బొగ్గు కుంభకోణంపై విచారిస్తున్న స్పెషల్ సిబిఐ కోర్టు మన్‌మోహన్ సింగ్‌ను ఏప్రిల్ 8 న హాజరు కావాలని ఆదేశించింది. ఆయనపై పెట్టిన అవినీతి, నేరపూరిత కుట్ర యిత్యాది కేసులు రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. టీవీ చర్చల్లో చాలామంది మన్‌మోహన్ సచ్ఛీలుడని అందరికీ తెలుసని, యితరుల ప్రమేయం వలన అనవసరంగా యిరుక్కున్నారని వాపోతున్నారు. కాంగ్రెసు పార్టీ అయితే చెప్పనే అక్కరలేదు. ''మన్‌మోహన్ నిజాయితీపరుడని యావత్ భారతదేశానికి తెలుసు. ఇది రాజకీయపరమైన కుట్ర. మన్‌మోహన్‌కు అండగా నిలిచి పోరాడతాం.'' అంటోంది. నిద్ర లేవడానికి ఒక కారణం కనబడింది కాబట్టి లేచి హడావుడి చేస్తోంది.
2012 మార్చిలో కాగ్ రిపోర్టు వచ్చాక 2013 అక్టోబరులో సిబిఐ కుమార మంగళం బిర్లా, పిసి పరేఖ్‌లపై కేసు పెట్టింది. 2014 ఆగస్టులో యీ కేసులో ఎవరూ నేరానికి పాల్పడలేదంటూ ముగింపు నివేదికను సుప్రీం కోర్టు ఏర్పరచిన స్పెషల్ కోర్టుకు సమర్పించింది. ఆ కోర్టు దాన్ని తిరస్కరించింది. మన్‌మోహన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని అడిగింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో సిబిఐ దృక్పథం, సిబిఐ కోర్టుల దృక్పథం మారినట్లుంది. ఇప్పుడు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాధిపతి భరత్ పరాశర్ 'మన్‌మోహన్‌ను నేరాభియోగంపై విచారించడానికి కావలసినన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి' అంటున్నారు.
195 బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాల కారణంగా 2004-09 మధ్య ఖజానాకు 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ అభిప్రాయపడింది. ఇలాటి అక్రమ కేటాయింపులు ఎప్పణ్నుంచో జరుగుతున్నాయని భావించి సుప్రీం కోర్టు 1993 నుంచి జరిగిన 214 కేటాయింపును 2014 ఆగస్టులో రద్దు చేసింది. ప్రస్తుత కేసు ఒడిశాలోని తాలాబిరా కోల్ బ్లాక్ బొగ్గు బ్లాకుల గురించి. వాటిని బొగ్గు శాఖ స్క్రీనింగ్ కమిటీ ప్రభుత్వ సంస్థలైన నైవేలీ లిగ్నయిట్‌కు, మహానది కోల్‌ఫీల్డ్‌స్‌కు కేటాయించింది. దాంతో కుమారమంగళం బిర్లా తమకు చెందిన హిందాల్కోకు కేటాయించమని కోరుతూ మన్‌మోహన్‌ను కలిసి స్క్రీనింగ్ కమిటీ సిఫారసును మళ్లీ పరిశీలించమని కోరారు. అభ్యర్థనను ప్రధాని కార్యాలయం బొగ్గు శాఖ కార్యదర్శి పరేఖ్‌కు పంపించింది. పరేఖ్ హిందాల్కోకు యివ్వాలని సిఫారసు చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం మంత్రి దాసరి నారాయణరావు అభిప్రాయం అడిగింది. ఆయన వద్దన్నారు. స్క్రీనింగ్ కమిటీ తిరస్కరించాక నిర్ణయం మళ్లీ మార్చుకోవడం సరికాదన్నారు. చివరకు మన్‌మోహన్ పరేఖ్ సూచనే పరిగణనలోకి తీసుకుని హిందాల్కోకి కేటాయించారు. ఇప్పుడు సిబిఐ ప్రత్యేక కోర్టు దాసరిని యీ కేసులో చేర్చలేదు. ప్రాథమిక ఆధారాల బట్టి హిందాల్కో, కుమార మంగళం బిర్లా, అధికారులు శుభేందు భట్టాచార్య నేరపూరితమైన కుట్ర చేసి పరేఖ్‌ను, మన్‌మోహన్‌ను అందులోకి లాగారని కోర్టు అంటోంది. వారికి సమన్లు పంపింది. ప్రధాని కార్యాలయంలోని అధికారులైన టికెఏ నాయర్, బివిఆర్ సుబ్రహ్మణ్యంలపై కూడా కేసు పెట్టాలని సిబిఐకు గతంలోని సూచించింది – ఇదీ తెలుగు పత్రికలు చదివితే మనకు లభించే సమాచారం. దాసరికి వేరే కేసుల్లో యిప్పటికే బొగ్గు మసి అంటింది. క్విడ్ ప్రో కో అభియోగాలున్నాయి. ఆయన రూల్సు ప్రకారం వెళతాననడం, పరేఖ్ నియమాలు వుల్లంఘిస్తాననడం వింతగా తోస్తోంది కదా. పరేఖ్ మన రాష్ట్రంలో కూడా పనిచేశారు. నిజాయితీకి నిలువుటద్దంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పొరపాటెందుకు చేసి వుండాలి? అన్న సందేహం కలుగుతుంది.
