భాగ‌స్వామిపై ఆస‌క్తి కోల్పోవ‌డానికి రుజువులు ఇవే!

ఎంత బిజీగా ఉన్నా.. ఆ బిజీ అంతా పార్ట్ న‌ర్ కు, ఫ్యామిలీకీ టైమ్ కేటాయించిన త‌ర్వాతే అనేది గ‌మ‌నించాల్సిన అంశం.

నిజంగానే మ‌నిషి జీవిత‌కాలం వైవాహిక భాగ‌స్వామిపై ఒకే స్థాయి ప్రేమాస‌క్తుల‌తో ఉండ‌గ‌ల‌డా అనేది.. చ‌ర్చ‌నీయాంశం! మ‌నిషి ప‌రిణామ‌క్ర‌మం చూస్తే.. ఒకే భాగ‌స్వామికి ప‌రిమితం కావ‌డం జంతు ప్ర‌వృత్తి కాదు! మ‌నిషి కూడా జంతువే, అయితే సంఘ‌జీవిగా మారాడు, నియ‌మాల‌ను పెట్టుకున్నాడు, త‌న నియ‌మాల‌ను స‌వ‌రించుకుంటూ వ‌చ్చాడు ఆలోచ‌న తీరులో వ‌చ్చిన మార్పుల‌ను బ‌ట్టి! అయితే ఎంత నియామాల‌న‌నుసారం వైవాహిక జీవితాన్ని మ‌నిషి నెత్తికెత్తుకున్నా.. స‌హ‌జ‌సిద్ధ‌మైన నైజం ఒక‌టి ఉంటుంది. ఇది వ్య‌క్తుల‌ను ప్ర‌భావితం చేస్తుంది. దీని ఫ‌లితాలే కొంద‌రు వైవాహిక జీవితాల‌కు ముగింపును ఇచ్చేసి విడాకుల బాట ప‌డుతూ ఉంటారు. వాటికి కూడా చ‌ట్టాల‌ను చేసుకున్నాడు మ‌నిషి. మ‌రి వారి సంగ‌త‌లా ఉంటే.. క‌లిసి కాపురాల‌ను చేస్తున్న మాత్రానా.. భాగ‌స్వామిపై ప్రేమాస‌క్తులు ఉంటాయా అంటే.. ఈ విష‌యాన్ని ప‌రిశీలించుకోవ‌చ్చు అంటున్నాయి ప‌రిశోధ‌న‌లు!

కొందరికి పెళ్లైన కొత్త‌లో భాగ‌స్వామిపై బాగా ప్రేమాస‌క్తులు ఉండ‌వ‌చ్చు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండ‌వ‌చ్చు. ఒకరు లేక‌పోతే మ‌రొక‌రు ఉండ‌లేమ‌న్న‌ట్టుగా ఆ స‌మ‌యంలో జంటలు భావించ‌వ‌చ్చు. అయితే అలాంటి భావ‌న‌లు దీర్ఘ‌కాలం కొన‌సాగ‌వ‌చ్చు, కొన‌సాగ‌క‌పోవ‌చ్చు!

అరేంజ్డ్ మ్యారేజ్ తో జ‌స్ట్ 15 నిమిషాల పెళ్లి చూపుల‌తో ఎన్నో జంట‌లు ఏక‌మ‌వుతూ ఉంటాయి. ఇలాంటి జంట‌ల్లో ఆదిలో ఒక‌రి గురించి ఒక‌రు పూర్తిగా అర్థం కాక‌పోవ‌చ్చు. వారి మ‌ధ్య‌న స‌మ‌న్వ‌యానికి స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. పెళ్లైన కొత్త‌లో లేని ఆపేక్ష వీరిలో కాలం గ‌డిచే కొద్దీ ఏర్ప‌డ‌వ‌చ్చు! ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు జీవిత‌కాలం అలాగే ఉండ‌రు, అరేంజ్డ్ మ్యారేజ్ లోని వారు పెళ్లి త‌ర్వాత ఒక‌రి ప్రేమ‌లో మ‌రొక‌రు ప‌డి హ్యాపీగా కాలం గ‌డ‌పనూ వ‌చ్చు. ఇదంతా వ్య‌క్తిగ‌తం. ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు న‌చ్చేలా న‌డుచుకోవ‌డం మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

