Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఎవడే సుబ్రమణ్యం

సినిమా రివ్యూ: ఎవడే సుబ్రమణ్యం

రివ్యూ: ఎవడే సుబ్రమణ్యం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: స్వప్న సినిమా
తారాగణం: నాని, మాళవిక నాయర్‌, విజయ్‌ దేవరకొండ, కృష్ణంరాజు, నాజర్‌, రీతూ వర్మ, కిరీటి, శ్రీనివాస్‌ అవసరాల, పవిత్ర లోకేష్‌ తదితరులు
సంగీతం: రాధాన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: రాకేష్‌, నవీన్‌
నిర్మాత: ప్రియాంక దత్‌
రచన, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
విడుదల తేదీ: మార్చి 21, 2015

డబ్బు సంపాదన, జీవితంలో పైకి ఎదగాలనే తపనతో మనిషి ఎంత స్వార్ధపరుడిగా మారిపోతున్నాడో, జీవితాన్ని జీవించడం మానేసి ఎంత యాంత్రికంగా తయారవుతున్నాడో చూపించే ప్రయత్నం ‘ఎవడే సుబ్రమణ్యం’లో చేసారు. ‘అసలు తను ఎవరు?’ అని సుబ్రమణ్యం ఓ ప్రయాణంలో తనలో తనని ఎలా చూసుకున్నాడో, తన గురించి తానేం తెలుసుకున్నాడో అన్నదే ఈ చిత్రం. 

సెల్ఫ్‌ రియలైజేషన్‌ అనే కాన్సెప్ట్‌లోనే బోలెడంత ఎమోషన్‌ ఉంది, ఎంతో డ్రామా ఉంది. ఇవి రెండూ కలిసిన చోట వినోదానికి తక్కువ చోటుంటుంది, వేగం మిస్‌ అవుతుంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ జర్నీని ఎంజాయ్‌ చేయాలంటే వీటన్నిటికీ ప్రిపేర్‌ అవ్వాలి. కాలి నడకన సాగుతున్న ప్రయాణంలో వేగానికి చోటు లేదు. తనని తాను అన్వేషించుకునే మార్గంలో వినోదానికి స్కోప్‌ ఉండదు. కాకపోతే దీనిని అర్థం చేసుకుని ‘సుబ్రమణ్యం’ని ఇందులోని ‘రిషి’కున్నంతటి పెద్ద మనసుతో ఎంత మంది చూస్తారనేది తెలీదు. సగటు వినోద ప్రియుడికి సుబ్రమణ్యం ప్రయాణం విసుగు పుట్టిస్తుంది. కానీ కథాపరమైన లోతు గమనించిన వాళ్లకి ఇందులో జీవం కనిపిస్తుంది. ఇదేదో మామూలు సినిమా కానే కాదు. మనసు పెట్టి తీసింది... మనసుల్ని తాకేది! 

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కొత్తవాడే అయినా చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించాడు. సినిమాగా మలచడానికి క్లిష్టమైన కాన్సెప్ట్‌ని తీసుకుని, కమర్షియల్‌ రిజల్ట్‌ ఏమవుతుందనే దాని గురించి ఆలోచించక.. తన ఆలోచనలకి, తన భావాలకి దృశ్యరూపమిచ్చాడు. అతడి ఆలోచనల భుజం తట్టి పెట్టుబడి పెట్టిన వారికి, అతడిపై నమ్మకం ఉంచి నటించడానికి ముందుకొచ్చిన నానికి కూడా ఈ సినిమా తాలూకు క్రెడిట్‌ దక్కుతుంది. 

సుబ్రమణ్యం (నాని) ఒక సగటు యువకుడు. జీవితంపై ఎన్నో ఆశలు, జీవితంలో ఎంతో ఎత్తుకి రావాలనే కోరికలు ఉన్నోడు. ఈ ప్రాసెస్‌లో ప్రేమని, పెళ్లిని కూడా తన భవిష్యత్తుతో తూకమేసేస్తాడు. చిన్నప్పుడు తనని వదిలిపోయిన స్నేహితుడు రిషి (విజయ్‌ దేవరకొండ) వచ్చి ‘నువ్వు ఎవరు’ అనే ప్రశ్న సంధిస్తాడు. హిమాలయాల్లోని దూద్‌ కాశికి (ఆకాశగంగ) వెళితే మనకి మనమంటే ఏంటో తెలుస్తుందని చెబుతూ అక్కడికి వెళ్లడానికి పదే పదే సుబ్బుని సతాయిస్తుంటాడు. తన భవిష్యత్తు కోసం, తన స్నేహితుడి కోసం సుబ్బు తనకి కొత్తగా పరిచయం అయిన ఆనందితో (మాళవికా నాయర్‌) కలిసి దూద్‌కాశికి బయల్దేరతాడు. ఆ ప్రయాణంలోనే సుబ్బుకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. డబ్బు కంటే విలువైనవి ఏవనేది అర్థమవుతుంది. 

