంలో బిజెపి పిఎంకె, మరో 6 పార్టీలతో (వారిలో పళనిస్వామి ప్రత్యర్థులైన దినకరన్, పన్నీరుశెల్వం కూడా వున్నారు) కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది. 4 పార్టీల ఎడిఎంకె కూటమి విడిగా పోటీ చేసింది. రెండు కూటములకూ ఒక్క సీటు కూడా రాలేదు. అన్నామలై కూడా ఓడిపోయాడు. 8 పార్టీల డిఎంకె కూటమికే మొత్తం 39 సీట్లూ దక్కాయి. బిజెపి 23 సీట్లలో పోటీ చేసి 11% ఓట్లు తెచ్చుకోగలిగింది. (వాటిల్లో పిఎంకె ఓట్లు చాలా వున్నాయని కొందరన్నారు) 2019లో అయితే 4శాతమే వచ్చాయి కాబట్టి పార్టీ స్వతంత్రంగా బాగానే ఎదుగుతోంది అనుకున్నారు బిజెపి పెద్దలు.

అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తేనే పార్టీ ఎప్పటికైనా బలపడుతుందన్న భావంతో బిజెపి ముందుకు సాగుతూ ద్రవిడ వ్యతిరేక అజెండాను బలంగా కొనసాగించారు. అన్నామలై మరింత స్వేచ్ఛగా మాట్లాడాడు. 2024 అక్టోబరులో గవర్నరు రవి హాజరైన ఒక కార్యక్రమంలో గాయకబృందం తమిళనాడు రాష్ట్రగీతాన్ని ఆలాపిస్తూ ద్రావిడ పదం వున్న భాగాన్ని వదిలేసింది. జాతీయగీతంలోని ద్రావిడ పదాన్ని కూడా రవి మార్చేస్తారా? అని స్టాలిన్ విమర్శిస్తే గవర్నరు ఆఫీసు అది గాయకబృందం పొరపాటు తప్ప గవర్నరు ప్రమేయం లేదని అంది. 2025 జనవరి అసెంబ్లీ సమావేశంలో తమిళ రాష్ట్ర గీతం విషయంలో మరోసారి వివాదం రేగింది. సమావేశ ప్రారంభంలో దాన్ని, చివర్లో జాతీయ గీతాన్ని ఆలపించడం సంప్రదాయం కాగా, గవర్నరు మొదట జాతీయగీతం ఆలపించాలని పట్టుబట్టి దానికి ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో అసెంబ్లీ విడిచి వెళ్లిపోయాడు.

ద్రవిడ వ్యతిరేకతే తమకు ప్రత్యేకతను, ద్రవిడ పార్టీయేతర ఓట్లను తెచ్చిపెడుతుందనే బిజెపి వ్యూహానికి యిటీవల అవరోధం కలిగింది. ఎప్పుడైతే డీలిమిటేషన్ గొడవ, హిందీ వివాదం, నీట్ పేచీ అన్నీ వచ్చాయో, డిఎంకె యిమేజి పెరిగింది. తమిళ సంస్కృతికై, తమిళుల హితానికై పోరాడుతున్న పార్టీ అదొక్కటే అనే భావం యావన్మంది తమిళుల్లో కలగసాగింది. దాంతో పాటు బిజెపి ఉత్తరాది పార్టీ అనే భావనా బలపడింది. తమిళనాడు ఒక్కదాని గురించే సమస్య ఐతే, బిజెపి యీ విషయాల్లో వెనుకంజ వేయడమో, వాయిదా వేయడమో చేసేదేమో. కానీ దానికి కంచుకోటగా వున్న ఉత్తరాదిన మరింత బలపడాలంటే యివి తప్పవు.

ఈ పరిస్థితుల్లో ప్రధాన ద్రావిడ పార్టీలు రెండిటితో పేచీ పెట్టుకుంటే పూర్తిగా నష్టపోతామని బిజెపి అనుకుంది. అందుకని ఎడిఎంకెతో బేరాలు మొదలుపెట్టింది. పళనిస్వామి కూడా దిక్కుతోచక వున్నాడు. ఒంటరిగా పోటీ చేయడానికి తగిన నిధులూ లేవు, నాయకుల పూర్తి మద్దతూ లేదు. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుందామని చూస్తే అతను మొదటి సగకాలం తనను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టాడని, దానికి పళనిస్వామి ఒడంబడలేదని వార్తలు వచ్చాయి. పార్టీపై తన పట్టు నిలుపుకోవాలంటే బిజెపితో పొత్తు పెట్టుకోవలసినదే అనుకుని ఈ మార్చి నుంచి మంతనాలు సాగించాడు. చివరకు అమిత్ షా వచ్చి పొత్తు కుదుర్చుకున్నాడు. ద్రవిడ సిద్ధాంతాలను పడతిట్టిన అన్నామలైతో కలిసి పని చేస్తే ఎడిఎంకెను అంటిపెట్టుకుని వున్న ఓటర్లు కోపగిస్తారని భయపడి, అతన్ని తీసేసి, నాగేంద్రన్‌ను పెట్టాలని పళనిస్వామి అడిగి సాధించుకున్నాడు.

