Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రౌడీ ఫెలో

సినిమా రివ్యూ: రౌడీ ఫెలో

రివ్యూ: రౌడీ ఫెలో
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: మూవీ మిల్స్‌ అండ్‌ సినిమా 5
తారాగణం: నారా రోహిత్‌, రావు రమేష్‌, విశాఖ సింగ్‌, అజయ్‌, గొల్లపూడి మారుతిరావు, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, సత్య తదితరులు
సంగీతం: సన్నీ ఎమ్‌.ఆర్‌. 
కళ: రఘు కులకర్ణి
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: ఓమ్‌
నిర్మాత: ప్రకాష్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
విడుదల తేదీ: నవంబర్‌ 21, 2014

‘రౌడీ ఫెలో’ ప్రోమోస్‌ ఎఫెక్టివ్‌గా ఉండడంతో దీనిపై సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్‌ కలిగింది. ట్రెయిలర్స్‌తో ఇంప్రెస్‌ చేసిన ‘రౌడీ ఫెలో’ సినిమాగా ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకుందో లేదో చూడండి. 

కథేంటి?

తన ఈగోని హర్ట్‌ చేస్తే అందుకోసం ఏమైనా చేసే మనస్తత్వమున్న అపర ధనికుడు రాణా (నారా రోహిత్‌). ఒక ఎస్పీ తన ఈగో హర్ట్‌ చేసాడని పట్టుబట్టి పోలీస్‌ ఉద్యోగం వేయించుకుని ఎస్‌.ఐ.గా అదే ఎస్పీ డివిజన్‌లోకి వస్తాడు రాణా. బాధ్యత మర్చిపోయి జల్సాలు చేస్తోన్న రాణాకి ఒక పెద్దావిడ కొట్టిన చెంపదెబ్బతో కర్తవ్యం బోధ పడుతుంది. అప్పట్నుంచి ఆ ఊరిని వేధిస్తున్న రాజకీయ నాయకుడు అసురగణ దుర్గా ప్రసాద్‌ (రావు రమేష్‌) మీద దృష్టి పెడతాడు. కేవలం తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి పోలీస్‌ అయిన రాణా ఆ తర్వాత తన దూకుడుతో ఆ ఊరికి ఎలా మంచి చేసాడన్నదే ‘రౌడీ ఫెలో’ కథ. 

కళాకారుల పనితీరు:

నారా రోహిత్‌ యారొగెంట్‌ పోలీస్‌గా బాగానే చేసాడు. తన బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌ అయిన వాయిస్‌ని ఈ చిత్రంలో బాగా వాడుకున్నారు. మంచి డైలాగులతో రోహిత్‌ తన బలహీనతల్ని కవర్‌ చేసుకున్నాడు. పవర్‌ఫుల్‌గా కనిపించే సన్నివేశాల్లో మినహా అతను మిగిలిన ఎమోషన్స్‌ పెద్దగా పండించలేడు. ఈ క్యారెక్టర్‌ తన స్ట్రెంగ్త్‌కి తగ్గట్టు డిజైన్‌ చేసినది కావడంతో రోహిత్‌ పని ఈజీ అయింది. అయితే పోలీస్‌ పాత్ర చేస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా ఫిట్‌గా కనిపించడానికి అయినా రోహిత్‌ ట్రై చేసి ఉండాల్సింది. మరీ లావుగా ఉండడంతో కొన్ని సందర్భాల్లో మరీ ఆడ్‌గా కనిపించాడు. 

విశాఖ సింగ్‌ క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్‌ లేదు. ఆమె నటన ఓకే కానీ చూడ్డానికి చాలా యావరేజ్‌గా ఉంది. రావు రమేష్‌ కుటిల రాజకీయ నాయకుడి పాత్రలో జీవించేసాడు. అతని డైలాగ్‌ మాడ్యులేషన్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో నవ్వించాడు. సత్య కూడా సునీల్‌ని ఇమిటేట్‌ చేస్తూ అక్కడక్కడా ఎంటర్‌టైన్‌ చేసాడు. అజయ్‌, గొల్లపూడి మారుతిరావు, ప్రవీణ్‌ తదితరులు తమకిచ్చిన రోల్స్‌ జస్టిఫై చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

సన్నీ పాటలు వినడానికి బాగానే అనిపించాయి కానీ క్యాచీగా లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నా కానీ మెయిన్‌ థీమ్‌ ఏదైతే ఉందో అది ‘స్వామిరారా’ సినిమా మ్యూజికల్‌ థీమ్‌ని తలపించింది. సినిమాటోగ్రఫీ టాప్‌ లెవల్లో ఉంది. ఆ పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపిస్తూ... సినిమా కథకి అనుగుణమైన ఆ గాంభీర్యాన్ని కూడా ఛాయాగ్రహణంతో హైలైట్‌ చేయగలిగారు. ప్రొడక్షన్‌ డిజైన్‌ చాలా బాగుంది. 