ఈ అరకొర సమాచారం వలన కోల్‌బ్లాక్‌ను హిందాల్కోకు మొత్తంగా కేటాయించారన్న అభిప్రాయం కలుగుతోంది. జరిగినది ఒక్కసారి పునరావలోకనం చేసుకుంటే – పరేఖ్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ తాలాబిరా 2, 3 బ్లాకులను ప్రభుత్వ సంస్థలైన నైవేలీ, మహానది కోల్‌ఫీల్డ్‌స్‌కు 2005 జనవరి 10 న కేటాయించింది. మార్చి 1 న హిందాల్కో, ఇండాల్ పెట్టుకున్న అప్లికేషన్లను తిరస్కరించింది. జూన్ 17 న కుమారమంగళం బిర్లా మన్‌మోహన్‌కు కలిసి తన వాదనను వినిపించాడు. తర్వాత పరేఖ్‌ను కలిశాడు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ల కంటె తమకు ఆర్థిక, సాంకేతిక, నిర్వహణాసామర్థ్యం మెరుగ్గా వున్నాయని వాదించాడు. ఈ వాదన పరేఖ్‌ను మెప్పించింది. ఒక జాయింట్ వెంచర్ ఏర్పడాలని సూచించారు. దానిలో ప్రభుత్వసంస్థలైన మహానది కోల్‌ఫీల్డ్ (70%), నైవేలి లిగ్నయిట్ (15%)లకు కలిపి 85% వాటా వుండగా, హిందాల్కోకు 15% వాటా వుండాలని ప్రతిపాదించారు. ఇది 2005 నవంబరు 10 న జరిగింది. మామూలుగా చూస్తే యిది ఆచరణాత్మకమైన సూచనే అనుకుంటారు. దీనికి తోడు ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ హిందాల్కోకు కేటాయిస్తే అల్యూమినియం ఫ్యాక్టరీ వచ్చి ఒడిశాలో ఉపాధి అవకాశాలు వస్తాయని, అదే నైవేలీకి యిస్తే బొగ్గు తవ్వుకుపోయి తమకు కాలుష్యం మాత్రమే మిగులుస్తుందని అభిప్రాయపడి హిందాల్కోకు యిమ్మనమని లేఖ రాశారు.
2013 అక్టోబరులో సిబిఐ తనపై కేసు బుక్ చేసినపుడు పరేఖ్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మీడియాకు చెప్పిన వాదన యిదే. ఇప్పుడు కూడా కోర్టు సమన్లు వచ్చాక మాట్లాడతాను కంగారేమీ లేదు అంటున్నాడు. ఈ వాదనను కోర్టు ఆమోదిస్తే అప్పుడు మన్‌మోహన్ కూడా తప్పించుకుంటారు. 'దాసరి కంటె పరేఖ్ పాలనాదకక్షుడు కాబట్టి ఆయన మాటకు ఎక్కువ విలువ నిచ్చాను, ఆ పాటి నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది, హిందాల్కో నుంచి నేను లంచం స్వీకరించినట్లు సిబిఐ రుజువు చేస్తే తప్ప నాకు దురుద్దేశం అంటగట్టలేరు' అని వాదిస్తాడు. ప్రస్తుత సమన్లు వచ్చాక హిందాల్కో కంపెనీ ''తాలాబిరా 2, 3 బ్లాకులు ఎలాట్ చేయబడిన జాయింటు వెంచర్‌లో మా వాటా 15% మాత్రమే అయినా, మేం యిప్పటికే 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. 2014 నుంచి బొగ్గు కేటాయింపులు ఆపేయడంతో బొగ్గు దిగుమతి చేసుకుని ఆ నష్టాన్ని కూడా భరిస్తున్నాం. మేం ఏ తప్పు చేయలేదు.'' అంటోంది.- (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)