నాగేంద్రన్ నేపథ్యమేమిటంటే – అతను ఎంజీఆర్‌కు, ఆ తర్వాత జయలలితకు అభిమాని. పార్టీలో చేరి 2001లో ఎన్నికలలో తిరునల్వేలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి నెగ్గాడు. అతి తక్కువ మెజారిటీతో నెగ్గినా జయలలిత అతనికి మంత్రి పదవి యిచ్చింది. 2006 ఎన్నికలలో 606 ఓట్లతో ఓడిపోయాడు. అతని పార్టీ కూడా అధికారం కోల్పోయింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడంటూ అతనిపై కేసులు పడ్డాయి. 2011లో అదే స్థానం నుంచి 38 వేల మెజారిటీతో నెగ్గాడు. 2016లో జయలలిత మరణం తర్వాత 2017లో బిజెపిలో చేరాడు. ఆ పై ఏడాది ఆండాళ్‌ను ఏదో అన్నాడంటూ వైరముత్తుని బెదిరించాడు. 2019లో పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు ఓట్ ఫర్ క్యాష్ కేసు పడింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలవడంతో పార్టీ అతన్ని లెజిస్లేటివ్ లీడర్ చేసింది. ఇప్పుడు పళనిస్వామి పట్టుదలపై ఏకంగా అధ్యక్షుణ్ని చేసింది.

పైకి కలరింగు ఏమిటంటే పళనిస్వామి, అన్నామలై యిద్దరూ గౌండర్ కులస్తులు కాబట్టి, యిద్దరి నాయకత్వంలో కూటమి ముందుకు వెళితే యితర కులస్తులు దూరమవుతారని, అన్నామలై స్థానంలో దేవర్ కులస్తుడైన నాగేంద్రన్‌ను తెచ్చారని, ఆ విధంగా ఎడిఎంకె మద్దతుదారుల్లోని దేవర్ కులస్తులు దినకరన్, పన్నీరుశెల్వం వైపు వెళ్లకుండా వుంటారని రాయించారు. అదొక్కటే కారణమైతే అసెంబ్లీ ఎన్నికలలో అన్నామలైను కూటమి ప్రచార సారథిగా నియమించి, ఎడిఎంకె పోటీ చేసే స్థానాల్లో కూడా ప్రచారం చేయించాలి. అలా చేస్తారేమో చూద్దాం. ఈలోగా నాగేంద్రన్ ‘‘ఈసారి బిజెపికి ఎడిఎంకె కంటె ఎక్కువ సీట్లు రావాలి.’’ అనడంతో, పళనిస్వామి తమిళ ప్రయోజనాలను ఉత్తరాది బిజెపికి తాకట్టు పెట్టేశాడని, తక్కువ సీట్లకే ఒడంబడేట్లు వున్నాడని డిఎంకెయే కాదు, ఎడిఎంకెలో కూడా సణుగుళ్లు మొదలయ్యాయి. ‘మా పొత్తు ఎన్నికలలో పోటీ చేయడం వరకే, అధికారంలో వారికి చోటివ్వం.’ అని పళనిస్వామి ప్రకటించాడు. అయినా బిజెపి అధిష్టానం కిమ్మనలేదు. అదీ బిజెపి ప్రస్తుత దుస్థితి. ఒకప్పుడు శివసేన కూడా యిలాగే మాట్లాడేది. తర్వాత బిజెపి శివసేనను చీల్చి తన తడాఖా చూపించింది. ఆ ట్రీట్‌మెంట్ కొన్నాళ్లకు ఎడిఎంకెకు జరిగినా జరగవచ్చు. (ఫోటో – పళనిస్వామి, అమిత్ షా, అన్నామలై, నాగేంద్రన్)

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

13 Replies to “ఎమ్బీయస్: ద్రావిడకు దాసోహమన్న బిజెపి”

  1. The Dravidian parties are slowly losing their image as people are fed up with its anti-Hindu, anti_Centre and separatist policies of these parties. It was a wrong step of the BJP top leadership to remove Annamalai as the State Party Chief.  Annamalai was very aggressive leader who helped BJP in increasing the vote share significantly and like in Orissa, it requires some more years’ efforts to gain complete hold & power. Now, it is back to square one for the party in that State. After the removal of Annamalai, the State BJP is motionless.

