Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని

సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని

రివ్యూ: ఉలవచారు బిర్యాని
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌
తారాగణం: ప్రకాష్‌రాజ్‌, స్నేహ, తేజస్‌, సంయుక్త హోర్నాడ్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ, ఊర్వశి, ఐశ్వర్య తదితరులు
సంగీతం: ఇళయరాజా
కూర్పు: కిషోర్‌ టే
ఛాయాగ్రహణం: ప్రీత
నిర్మాత, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌
విడుదల తేదీ: జూన్‌ 6, 2014

నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి, జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్న ప్రకాష్‌రాజ్‌ దర్శకుడిగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడలో ఆకాశమంత చిత్రానికి దర్శకత్వం వహించాక ధోని అనే సినిమాతో దర్శకుడిగా మనముందుకి వచ్చాడు. ఆ చిత్రం పరాజయం పాలయినా మరోసారి ‘ఉలవచారు బిర్యాని’ వండి వడ్డించాడు. నటుడిగా తల పండిన ప్రకాష్‌రాజ్‌కి దర్శకుడిగా చేయి తిరిగిన వంటగాడో లేదో చూద్దాం...

కథేంటి?

నలభై అయిదేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని కాళిదాసుకి (ప్రకాష్‌రాజ్‌) రాంగ్‌ నంబర్‌ వల్ల గౌరి (స్నేహ) పరిచయం అవుతుంది. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాని గౌరి, కాళిదాసు ఫోన్‌లో మాటల్తోనే దగ్గరవుతారు. అయితే ఒకరికి ఒకరు ఎదురు పడడానికి జంకుతారు. తమ వయసు తెలిసిపోతే అవతలి వ్యక్తి దూరమైపోతారేమో అని భయపడతారు. ఇద్దరూ కలుద్దామని అనుకున్నా కానీ తాము వెళ్లకుండా తమకి తెలిసిన యువ జంటని (తేజస్‌, సంయుక్త) తమ స్థానంలో పంపిస్తారు. ఈ యువ జంట మధ్య ప్రేమ చిగురిస్తుంది కానీ.. కాళిదాసు, గౌరి మధ్య దూరం పెరుగుతుంది. మరి చివరకు వాళ్లిద్దరూ ఎలా కలుస్తారు?

కళాకారుల పనితీరు:

ప్రకాష్‌రాజ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది. వయసు మళ్లిన పాత్రలు చేసినా.. హీరోలకి తండ్రిగా, తాతగా అనేక చిత్రాల్లో నటించినా.. పెళ్లి కాని ఒక నడి వయసు బ్రహ్మచారి పాత్రలో మరోసారి కొత్తగానే కనిపించాడు. తన పాత్రని, ఎమోషన్స్‌ని ఈజీగా అర్థం చేసుకునేలా చేయగలిగాడు. చాలా తక్కువ మంది నటులకి మాత్రమే సాధ్యమయ్యేదిది. నటుడిగా ఈ చిత్రానికి ప్రకాష్‌రాజ్‌ పూర్తి న్యాయం చేసాడు. 

స్నేహ కూడా తన పాత్రలో జీవించింది. ఆమె గెటప్‌ పాత్రకి జీవం తెచ్చిపెట్టింది. తేజస్‌ గొప్ప నటుడేమీ కాదు కానీ ఓకే అనిపిస్తాడు. సంయుక్త కూడా అంతే.. జస్ట్‌ బిలో యావరేజ్‌ నటి. సీనియర్‌ నటీమణులు ఐశ్వర్య, ఊర్వశి బాగా చేసారు. బ్రహ్మాజీ క్యారెక్టర్‌ ఆకట్టుకుంటుంది. ఎమ్మెస్‌ నారాయణ కూడా అడపాదడపా నవ్విస్తాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఇళయరాజా సంగీతం సోసోగా ఉంది. సాధారణంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో అస్సలు తక్కువ స్కోర్‌ చేయని ఇళయరాజా ఈ చిత్రంలో మాత్రం తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రకృతి సౌందర్యాన్ని, వంటలని ప్రీత కెమెరా అందంగా నోరూరించేలా బంధించింది. ఎడిటింగ్‌ పరంగా లోపాలున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో సన్నివేశాల మధ్య లింక్‌ లేకుండా పోయింది. కథాపరంగా ఆకట్టుకుంటుంది. మలయాళంలో రూపొందిన ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ సినిమాకి రీమేక్‌ ఇది. ఆ కథా రచయిత చక్కని ప్రేమకథ రాసుకున్నాడు. అయితే దానిని అనువదించి... అదే ఫీల్‌ తీసుకురావడంలో ఇక్కడి రచయితలు, దర్శకులు విఫలమయ్యారు. 