సుబ్రమణ్యం పాత్ర పరిచయం, అతని కలలు, పక్కాగా ప్లాన్‌ చేసుకున్న జీవితం వగైరా అన్నీ ఈ చిత్రానికి పర్‌ఫెక్ట్‌ టేకాఫ్‌ ఇచ్చాయి. అతని జీవితంలోకి బాల్య స్నేహితుడు రావడంతో మొదలైన అలజడి, వారికి జత కలిసే ఆనందితో జరిగే స్నేహం వగైరా అన్నీ సరదాగా సాగిపోతూ ఆహ్లాదం కలిగిస్తాయి. ఒక సడన్‌ షాక్‌తో కూడా పూర్తిగా రియలైజ్‌ కాని సుబ్బు పాత్ర కాన్ట్‌ బట్‌ సిట్యువేషన్‌లో ఇష్టం లేని ట్రిప్‌కి దూద్‌కాశికి బయల్దేరుతుంది. ఆ ప్రయాణంలో సుబ్బులో కొద్ది కొద్దిగా వచ్చే మార్పులు, అతనికి ఆ దార్లో జరిగే కొత్త పరిచయాలు, ఆ ట్రిప్‌లో ఎదురయ్యే అనుభవాలు కదిలిస్తాయి. 

ఎంతో కన్విక్షన్‌, అంతకుమించి ఇంకెంతో కమిట్‌మెంట్‌ ఉంటే తప్ప ఇలాంటి కథల్ని కన్సీవ్‌ చేయలేరు. ఆ కథని మరెంతగానో ప్రేమిస్తే కానీ, ఏదో చెప్పాలనే ప్యాషన్‌ ఉంటే కానీ దానిని ఇంత పద్ధతిగా తెరకెక్కించలేరు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేసాడు. బహుశా ఇదే జర్నీని ఇంకాస్త ప్లెజెంట్‌గా, మరికొంచెం లైవ్‌లీగా, కుదిరితే కొద్దిగా వేగంగా నడిపించి ఉండొచ్చు. లేదా లీడ్‌ క్యారెక్టర్‌లో మార్పుని తీసుకురావడానికి మరింత ఎఫెక్టివ్‌గా అనిపించే సీన్స్‌ రాసుకుని ఉండొచ్చు. అనుభవం ఉన్న దర్శకులైతే ఆ దిశగా కూడా దృష్టి సారించేవారేమో. అయితే ఈ మైనస్‌లు ఉన్నంత మాత్రాన నాగ్‌ అశ్విన్‌ సృష్టిని విమర్శించలేం. ఉత్తమాభిరుచితో పాటు గొప్ప ఆలోచనలున్న దర్శకుడనే ఇంప్రెషన్‌ మొదటి సినిమాతోనే కలిగించాడు. అతడినుంచి మున్ముందు మరిన్ని అద్భుతమైన చిత్రాలు ఆశించవచ్చు. 

