టాలీవుడ్‌లో, ప్రత్యేకించి నైజాంలో ఆసియన్ సినిమాస్ అనేది ఓ అతి పెద్ద ఎగ్జిబిటర్.. ఇంకా డిస్ట్రిబ్యూటర్. అదే నైజాంలో శిరీష్/దిల్ రాజుల ఎస్వీసీ మరో పెద్ద పంపిణీ సంస్థ. ఇప్పుడు ఈ రెండు సంస్థలు ఓ అవగాహనకు వచ్చాయి. నైజాంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి కాస్త గడబిడగానే వుంటోంది. అప్పటి వరకు కాస్త మోనోపోలీ వుండేది. ఇప్పుడు మరో ఆల్టర్ నేటివ్‌గా మైత్రీ కనిపిస్తోంది. కానీ అలా అని ఎవరూ ఎగబడి సినిమాలు కొనేయడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఆసియన్- ఎస్వీసీ కలిసి ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసియన్ సినిమాస్ ఎక్కువగా సినిమాలు పంపిణీ చేయదు. సెలక్టివ్ గా చేస్తుంది. ఎక్కువగా భారీ తమిళ సినిమాలు తీసుకుంటూ వుంటుంది. ఇందులో సురేష్ సంస్థ కూడా భాగస్వామిగా వుంటూ వుంటుంది. ఇప్పుడు ఇకపై నైజాంలో ఆసియన్ సినిమాస్ సంస్థ ఎక్కువగా పంపిణీ వ్యాపారం చేయదు. వారితో అనుబంధం వున్న మూడు నాలుగు బ్యానర్ల సినిమాలు మాత్రమే చేస్తుంది. అన్నపూర్ణ, వైజయంతి ఇలా అన్నమాట. మొత్తం పంపిణీ వ్యాపారాలు శిరీష్ ఎస్వీసీ కే వదిలేస్తారు.
అదే సమయంలో ఎస్వీసీ నైజాం థియేటర్ల షెడ్యూలు వ్యవహారాలు అన్నీ ఆసియన్ సినిమాస్ చూస్తుంది. ఆ థియేటర్లను ఏ సినిమాలకు కేటాయించాలి లాంటి వ్యవహారాలు అన్నీ వీళ్లే చూసుకుంటారు. ఈ డీల్ అన్నది ఒక విధంగా ఎస్వీసీ కే లాభం. ఆసియన్ సినిమాస్ కు పెద్దగా ఒరిగేది వుండదు. అయితే ఎందుకు ఈ డీల్ లోకి ఆసియన్ సినిమాస్ వచ్చింది అంటే, సినిమా పంపిణీ వ్యాపారం చేయడం తలకు మించిన భారంగా మారడం, పోటీ పెరగడం, తమ విధానాలకు అనుగుణంగా సినిమాల పంపిణీ చేయడం కష్టంగా వుండడం ఇలాంటివి అన్నీ కలిసి ఈ డీల్ కు దారి తీసాయి.
ఇక ఇప్పడు నైజాం పంపిణీ రంగంలో మేజర్ ప్లేయర్లు ఇటు మైత్రీ అటు ఎస్వీసీ మాత్రమే వుంటాయి. కొత్తవాళ్లు ఎవరైనా ఎంటర్ అయితే అప్పుడు వేరే సంగతి. కానీ థియేటర్ల చేతిలో లేకుండా కొత్త వాళ్లు ఎంటర్ అయినా నైజాంలో చేయగలిగింది లేదు. అందుకే మైత్రీ సంస్థ నైజాంలో మెలమెల్లగా థియేటర్ల మీద పట్టు పెంచుకోవాలని పెట్టుబడులు పెడుతోంది. అదేే సమయంలో ఆసియన్ సంస్థ వివిధ హీరోల భాగస్వామ్యంలో మల్టీ ప్లెక్స్ ల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎస్వీసీ మాత్రం పంపిణీ రంగం మీద కీలకంగా దృష్టి పెడుతోంది.
Ohh