  2. అన్నమలై గారు చురుకు , వాగ్ధాటి వున్న నాయకుడు.

    ఖచ్చితంగా అతని కి మంచి స్థానం దొరుకుతుంది అని కోరిక.

    1. తమిళ నాడులో, అదికూడా ఉత్తర వ్యతిరేఖ ద్రవిడ భావాలు అధికారం వున్న ప్రాంతం లో గట్టిగా ఎదగడానికి ఒక్కోసారి కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.

       

      జాతీయ పార్టీ కాబట్టి, పైగా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిని మార్చాలి అంటే

      ఎంతో మేధో మథనం చేసే ఈ నిర్ణయం తీసుకుని వుంటారు.

      అవి ఎంత విజయం అయ్యాయి లేదా అపజయం అయ్యాయి అనేది కాలమే జవాబు చెబుతుంది.

      జై అన్నామలై.

  3. శ్రీ ప్రసాదు గారికీ, 

    మీ కు గల రచనా రంగం, పలు విషయ విశ్లేషణ లో  అనుభవం గల వ్యక్తిగా, 

    సాంకేతిక రంగాల్లో ఇప్పుడు వచ్చిన అనేక విప్లవాత్మక అవకాశాలు వలన, 

    ఇలాంటి వెబ్సైట్ లో మాత్రమే కాకుండా,  దానికి తోడుగా

    యూట్యూబ్ చానెల్ లాంటిది కూడా మొదలు పెట్టీ అందులో మీ ఆలోచనలు పంచుకుంటే ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది ఏమో గమనిక చెయ్యగలరు.

  4. మనదేశంలో చదువురానివారు తెలిసోతెలియకో అవినీతిపార్టీలకు మద్దత్తు ఇచ్చారంటే అర్ధం ఉన్నది. ఈ అపానవాయువు గాడు అర్ధసత్యాలతో సగం అబద్దాలతో వక్రీకరించి వ్యాసాలు రాస్తాడు. ఈ వెధవకు బీజేపీ పడదు. కానీ అవినీతిమురుగులో దొర్లే కాంగ్రెస్ గురించి ముక్క రాయడు.

    జాతీయగీతం పాడకుండా తమిళగీతం పాడినందుకు గవర్నర్ వాకౌట్ చేస్తే దాన్ని మార్చి మరొకరకంగా ఈ గాడిద రాసాడు. గవర్నర్ ప్రసంగంలో LTTE తమిళజాతీయవాదం ఉటంకిస్తే ఈ గాడిద దాన్ని చెప్పకుండా వేరే చెప్పాడు.

    దిగజారిన జనం ఉన్న దేశంలో గెలవాలంటే ఏ పార్టీకైనా దిగజారుడు తప్పదు ముఖ్యంగా అపానవాయువుగాడి లాంటి ఓటర్లు ఉన్న దేశంలో

  5. కర్నాటకలో రెండుసార్లు అధికారంలోకి రావటం చాలా మామూలు సంగతి. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభావం నుండి బయటపడి స్వంతంగా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలవటం పెద్ద లెక్కలోనిది కాదు

    తమిళనాడు పార్లమెంటు ఎన్నికలలో బలిష్టమైన ద్రవిడవాదాన్ని ఎదుర్కుని స్వంతంగా 11% ఓట్లూ కూటమిగా 18% ఓట్లూ సంపాదించటం చాలా సామాన్యమైన విషయం. కేరళలో జీరో నుండి మొదలెట్టి ఇవాళ 16% ఓట్లు సంపాదించటం కూడా లెక్కలోకి రాని సంగతే.

    క్రమంగా దేశానికీ వ్యతిరేకంగా ప్రమాదకరంగా తయరవుతూ హిందువుల నాశనం కోసం కంకణం కట్టుకున్న డీఎంకే ను గద్దె దించి అణచివేయటానికి బీజేపీ తన వ్యూహం మార్చుకున్నది అనుకోవచ్చుగా. అన్నామలై ఎక్కడా అసంతృప్తి పొందినట్లు లేదే !

Comments are closed.