నానిలోని నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను చేసిన బ్యాడ్‌ మూవీస్‌లో కూడా నటుడిగా ఎప్పుడూ నూటికి నూరు శాతం న్యాయం చేసే నటుడతను. ఇక పాత్రలో విషయం ఉంటే తనలోని నటుడు శివతాండవం ఆడేస్తాడు. పక్క వాడి గురించి అస్సలు కేర్‌ చేయని మెటీరియలిస్ట్‌గా, తన అంతరాంతరాల్లో దాగిపోయిన మానవత్వాన్ని కనుగొన్న మనిషిగా... నాని చూపించిన వ్యత్యాసం, అతని అభినయం అద్భుతంగా ఉంది. పసిపాప జన్మించే సన్నివేశంలో నాని నటన చూస్తే ఈతరం నటుల్లో టాప్‌ క్లాస్‌ యాక్టర్స్‌లో నాని కూడా ఒకడని చెప్పడం అతిశయోక్తి అవదు. నానికి సపోర్ట్‌గా మాళవికా నాయర్‌ చాలా బాగా చేసింది. నిత్యామీనన్‌ని తలపించే ఫీచర్స్‌ ఉన్న మాళవిక కూడా తన ప్రతిభతో ఆకట్టుకుంటుంది. విజయ్‌ దేవరకొండ హుషారైన పాత్రలో బాగానే చేసాడు. నవదీప్‌లాంటి నోటెడ్‌ యాక్టర్‌ ఎవరైనా ఉండి ఉంటే ఈ క్యారెక్టర్‌ ఇంపాక్ట్‌ ఇంకా తెలిసేదేమో అనిపించింది. కృష్ణంరాజు పాత్ర చిన్నదే అయినా కథలో చాలా కీలకం. ఆయన ఈ చిత్రానికి మరో ఎస్సెట్‌గా నిలిచారు. రీతూ వర్మ, నాజర్‌ తదితరులు తమ వంతు సహకారం అందించారు.

హిమాలయాల్లో హీరో హీరోయిన్లు సాగించే ప్రయాణం చూస్తేనే ఈ చిత్ర బృందం దీనికోసం ఎంత కష్టపడిరదనేది అర్థమవుతుంది. రాధాన్‌ స్వరపరిచిన పాటలు సోసోగానే ఉన్నాయి కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రాఫర్స్‌ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. మనలో చాలా మంది ఎప్పటికీ చూడలేని హిమగిరుల సోయగాలని అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్‌ పరంగా కాస్త జాగ్రత్త పడాల్సింది. ఒక పావుగంట నిడివి తగ్గించినట్టయితే దీంతో బలంగా కనెక్ట్‌ కాని వారికి కూడా కాస్త వెసులుబాటు దక్కేది. ఈ చిత్రాన్ని ఎటెంప్ట్‌ చేసినందుకు, దీనికోసం ఇంత ఎఫర్ట్స్‌ పెట్టినందుకు ఇందులో ఇన్‌వాల్వ్‌ అయిన ప్రతి ఒక్కరినీ అభినందించాలి. 

నిదానంగా సాగుతుందనే కంప్లయింట్స్‌, మరీ డ్రామా ఎక్కువైందనే క్రిటిసిజమ్‌ ఈ చిత్రానికి సగటు ప్రేక్షకుల నుంచి పెద్దపెట్టునే వచ్చే అవకాశముంది. అయితే జోనర్‌ పరంగా ఈ చిత్రానికి అవి తప్పించుకోలేని ఇబ్బందులనేది అర్థం చేసుకోవాలి. అది అర్థమైన వారికి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఒక గుర్తుంచుకోతగ్గ ఎమోషనల్‌ ట్రిప్‌ అనిపిస్తుంది. కాని వారికి భారమైన సుదూర ప్రయాణమనిపిస్తుంది. అన్ని సినిమాలనీ కమర్షియల్‌ లెక్కలతోనే అంచనా వేయడం సరికాదు. అంతిమంగా వచ్చే ఆర్థిక ఫలితమేంటి, ఇంత కష్టానికి వచ్చే లాభమేంటి లాంటివి పక్కనపెడితే సినిమాగా ‘ఎవడే సుబ్రమణ్యం’ హృదయాలని హత్తుకునే ఒక చక్కని ప్రయత్నమనడంలో సందేహం లేదు. జీవితాన్ని యాంత్రికంగా గడిపేయడమే కాదు... జీవించడం తెలుసుకోవాలి అని ఈ చిత్రమిచ్చే చిన్న సందేశం ఒకరిద్దరిని తట్టి లేపినా అదీ చిత్రానికి పెద్ద విజయమే. ఆ మాటకొస్తే ఒకరిద్దరేంటి... ఈ చిత్రం ఖచ్చితంగా చాలా మందిని కదిలించి, జీవితమంటే ఏంటో గట్టిగా గుర్తు చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే కాకుండా సినిమా అంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉండాలని అనుకునే ప్రేక్షకుల్ని ఈ చిత్రం సంతృప్తిపరుస్తుంది. 
 
బోటమ్‌ లైన్‌: భళా సుబ్రమణ్యం!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?