ప్రకాష్‌రాజ్‌ మరోసారి దర్శకుడిగా జస్ట్‌ యావరేజ్‌ అనిపిస్తాడు. చేయి తిరిగిన వంటగాడి చేతిలో అయితే ఈ సినిమా ఘుమఘుమలాడిపోయి ఉండేది. ద్వితీయార్థంలో దర్శకుడిగా ప్రకాష్‌రాజ్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలని ఆకట్టుకునేలా తెరకెక్కించిన ప్రకాష్‌రాజ్‌ ఆ చురుకు రెండో సగంలో చూపించలేకపోయాడు. ధోనీ చిత్రంలో తనలోని నటుడ్ని కూడా తనలోని దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి ప్రకాష్‌రాజ్‌ అనే యాక్టర్‌ని బ్రహ్మాండంగా వాడుకున్నా కానీ డైరెక్టర్‌గా కీలకమైన సమయాల్లో ఫెయిలయ్యాడు. 

హైలైట్స్‌:

  • ప్రకాష్‌రాజ్‌ అభినయం
  • ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని లైట్‌ రొమాంటిక్‌ మొమెంట్స్‌
  • సినిమాటోగ్రఫీ

డ్రాబ్యాక్స్‌:

  • సెకండ్‌ హాఫ్‌లో ట్రాక్‌ తప్పిన స్క్రీన్‌ప్లే
  • ఆకట్టుకోని పతాక సన్నివేశాలు

విశ్లేషణ:

కలుషిత ప్రేమకథల్ని తెరకెక్కిస్తూ ట్రెండ్‌కి తగ్గట్టు తీస్తున్నామని సమర్ధించుకుంటోన్న దర్శకులున్న ఈ టైమ్‌లో హృద్యమైన ప్రేమకథలు అరుదైపోయాయి. ప్రకాష్‌రాజ్‌ వండిన ఉలవచారు బిర్యాని అలాంటి అరుదైన పొల్యూట్‌ కాని లవ్‌స్టోరీ. అయితే ఈ చిత్రం గొప్పతనం అంతటితోనే ఆగిపోయింది. క్లీన్‌ రొమాన్స్‌, ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ మినహా ఈ చిత్రంలో చెప్పుకోడానికి విశేషాలు ఏమీ లేవు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ తన వయసు వారి ఫీలింగ్స్‌ని స్టడీ చేసినట్టుగా నేటి యువతని ఫాలో కావడం లేదనిపించింది. 

స్నేహ, ప్రకాష్‌రాజ్‌ నడుమ వచ్చే సన్నివేశాల్లో ఉన్న ఫీల్‌ యువ జంట అయిన తేజస్‌, సంయుక్త మధ్య సన్నివేశాల్లో అస్సలు కనిపించలేదు. ప్రథమార్థానికి స్నేహ, ప్రకాష్‌రాజ్‌ సీన్స్‌ హైలైట్‌గా నిలిచినపుడు ద్వితీయార్థంలో యంగ్‌ రొమాన్స్‌ కూడా అంతే ఇంపాక్ట్‌ చూపించాలి. కానీ ఇక్కడ ప్రకాష్‌రాజ్‌ ఇన్‌వాల్వ్‌ అయినట్టు కనిపించలేదు. ఏదో పైపైన సన్నివేశాలు తీసుకుంటూ పోవడమే తప్ప ఫీల్‌ తీసుకురావడంలో విఫలయ్యాడు. 

అలాగే అసలు కథలో సంబంధం లేని ఒక ‘అడవి మనిషి’ ట్రాక్‌ బిర్యానిలో పంటి కింది రాయిలా తగుల్తుంది. పోనీ ఆ ఉప కథకి ఏదైనా సరైన ముగింపు ఇచ్చి ఉన్నట్టయితే దానిని ఈ కథలోకి లాగినందుకు ఉపయోగం కనిపించి ఉండేది. కానీ దానిని అలా దారం తెగిన గాలిపటంలా వదిలేయడంతో ఆ సీన్స్‌ అన్నీ కూడా ఈ సినిమాకి అవసరం లేని ‘వేస్టేజ్‌’ అనిపిస్తాయి. కథలో అత్యంత కీలకమైన స్నేహ, ప్రకాష్‌రాజ్‌ల కాన్‌ఫ్రంటేషన్‌ కూడా చాలా చాలా సాధారణంగా తెరకెక్కడంతో పతాక సన్నివేశం తేలిపోయింది. 

మొత్తంగా ప్రథమార్థంలో సినిమాపై ఉన్న ప్రేమ, మమకారాలు... దానిని ముగించేటపుడు దర్శకుడికి ఆ స్థాయిలో లేవనిపిస్తాయి. అన్యమనస్కంగా ఏదో ముగించాలని ముగించేసినట్టుగా అనిపించడంతో ఉలవచారు బిర్యానీకి సువాసనలే తప్ప రుచి లేకుండా పోయింది. వంట చేసేటపుడు పొయ్యి వెలిగించే దగ్గర్నుంచి... దానిని దించి, వడ్డించే వరకు అదే కాన్సన్‌ట్రేషన్‌ ఉంటే తప్ప వంటకం రుచిగా ఉండదు. ప్రకాష్‌రాజ్‌కి మొదలు పెట్టడంలో ఉన్న శ్రద్ధ ముగించడంలో లేకపోయింది. అందుకే ఉలవచారు బిర్యానీ ఉడికీ ఉడక్కుండా వడ్డించేసినట్టుంది. 

బోటమ్‌ లైన్‌: ఉడకని బిర్యానీ!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?