Video: Chit Chat With Nara Rohit and Visakha Singh

గేయ రచయితగా అనుభవం ఉన్న కృష్ణ చైతన్య దర్శకుడిగా తొలి చిత్రాన్నే చాలా బాగా హ్యాండిల్‌ చేసాడు. ముఖ్యంగా సాంకేతిక వర్గం నుంచి అతను రాబట్టుకున్న అవుట్‌పుట్‌ మెప్పిస్తుంది. స్టయిలిష్‌ టేకింగ్‌తో, చక్కని సంభాషణలతో కృష్ణ చైతన్య తన ముద్ర వేయగలిగాడు. రొటీన్‌కి భిన్నంగా తన ఆలోచనలు ఉంటాయని ఒక మామూలు పోలీస్‌-పొలిటీషియన్‌ కథని డిఫరెంట్‌గా ప్రెజెంట్‌ చేయడం ద్వారా చూపించాడు. అయితే స్టయిల్‌ పేరిట మరీ నిదానంగా కథని నడిపించడం వల్ల అతని తొలి ప్రయత్నం తను కోరుకున్న ఫలితాన్ని అందించకపోవచ్చు. 

హైలైట్స్‌:

  • డైలాగ్స్‌
  • సినిమాటోగ్రఫీ
  • ప్రొడక్షన్‌ డిజైన్‌

డ్రాబ్యాక్స్‌:

  • నిదానంగా సాగే కథనం
  • సీరియస్‌ ప్లాట్‌

విశ్లేషణ:

‘పురాణాలన్నీ ఈగో ప్రాబ్లెమ్సే’ అనుకునే హీరో... ‘కోపం చాలా కాస్ట్‌లీ అన్నమాట. దానిని మాటిమాటికీ వాడకూడదు’ అనే విలన్‌. చిన్న ఈగో ప్రాబ్లెమ్‌ కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఒక చిన్న పల్లెటూరిలో ఎస్‌ఐగా పని చేయడానికి వచ్చేస్తాడు హీరో. తన దారికి హీరో ఎంత అడ్డు తగులుతున్నా కానీ ఓపిగ్గా సమయం కోసం వేచి చూస్తాడు విలన్‌. హీరో, విలన్‌ క్యారెక్టరైజేషన్స్‌ని బాగా తీర్చిదిద్దడమే కాక... వారిద్దరూ కలబడడానికి అవసరమైన కాన్‌ఫ్లిక్ట్‌ని కూడా బాగా క్రియేట్‌ చేసాడు డైరెక్టర్‌ కృష్ణ చైతన్య. పోలీస్‌ అయిన హీరో, పొలిటీషియన్‌ అయిన విలన్‌ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కానీ ఈ చిత్రం వాటికి భిన్నంగా ఉందనిపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. 

‘రౌడీ ఫెలో’ చిత్రంలో మంచి సంభాషణలున్నాయి. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే క్యారెక్టర్స్‌ ఉన్నాయి. సహజత్వం ఉట్టిపడే చిత్రీకరణ కూడా జత కలిసింది. అయితే వీటన్నిటినీ ఎంజాయ్‌ చేస్తూ కూర్చోబెట్టగలిగే కథనం లోపించింది. ఆరంభంలో ఒక మెటాడోర్‌ మట్టి రోడ్డుపై నిదానంగా అలా కదల్లేక కదల్లేక కదులుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా అచ్చంగా ఆ మెటాడోర్‌లానే నిదానంగా... తాపీగా ముందుకు వెళుతుంటుంది. రెండున్నర గంటల సమయానికే నాలుగ్గంటల పాటు కూర్చున అనుభూతిని కలిగిస్తుంది. స్లో మోషన్‌ షాట్స్‌తో హీరోని స్టయిలిష్‌గా చూపించడానికి దర్శకుడు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపించాడు. చిన్న డైలాగ్‌ అయినా పాజ్‌లు ఇచ్చి చెప్పిస్తూ స్టయిలిష్‌ నాన్చుడుతో విసిగించాడు. అవన్నీ రెగ్యులర్‌ స్పీడ్‌తో తీసేసినట్టయితే ఒక అరగంట నిడివి తగ్గిపోయి ఉండేదేమో! 

అసలే భారమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కనుక కథనం వేగంగా ఉండి ఉంటే బాగుండేది.  అక్కడక్కడా కామెడీతో కాస్త రిలీఫ్‌ ఇచ్చినా కానీ ఓవరాల్‌గా స్లో పేస్‌ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ నిదానాన్ని సహించగలమనుకుంటే ‘రౌడీఫెలో’లో మెచ్చుకోతగ్గ అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా సంభాషణలు, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌డ్రాప్‌ మెప్పిస్తాయి. పతాక సన్నివేశంలో రోహిత్‌, రావు రమేష్‌ మధ్య కాన్‌ఫ్రంటేషన్‌ కూడా బాగుంది. ద్వితీయార్థంలో ఉన్నంత కంటెంట్‌ ప్రథమార్థంలో లేకపోవడం, ఫస్టాఫ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ సెకండాఫ్‌లో మిస్‌ అయి సీరియస్‌గా మారడం వల్ల బ్యాలెన్స్‌ మిస్‌ అయింది. ఒక అరగంట నిడివి తగ్గించుకుని.. వేగంగా, వినోదాత్మకంగా కథని నడిపించి ఉన్నట్టయితే రౌడీ ఫెలో ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేసి ఉండేది. ప్లస్సులతో సమానంగా మైనస్‌లు కూడా ఉండడం వల్ల టోటల్‌గా యావరేజ్‌గా మిగిలింది. 

బోటమ్‌ లైన్‌: రౌడీ ఫెలో - వెరీ స్లో!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Video: Rowdy Fellow Public Talk

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?