అయితే భాగ‌స్వామి ఆస‌క్తిని కోల్పోతున్న ప‌రిస్థితుల‌ను మాత్రం అర్థం చేసుకోవ‌చ్చ‌ట‌. ఆప‌రిస్థితులు ఎలాంటి వంటే.. మాట్లాడుకున్న‌ప్పుడు ఎమోష‌న్స్ కు సంబంధించిన అంశాల కంటే, ఆర్థిక వ్య‌వ‌హారాలు, ప‌నుల గురించినే అతిగా మాట్లాడుకుంటున్నారంటే.. అది డేంజ‌ర్ బెల్ అని అంటున్నాయి ప‌రిశోధన‌లు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య‌న ఆర్థిక విష‌యాలు అతిగా చ‌ర్చ‌కు వస్తూ.. వాటి ధ్యానమే ఎక్కువైతే .. ప‌ర‌స్ప‌రం ఆస‌క్తి కోల్పోయార‌నేందుకు ఒక సంకేతం ఇది అట‌!

టూ బిజీగా క‌నిపించ‌డం.. క‌లిసి కూర్చుని మాట్లాడేంత స‌మ‌యం ఒక‌రికొక‌రు కేటాయించుకోక‌పోవ‌డం, ఉద్యోగంతోనో, ఇత‌ర ప‌నుల‌తోనో, సొంత హాబీల‌తోనే కాలం గ‌డిపేస్తూ.. టూ బిజీగా క‌నిపిస్తూ.. భాగ‌స్వామికి అస్స‌లు టైమ్ ఇవ్వ‌లేక‌పోవ‌డం అంటే.. ఇదంతా బిజీగా ఉండ‌టం కాదు, జ‌స్ట్ పార్ట్ న‌ర్పై ఆస‌క్తి కోల్పోవ‌డంతోనే అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. ఆ బిజీ అంతా పార్ట్ న‌ర్ కు, ఫ్యామిలీకీ టైమ్ కేటాయించిన త‌ర్వాతే అనేది గ‌మ‌నించాల్సిన అంశం.

శారీర‌క ఆక‌ర్ష‌ణ త‌గ్గిపోవ‌డం కూడా ఇలాంటి సంకేత‌మే అని అంటున్నారు. శృంగార‌పై మోజు మ‌రీ త‌గ్గిపోవ‌డం, ప్ర‌త్యేకించి క‌నీసం ట‌చ్ చేయాల‌నే ఆసక్తిని కూడా ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం.. అత్యంత డేంజ‌ర్ సిగ్న‌ల్ అని ఈ అధ్య‌య‌నం చెబుతోంది.

మీతో కూర్చుని మాట్లాడుతున్న‌ప్పుడూ ఏవేవో చెబుతూ కూడా.. ఏదైనా ఒక ఫ్యూచ‌ర్ ప్లాన్ ను మీదో డిస్క‌స్ చేయ‌క‌పోవ‌డం, క‌నీసం అలాంటి ఊహ‌ల‌ను అయినా మీతో పంచుకోక‌పోవ‌డం అంటే.. ఇక ఆ దాంప‌త్యం అన్యోన్యం అనుకోవ‌డం అమాయ‌క‌త్వం అవుతుంద‌ని ఈ అధ్య‌య‌నం వివ‌రిస్తూ ఉంది!

అలాగే పార్ట్ న‌ర్ పై ఏదో ఒక వంక పెట్టుకుని విసుగును ప్ర‌ద‌ర్శించ‌డం, ఎంత‌సేపూ త‌ప్పుల‌ను ఎంచుతూ ఉండ‌టం కూడా.. వైవాహిక జీవితం ప్ర‌మాదక‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉంద‌నేందుకు రుజువు అవుతుంద‌ని ఈ ప‌రిశోధ‌న‌లో పేర్కొన్నారు.

One Reply to “భాగ‌స్వామిపై ఆస‌క్తి కోల్పోవ‌డానికి రుజువులు ఇవే!”

Comments are closed.